రానా ఇంటర్వ్యూ

Published On: August 2, 2017   |   Posted By:

రానా ఇంటర్వ్యూ

బాహుబలి-2 లాంటి భారీ విజయం తర్వాత రానా చేస్తున్న సినిమా “నేనే రాజు నేనే మంత్రి”.  ఈ సినిమా టీజర్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 11న గ్రాండ్ గా విడుదలకాబోతున్న ఈ సినిమాలో ప్రత్యేకతల్ని రానా స్వయంగా చెప్పుకొచ్చాడు. తన నుంచి ఫ్యాన్స్ ఏం ఆశిస్తున్నారో, ఆ కొత్తదనం ఈ సినిమాలో కచ్చితంగా ఉంటుందంటున్నాడు రానా.

జోగేంద్ర వెనక పెద్ద కథే ఉంది

జోగేంద్ర చుట్టూనే “నేనే రాజు నేనే మంత్రి” కథ తిరుగుతుంది. ఓ సామాన్యుడు పవర్ ఫుల్ వ్యక్తులపై ఎలా ఎదురుతిరిగాడు.. అలా ప్రతిఘటించే క్రమంలో ఆ మనిషి ఎలా మారిపోయాడు అనే విషయాన్ని సహజత్వానికి దగ్గరగా చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూస్తే జోగేంద్ర లాంటి వ్యక్తి మన మధ్య ఉన్నాడనే ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది

జోగేంద్ర ప్రాణం రాధ

సినిమాలో మొదట నా పేరు జోగేంద్ర గానే ఉంటుంది. తర్వాత రాధజోగేంద్రగా మారుతుంది. దీనికి కారణం రాధ అనే పాత్ర. కాజల్ ఈ పాత్ర పోషించింది. చాలా బాగా చేసింది. సినిమాలో నాకు భార్యగా నటించింది. నా పేరుకు ముందు రాధ అనే పేరు పెట్టామంటే ఇది ఎంత కీలకమైన పాత్రో అర్థం చేసుకోండి

క్యాథరీన్ ది చాలా కీలకమైన పాత్ర.. ప్రస్తుతానికి సస్పెన్స్

సినిమాలో క్యాథరీన్ ది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్. ఆమె క్యారెక్టర్ పేరేంటనే విషయాన్ని ఇప్పటికే ఫస్ట్ లుక్ ద్వారా చెప్పేశాం. కాకపోతే నాకు, క్యాథరీన్ ఏమౌతుంది. సినిమా కథకు క్యాథరీన్ కు ఏంటి సంబంధం అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

నాలో నెగెటివ్ షేడ్స్ కూడా చూస్తారు

ఓ ఫుల్ లెంగ్త్ పొలిటికల్ సినిమా చేద్దామనే ఉద్దేశంతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇది. ప్రస్తుతం తమిళనాట ఉన్న రాజకీయాలకు ఇది కాస్త దగ్గరగానే ఉంటుంది. ఒక ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే పాత్ర నాది. అందులో కూడా నిజాయితీగానే ఉంటాను. కాకపోతే అనుకోని కొన్ని కారణాల వల్ల రివర్స్ అవుతాను. అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కూడా కనిపిస్తాను.

తమిళ్ లో డైలాగులు, పాత్రలు వేరుగా ఉంటాయి

ఈ సినిమాను తెలుగులో తీసి తమిళ్ లో డబ్ చేయడం లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాం. తెలుగులో మీకు కనిపించిన నటీనటులు కొందరు, తమిళ వెర్షన్ లో ఉండరు. తెలుగులో మీకు వినిపించే కొన్ని డైలాగులు తమిళ్ లో ఉండవు. తమిళ వెర్షన్ కోసం ప్రత్యేకంగా ఓ యూనిట్ నే ఏర్పాటుచేశాం. డైలాగ్స్ ట్రాన్స్ లేట్ చేయకుండా.. ఒరిజినల్ రచయితలతో రాయించాం. కాబట్టి.. తమిళులకు ఇది తమ సినిమా అనే ఫీల్ కలుగుతుంది. మరీ ముఖ్యంగా సినిమాలో చాలా చోట్ల లుంగీలో కూడా కనిపిస్తాను కాబట్టి, వాళ్లు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను.

తేజను కాదు, కథను నమ్మాను

దర్శకుడు తేజ ట్రాక్ రికార్డు గురించి నేను ఆలోచించలేదు. ఆయన చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పేశాను. నేను, నాన్న కలిసి కథ విన్నాం. నాన్న చెప్పిన సలహాలను తేజ స్వీకరించారు. బాహుబలి-2 సెట్స్ పై ఉన్న టైమ్ లోనే అనుకున్న కథ కాబట్టి.. తేజకు ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేయడానికి చాలా టైం దొరికింది. అలా సినిమా బాగా వచ్చింది.

వెంకటేష్ తో సినిమా.. ఇప్పట్లో లేదు

వెంకీ బాబాయ్ తో ప్రస్తుతానికి సినిమా లేదు. తమిళ్ లో హిట్ అయిన విక్రమ్ వేద అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని… అందులో నేను, వెంకటేష్ కలిసి నటించనున్నామంటూ వార్తలు వచ్చాయి. ఇంటర్నెట్ లో నేను కూడా చదివాను. కానీ ఆ వార్తల్లో నిజంలేదు. ఈ సినిమా రీమేక్ చేయమని కనీసం ఎవరూ నన్ను సంప్రదించలేదు. నాన్న కూడా ఆ రీమేక్ రైట్స్ తీసుకునే ఆలోచన చేయడం లేదు.

అవును.. హాలీవుడ్ సినిమా చేస్తున్నా

హాలీవుడ్ సినిమా చేయబోతున్నాను. కానీ వాటి వివరాల్ని మాత్రం అప్పుడే చెప్పలేను. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్  స్టేజ్ లో ఉంది. డిస్కషన్స్ పూర్తయిన తర్వాత వెల్లడిస్తాను.