లవర్స్ డే మూవీ రివ్యూ

Published On: February 14, 2019   |   Posted By:

లవర్స్ డే  మూవీ రివ్యూ

లవర్స్ కు కూడా కష్టమే – లవర్స్ డే  మూవీ

Rating: 1.5/5

టీనేజ్ లో ఉండే పిల్లలు ఎంత బాగుంటారో వారి మధ్య జరిగే ప్రేమ కథలు కూడా అంతే అందంగా ఉంటాయి. అయితే వాటిని  వాటంగా పట్టుకుని తెరపై మొహమాటం లేకుండా అనువదించగలగాలి. అలా ప్రతీ జనరేషన్ కు అప్పటి యూత్ ని ప్రతిబింబించే టీనేజ్ లవ్ స్టోరీలు వచ్చి హిట్ అవుతాయి. అది ప్రేమ సాగరం, ప్రేమిస్తే, చిత్రం, నువ్వే కావాలి, హ్యాపీడేస్ ఇలా ఏదైనా కావచ్చు. అయితే అది ఖచ్చితంగా అప్పటి సమాజాన్ని ప్రతిబింబించగలిగాలి. అప్పుడే యూత్ కనెక్ట్ అవుతుంది.  ఇక లవర్స్ డే సినిమా విషయానికి వస్తే అదే మిస్సైంది. ఆ కథ ఈ కాలం నాటిది కాదు. పాత జమానాలోది. ఇప్పుడు అంతా స్పీడు యుగం. సెల్ నెంబర్ మార్చినట్లు ప్రేమ కథల్లో పార్టనర్స్ స్పీడుగా మారిపోతున్నారు. అంతేకానీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ని నమ్ముకుని చెట్లు ,పుట్టలు పట్టుకుని ప్రేమ పాటలు, విరహ గీతాలు పాడుకోవటం లేదు. కానీ ఈ దర్శకుడు అదే పనిచేసాడు. మనం ఎప్పుడో వదిలేసిన కాలేజ్ కుళ్లు జోక్స్, క్లాస్ రూమ్ సీన్స్ ని అప్ డేట్స్ అన్నట్లుగా అందించారు. ప్రియా ప్రకాష్ ని చూడ్డానికి వెళ్లాము ఓకే..కానీ అస్తమానూ పని ఉన్నా లేకపోయినా ఆమెనే చూస్తూ కూర్చోలేం కదా. ఇవి దర్శకుడు మర్చిపోయాడో లేక అసలు తెలియదో కానీ ఓ టీనేజ్ లవ్ స్టోరీ చేస్తున్నాననుకుని అదేదో చేసేసాడు. 
సర్లేండి ఏం చేసాడు.ఆ కథేంటి.ఆ లోపాలేంటో రివ్యూలో చూసేద్దాం. 

స్టోరీ లైన్ ఏంటంటే… 

ఆ ఊళ్లోని  డాన్ బాస్కో హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్లో (అంటే మనం ఇక్కడ కాలేజి అని అర్దం చేసుకోవాలి)   చదువుకుంటున్న టీనేజ్ పిల్లల ప్రేమ కథ ఇది. ఆకర్షణకు ప్రేమ కు తేడా తెలియని వయస్సు లో  ఉన్న వాళ్లలో కాస్త ఎక్కువ యాక్టివ్ గా రోష‌న్ (రోష‌న్‌),   ప్రియ (ప్రియా వారియ‌ర్‌) ఉంటారు. రొటీన్ గానే ప్రియను రోషన్ టీజ్ చేయుట, ఆ తర్వాత ప్రేమలో పడిపోవటం యధావిధిగా జరిగిపోతాయి. అంతేకాదు ప్రియ మొదట తాను ప్రేమలో పడలేదని బెట్టు చేసినా తర్వాత తన మనస్సుని రోషన్ ముందు పరిచేస్తుంది. ఇదంతా వాళ్ల ప్రెండ్స్ ఎంజాయ్ చేస్తూంటారు. వాళ్ల పని అదే కదా. ఆ తర్వాత తమ స్కూల్ (అదే కాలేజి) పిల్లలు పెట్టుకున్న వాట్సప్  గ్రూప్ లో పోస్ట్ అయిన ఓ వీడియో వల్ల రోషన్ అందరిముందూ దోషిగా నిలబడాడు. ప్రియ అయినా తనను అర్దం చేసుకుంటుందేమో అనుకుంటే ఆమె బ్రేకప్ చెప్పేస్తుంది. ఇలా వీరిద్దరూ విడిపోయారు కదా. దాంతో వీళ్లిద్దరి కన్నా ఎక్కువ మధన పడిపోతూంటారు వాళ్ల ఫ్రెండ్స్. వాళ్లు ఎలాగైనా కలపాలని ఓ ప్లాన్ చేస్తారు. ఆమెలో అసూయ పుట్టిస్తే పరుగెత్తుకొచ్చి ఐలవ్ యూ చెప్పేస్తుందనే సలహా రోషన్ కు ఇస్తారు. అంతేకాదు. గాథ అనే మరో అమ్మాయితో ప్రేమ నటించమంటారు. కానీ నిజంగానే గాథ, రోషన్ లు ప్రేమలో పడిపోతారు. అప్పుడు ఏమైంది ? ప్రియ పరిస్దితి ఏమిటి ? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   

