రూలర్ మూవీ రివ్యూ

Published On: December 20, 2019   |   Posted By:

రూలర్ మూవీ రివ్యూ

కష్టం సార్..(‘రూలర్’ రివ్యూ)

Rating: 2/5

గతంలో ఎలా హిట్ వచ్చిందో చూసుకుని ఇప్పుడు అదే ఫంధాను ఫాలో అవుదామని ప్రయత్నం చేయటం అనేది ఎప్పుడూ ప్రమాదమే. ఎందుకంటే కాలం మారుతూంటుంది. ప్రేక్షకులూ మారుతూంటారు. కానీ మేమే మారం…ఇదే పద్దతిలో వెళ్తాం అంటే ఎవరేం చెయ్యగలుగుతారు. బాలయ్య కొత్త ప్రయోగాలుకు దూరం కాదు కానీ పాత పద్దతినూ పూర్తి గా నమ్మే రకం. అదే ఆయన్ని ఇబ్బందుల్లో పడేస్తోంది. అందులోనూ తన తండ్రి బయోపిక్…చూసే వారికి భయోపిక్ గా మారాక, ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఈ సిట్యువేషన్ లో తనతో గతంలో అధినాయకుడు చిత్రం డైరక్ట్ చేసిన పరుచూరి మురళి ఇచ్చిన కథను తీసుకుని, తనతో జై సింహా చేసిన దర్శకుడుతో ముందుకు వెళ్ళటం సాహసమే. ఆ సాహసం సరైన ఫలితాన్ని ఇచ్చిందా..ఎంతవరకూ సక్సెస్ అయ్యింది..బాలయ్యకు నచ్చిన ఈ కథేంటి…రూలర్ టైటిల్ కు న్యాయం చేసారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
స్టోరీ లైన్..

ప్రముఖ పారిశ్రామిక వేత్త సరోజిని ప్రసాద్ (జయసుధ)కు ఓ రోజు ఓ వ్యక్తి (బాలయ్య) గాయాలతో ,తనెవరో తెలియని పరిస్దితుల్లో కనపడతాడు. గతమేమిటో గుర్తుకు రాని అతనికి అర్జున్ ప్రసాద్ అనే పేరు పెట్టి ఇంట్లో పెట్టుకుని,తన కొడుకుగా సాకుతుంది. తన కంపెనీని అతని చేతిలో పెడుతుంది. రాత్రింబవళ్లూ కష్టపడి,తన తెలివితో అర్జున్ ప్రసాద్ ..ఆ కంపెనీని నెంబర్ వన్ స్టేజీకి తీసుకెళ్తాడు. ఈ లోగా ఉత్తర ప్రదేశ్ లో ఓ ప్రాజెక్టు ఉందని తెలసి, అక్కడికి వెళ్ళబోతే ఆమె అడ్డుకుంటుంది. తనకు అక్కడే గతంలో అవమానం జరిగిందని, వెళ్లద్దని అంటుంది.

తన తల్లిని అవమాన పరచిన వాడని వదలనంటూ బయిలు దేరిన అర్జున్ ప్రసాద్ అక్కడ కొత్త ప్రపంచం కనపడుతుంది. అక్కడ వారంతా అతన్ని ధర్మా అని పిలుస్తూంటారు. తను ఎవరో తెలిసినట్లు బిహేవ్ చేస్తూంటారు. ఇంతకీ ఈ అర్జున్ ప్రసాద్..ఆ ధర్మా ఒకరేనా, లేక ఇద్దరు వ్యక్తులా..అక్కడి వారికి ధర్మాకు రిలేషన్ ఏమిటి..ఇద్దరు వేర్వేరు అయితే ఆ ధర్మా ఏమయ్యాడు. ఒకడే అయితే ధర్మా కు ఎలా గతం మర్చిపోయాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎన్నో సార్లు చూసేసాం..

