‘రాహు’ మూవీ రివ్యూ

Published On: February 29, 2020   |   Posted By:

‘రాహు’ మూవీ రివ్యూ

ఊహూ !! (‘రాహు’ మూవీ రివ్యూ)
 
Rating:1.5/5
 
రాక్షస బల్లులు ఈ ప్రపంచంలోకి మళ్లీ వచ్చాయి అనే పాయింట్ ని జనం నమ్ముతారా అంటే దాన్ని నమ్మశక్యంగా చెప్పాలి..అది స్పీల్ బర్గ్ వంటి మహా దర్శకుడు చేయగలిగాడు. అలాగే జాతకం ప్రకారం రాహు దోషం ఉన్న ఓ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ముప్పై రోజుల్లో చచ్చిపోతుందా అంటే …చస్తుంది అని నమ్మించగలిగితేనే ఇంటెన్సిటీ పుడుతుంది. లేకపోతే ఆ కథకే రాహు దోషం అంటుకుని వీకెండ్ కాకుండా చచ్చిపోతుంది. ఈ వారం రిలీజైన రాహు అనే సినిమా…ఇలాంటి పాయింట్ నే డీల్ చేస్తూవచ్చింది. మరి ఈ సినిమా జాతకం బాగుందా…చూసేవాడి జాతకంపై ఆధారపడి ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

భాను అనే అమ్మాయి  ఆరేళ్ల వయస్సు నుంచే కన్వర్షన్ డిజార్డర్‌తో బాధపడుతుంటుంది. ఈ డిజార్డర్ లక్షణం ఏమిటీ అంటే…రక్తం చూస్తే కొంతసేపు తనకు కళ్లు కనిపించవు. ఆమె తండ్రి భార్గవ్ (సుబ్బు వేదుల) అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ . భార్యను కోల్పోయినా ఆ లోటు కనపడనీయకుండా  కూతురు భాను (కృతి గార్గ్)ను జీవితంపట్ల ఒక లక్ష్యంతో పెంచుతాడు. అయితే పెరిగి పెద్దైనా ఆ వ్యాధి తగ్గదు.  ఈ లోగా ఆమె తండ్రి విధి నిర్వహణలో భాగంగా  గ్యాంగ్ స్టర్ నాగరాజు (కాలకేయ ప్రభాకర్)ను పట్టుకుని జైలుకు పంపిస్తాడు. ఆ క్రమంలో అతని తమ్ముడుని చంపాల్సి వస్తుంది. దాంతో జైలుకు వెళ్తున్న నాగరాజు..ఓ శపధం చేస్తాడు. నా తమ్ముడుని చంపావు కాబట్టి ..నీ కూతురు భానుని చంపుతానని ఛాలెంజ్ చేసి మరీ జైలుకు వెళ్తాడు.

ఇదిలా ఉంటే జాతకం ప్రకారం భానుకు రాహు దోషం ఉంటుంది. పెళ్లైతే 30 రోజుల్లో చనిపోతుందని జ్యోతిష్యుడు చెబుతాడు. అయితే అప్పటికే ఆమె శేషు (అభిరామ్) తో ప్రేమలో ఉంటుంది. కానీ తండ్రి ఈ పెళ్లికు ఒప్పుకోడు. అయితే ఆయనకు చెప్పకుండా శేషుతో సంసారం పెట్టేస్తుంది. ఓ నెల తర్వాత తండ్రికి మెల్లిగా చెప్పాలనుకుంటుంది.

ఈ లోగా ముప్పై రోజులు పూర్తవుతాయి. భాను కిడ్నాప్ అవుతుంది. మరో ప్రక్క నాగరాజు జైలు నుంచి పారిపోయి…ఓ సీక్రెట్ ప్లేస్ లో తల దాచుకుంటాడు. కిడ్నాపర్స్ నుంచి తప్పించుకున్న భాను…ప్రాణాలు దక్కించుకునేందుకు తెలియక నాగరాజు స్దావరంలోకి వస్తుంది.  అలాగే శేషు కూడా భానును అన్వేషిస్తూ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భాను ప్రాణాలతో ఎలా భయటపడింది? శేషు, నాగరాజులో ఎవరు శత్రువు…చివరకు భాను పరిస్దితి ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
స్క్రీన్ ప్లే జాతకం ఎలా ఉంది..

