రా రా మూవీ రివ్యూ

Published On: February 23, 2018   |   Posted By:
రా రా మూవీ రివ్యూ
బ్యాన‌ర్‌: విజి చెర్రీస్ విజ‌న్‌
న‌టీన‌టులు: శ‌్రీకాంత్‌, నాజియా, సీతా నారాయ‌ణ‌, ర‌ఘుబాబు, అలీ, హేమ‌, ర‌ఘుబాబు, అదుర్స్ ర‌ఘు, పోసాని కృష్ణ‌ముర‌ళి, న‌ల్ల‌వేణు, ష‌క‌ల‌క శంక‌ర్‌ త‌దిత‌రులు
మ్యూజిక్‌: ర‌్యాప్ రాక్ ష‌కీల్
కెమెరా:  పూర్ణ‌
నిర్మాత‌: ఎం.విజ‌య్‌
ద‌ర్శ‌క‌తం:విజి చరిష్ యూనిట్
హీరో శ్రీకాంత్ సినిమాలంటే ప్రేక్ష‌కుల్లో కాస్త ఆస‌క్తి నెల‌కొని ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అందుకు కార‌ణం శ్రీకాంత్ త‌న‌దైన న‌టన‌తో హీరోగా 125 సినిమాల్లోమెప్పించారు మ‌రి. వంద సినిమాల‌కు పైగా న‌టించిన శ్రీకాంత్ తొలిసారి హార‌ర్ సినిమాలో న‌టించాల‌నే కోరిక‌తో చేసిన సినిమాయే `రా..రా`. ఇప్పుడు టాలీవుడ్‌లో హార‌ర్ కామెడీ చిత్రాల ట్రెండ్ బాగానే న‌డుస్తుంది. మ‌రి `రా..రా`తో శ్రీకాంత్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించారా?  లేదా? అని తెలియాలంటే క‌థ‌లోకి వెళ‌దాం..
క‌థ‌:
రాజ్‌కిర‌ణ్‌(శ్రీకాంత్) తండ్రి టాలీవుడ్‌లో పెద్ద డైరెక్ట‌ర్. తండ్రిలా గొప్ప డైరెక్ట‌ర్ కావాల‌నుకుని రాజ్‌కిర‌ణ్ చేసిన మూడు సినిమాలు ప్లాపుల‌వుతాయి. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలంటే హార‌ర్ జోన‌ర్‌లో సినిమా చేయాలనుకుంటాడు. మంచి హార‌ర్ క‌థ కోసం పురాత‌న బంగ‌ళాలోకి త‌న టీం (జీవా, న‌ల్ల‌వేణు, న‌జియా త‌దిత‌రులు)తో క‌లిసి వెళ‌తాడు. అక్క‌డ ఆల్ రెడీ ఆత్మ‌లుగా తిరుగుతున్న ర‌ఘుబాబు, హేమ, అలీ, అత‌ని కొడుకు, బామ్మ‌ర్ధి వీరిని బెదిరగొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. అయితే రాజ్‌కిర‌ణ్ అత‌ని టీమ్ ఈ ఆత్మ‌ల‌కు పెద్ద‌గా భ‌య‌ప‌డ‌వు. దాంతో అవి ఇంటి నుండి వెళ్లిపోయే స‌మ‌యంలో క‌థ‌లో అస‌లు ట్విస్ట్ మొద‌లవుతుంది. బంగ‌ళాకు అస‌లు య‌జ‌మానురాలినంటూ సీతా నారాయ‌ణ‌న్ త‌న ఇద్ద‌రి చెల్లెల‌తో వ‌స్తుంది. అస‌లు సీతా నారాయ‌ణ‌న్ ఎవ‌రు?  క‌థ‌లో అస‌లు ట్విస్ట్ ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
స‌మీక్ష:
న‌టీన‌టులు ప‌రంగా చూస్తే ముఖ్యంగా శ్రీకాంత్ గురించి చెప్పుకోవాలి. ఆయ‌న న‌ట‌న గురించి పెద్ద‌గా చెప్పుకునే ప‌నిలేదు. ద‌ర్శ‌కుడు త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ను స‌క్ర‌మంగా పూర్తి చేశాడు. అయితే శ్రీకాంత్ వంటి హీరో చేయ‌ద‌గ్గ సినిమా కాద‌ని సినిమా చూసే ప్ర‌క్ష‌కుడికి అనిపిస్తుంది. ఆయ‌న స్థాయిని త‌గ్గించే సినిమా ఇది. సినిమాలో అలీ, పోసాని, అదుర్స్ ర‌ఘు, ష‌క‌ల‌క శంక‌ర్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, హేమ స‌హా స్టార్ కాస్ట్ న‌టించిన స‌న్నివేశాల‌ను స‌రిగ్గా రాసుకోక‌పోవ‌డం, అనుకున్న రీతిలో తెర‌కెక్కించ‌క‌పోవ‌డంతో సినిమా ప్రేక్ష‌కుడి స‌హనానికి ప‌రీక్ష‌లా మారింది. సినిమాకు మంచి ద‌ర్శ‌కుడు ప‌నిచేయ‌క‌పోవ‌డం ఇత్యాది కార‌ణాల‌తో పాటు ర్యాప్ రాక్ ష‌కీల్ సంగీతం, నేప‌త్య సంగీతం, పూర్ణ సినిమాటోగ్ర‌ఫీ ఏవీ స‌హ‌య‌ప‌డ‌లేదు.. హార‌ర్ చిత్రాలంటే సంగీతం, నేప‌థ్య సంగీతం, సినిమాటోగ్ర‌ఫీయే కీల‌కాంశాలుగా సినిమాను న‌డిపించాలి. ఈ సినిమా విష‌యంలో అన్ని డిపార్ట్‌మెంట్స్ ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. గ్రాఫిక్స్‌, డిఐ అన్నీ నాసిర‌కంగా ఉన్నాయి.
చివ‌ర‌గా.. ఆక‌ట్టుకోని `రా..రా`
రేటింగ్ : 2.25/5