నిజానికి ఇలాంటి కథలు బాలయ్య చాలా చేసారు. మిగతా సీనియర్ స్టార్స్ చేసేసారు. ఫస్టాఫ్ అంతా వేరే వ్యక్తిగా చలామణి అయ్యి..హఠాత్తుగా ఇంటర్వెల్ దగ్గర ఎవరో గుర్తు పట్టడం…అతనికో ప్లాష్ బ్యాక్ ఉండటం…ఆ ప్లాష్ బ్యాక్ విన్న హీరో తానెవరో తెలుసుకుని, వెళ్లి  విలన్స్  ని గుర్తు పట్టి చావ కొట్టడం జరుగుతూంటుంది. ఈ కథ కూడా అందుకు అతీతమైనది కాదు. అయితే విలన్ కు ఫలానా వ్యక్తే హీరో అని తెలియటం అనే పాయింట్ తర్వాత జరగాల్సిన పోరు సరిగ్గా లేకపోతే ఇలాంటి కథలు తేలిపోతాయి. గతంలో రవితేజ బలుపు కూడా ఇలాంటి కథతోనే వచ్చింది. అయితే అందులో విలన్ ట్రాక్ సమర్దవంతంగా ఉంటుంది. ఇక్కడ అదే మిస్సైంది. ప్లాష్ బ్యాక్ లో అదరకొట్టిన విలన్…ప్రెజంట్ లో తుస్సుమనించి, సినిమాని నీరు కార్చేస్తాడు.

దర్శకత్వం, మిగతా విభాగాలు…

ఈ సినిమా చూస్తే మనకు అర్దమయ్యే విషయం ఏమిటీ అంటే దర్శకుడు పరుచూరి మురళి ఏ పదిహేనేళ్ల క్రితమో ఈ కథ చేసుకుని ఇప్పుడు బాలయ్యకు అమ్మి ఉంటాడని.  ఈ జనరేషన్ వాళ్లకు ఇలాంటి కథలు ఎంత వరకూ ఒప్పుకుంటారనే ఆలోచన లేకుండా బాలయ్య చేసేసారు. డైరక్టర్ కెఎస్ రవికుమార్ సైతం …సినిమా చేయటమే ముఖ్యమన్నట్లు గా చేసారు కానీ మిగతా విషయాలు  పట్టించుకున్నట్లు లేరు. ఆయన పెద్ద  శ్రద్ద పెట్టలేదని చాలా సీన్స్ చూస్తూంటే మనకు అర్దమైపోతుంది.

సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవోగా బాలకృష్ణ బాగా చేసారు. బ్యాంకాక్‌ లో వచ్చే సీన్స్, సొనాల్‌ చౌహాన్‌తో డ్యూయెట్‌ వంటివాటిల్లో బాలయ్య తనదైన నటన, స్టెప్‌లతో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. అంతకు మించి చెప్పుకోవటానికి ఏమీ లేదు.నిర్మాత కళ్యాణ్ కూడా ప్రొడక్షన్ ని వదిలేసారనిపిస్తుంది. చిరంతన్ భట్ మ్యూజిక్ విషయానికి వస్తే సౌండ్ పొల్యూషన్ కంప్లైంట్ ఇవ్వాలనిపిస్తుంది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మాత్రం మరింత క్రిస్ప్ గా ఉండాలి.  

చూడచ్చా…

మాస్ మసాలాలు ఇష్టపడే వారికి సైతం కష్టంగా అనిపించే సినిమా ఇది.

ఎవరెవరు..

నటీనటులు:నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, ప్రకాశ్ రాజ్, భూమిక చావ్లా, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు
కథ: పరుచూరి మురళి,
మ్యూజిక్: చిరంతన్ భట్,
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్,
ఆర్ట్: చిన్నా,
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల,
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు,
కొరియోగ్రఫీ: జానీ, ప్రేమ్ రక్షిత్.
నిర్మాత: సి.కల్యాణ్,
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు,
స్క్రీన్ ప్లే,  దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్,
విడుదల తేదీ: 20-12-2019