థ్రిల్లర్ కు, జాతకాలు ముడిపెడితే అస్ట్రాలజికల్ థ్రిల్లర్ అవుతుందేమో…  ఈ సినిమా చూస్తూంటే అదే అనిపిస్తుంది. జాతకంలో రాహు దోషం ఉన్న అమ్మాయి…పెళ్లైతే ముప్పై రోజుల్లో చనిపోతుందనే లాక్ వేసాడు దర్శకుడు. అయితే ఈ కథలో బిలీవబులిటీ రావాలంటే ముందుగా జాతకాలను ఎక్కడో చోట మనం నమ్మతే నిజమే అనిపిస్తుంది. లేకపోతే సబ్ కాన్షియస్ మైండ్ లో ఇదేం కథరా దేవుడా అనిపిస్తుంది. అయితే దర్శకుడు అంతలా నమ్మించలేకపోయాడనే చెప్పాలి.

అలాగే పెద్దగా ఆసక్తిగా అనిపించని కన్వర్షన్ డిజార్డర్ అనే ఆరోగ్య సమస్య చుట్టూనే కథ మొత్తం నడిపించాడు. అసలే సినిమా నెమ్మది..అది చాలదన్నట్లు డైరక్టర్ ఇంటర్వెల్ దాకా కూడా కథలోకి వెళ్లడు. ఎరౌండ్ ద బుష్ అన్నట్లు అక్కడక్కడే చక్కర్లు కొడుతూ..పాటలు, సెటప్ సీన్స్ తో కాలక్షేపం చేసేస్తాడు. సెకండాఫ్ లో ఏదన్నా అద్బుతం జరుగుతుందా అంటే ..హీరోయిన్ నాగరాజు ఇంట్లోకి అడుగుపెట్టగానే అక్కడే ఆగుతుంది. క్లైమాక్స్‌కు వచ్చేసరికి హీరో హీరోయిన్ల మధ్య జరిగే కాంప్లిక్ట్ నిలబడలేదు.  క్లైమాక్స్‌ థ్రిల్లింగ్ గా  ఉంటుందని ఊహిస్తే తుస్ మనిపించాడు.

ఏదైమైనా నటుడిగా తన ప్రతిభ చూపాలని దర్శకుడు సుబ్బు వేదుల… కథా పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా వర్కవుట్ అయ్యేది.
 
దర్శకత్వం, మిగతా విభాగాలు

దర్శకుడు సుబ్బు వేదుల మంచి స్టోరీ లైన్ నే తయారు చేసుకున్నాడు. కానీ అందుకు తగ్గ సీన్స్ ను రాసుకోలేకపోయాడు .. దాంతో  స్క్రీన్ ప్లే పేలవంగా తయారైంది. అదే సినిమాని దెబ్బ కొట్టింది. మేకింగ్ అలాగే ఉంది. ప్రారంభంలో వచ్చే యాక్షన్ సన్నివేశం చూడగానే దర్శకుడి అనుభవలేమి అర్థమవుతుంది. ఓ దర్శకుడుగా ఇది ప్రధాన లోపం. నిర్మాణ విలువలు బాగున్నాయి.

శేషు పాత్రలో అభిరామ్ వెంటనే కనెక్ట్ అవటం కొద్దిగా కష్టం. అప్పటికీ ఫస్టాఫ్ , సెకండాఫ్ తేడా చూపెడుతూ…తన పాత్రలోని వేరియేషన్స్ తో మెప్పించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఇక యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన భాను పాత్రని కృతి గార్గ్ చాలా బాగా చేసిందనే చెప్పాలి.  నాగరాజు గా చేసిన కాలకేయ ప్రభాకర్ గురించి కొత్తగా చెప్పేదేముంది.  ఇక మిగిలినవన్నీ అంతంత మాత్రం పాత్రలే.  

టెక్నికల్ గా చూస్తే…

ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం జస్ట్ ఓకే. పాటల్లో ‘ఏదో ఏదో ..’ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ  బాగుంది. కెమెరా వర్క్ బాగుంది.  అమర్ రెడ్డి ఎడిటింగ్ కూడా ఓకే.

చూడచ్చా

అంత పరుగెత్తుకు వెళ్లి చూడాల్సిన సినిమా కాదు.

ఎవరెవరు..

నటీనటులు: అభిరామ్‌ వర్మ, కృతిగార్గ్‌, చలాకీ చంటి, కాలకేయ ప్రభాకర్‌ తదితరులు
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: సురేశ్‌ రగుటు, ఈశ్వర్‌ ఎల్లుమహంతి
ఎడిటింగ్‌: అమర్‌రెడ్డి
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శ్రీనివాసరావు బేతపూడి
ప్రొడ్యూసర్స్‌: ఏవీఆర్‌ స్వామి, రాజా దేవరకొండ, శ్రీశక్తి బాబ్జీ, సుబ్బు వేదుల
రచన, దర్శకత్వం: సుబ్బు వేదుల
బ్యానర్‌: శ్రీ శక్తి స్వరూప్‌ మూవీ క్రియేషన్స్‌