ఎక్కడుంది లోపం

మొదట ఇలాంటి కథలు ఉన్న సినిమాలు  బోలెడు మనం చూస్తూ పెరిగాం. ఇప్పటికీ పాత సినిమాలు టీవి ల్లో చూసేవారికి ఈ కథ బాగా తెలుసు. కాబట్టి పెద్దగా ఎక్సైట్మెంట్ లేదు. ఇక కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా కదా అని ఆవేశపడితే,అది ఊహించి రాసిన కాలేజ్ సీన్స్ లా ఉంటాయి కానీ అసలు నిజంగా కాలేజీలో జరుగుతున్నట్లు అనిపించవు. కెరీర్ ఓరియెంటేషన్ గా మారిపోయిన  ఈ రోజుల్లో ఇలాంటి క్లాస్ రూమ్ లు ఉన్నాయా ?అనే సందేహం వస్తుంది. అంతేకాదు ఈ డైరక్టర్ తెలుగు సినిమాల రిఫెరెన్స్ లు ఏమన్నా తీసుకున్నాడేమో అని అనుమానం పెరిగిపోతుంది.

ట్రైలర్ లో చూసిందే తప్ప

ఈ మధ్యన సినిమా డైరక్టర్స్ కన్నా టీజర్స్, ట్రైలర్స్ కట్ చేసే వాళ్ల క్రియేటివిటీ బాగుంటోంది. జనాలకు ఏది పడుతుందో ఊహించి ఆ కోణంలో వాటిని డిజైన్ చేస్తున్నారు. దాంతో అవి చూసి సినిమా అంతా అలాగే ఉంటుందని థియోటర్ కు పరుగెత్తుకొచ్చే సినిమా అమాయకులు బలైపోక తప్పదు. అలాంటి బలి ఖండాల్లో దీన్నికూడా చేర్చాల్సిన ఆవశ్యత ఉంది.

అతి తెలివి అర్దమైపోతుంది

ట్రైలర్ లో ప్రియాప్రకాష్ కన్ను కొట్టే వ్యవహారం బాగా క్లిక్ అవ్వటంతో డైరక్టర్ కు ఆ సినిమాని అమ్మాలంటే ఆ అమ్మాయే యుఎస్ పి అని అర్దమైనట్లుంది. దాంతో చాలా కాలం రీషూట్స్ పెట్టుకుని, ఆమె పాత్రను పెంచారు. అయితే పాత్ర లెంగ్త్ అయితే పెరిగింది కానీ కథలో విషయం పెరగలేదు. దాంతో పెంచిన సీన్స్ అన్నిటిని అడ్డంగా నరికేస్తే తప్ప చూసే వారికి మనశ్సాంతి ఉండేటట్లుగా లేదు.  

సాంకేతికంగా

ఇది కేవలం ప్రియా ప్రకాష్ వారియర్ ని క్యాష్ చేసుకోవటానికి చేసిన ఓ ప్రయత్నం. కాబట్టి మిగతా వన్ని ఖచ్చితంగా చుట్టేసి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు అనే ప్లాన్ చేసి ఉంటారు. లేకపోతే అంత నాశిగా ఎందుకుంటుంది చెప్పండి. పాటల్లో రెండు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. డైరక్షన్ పూర్, డబ్బింగ్ డైలాగులు అయితే టీవిల్లో కార్టూన్ పోగ్రామ్ లకు చెప్పే వారి చేతే చెప్పించినట్లున్నాయి. కెమెరా వర్క్ కాస్త చెప్పుకోదగనిదిగా ఉంది. 

ఆఖరి మాట

ఈ సినిమా వాలకం చూస్తూంటే కలెక్షన్స్ పెద్దగా ఉండేటట్లు కనపడటం లేదు. జనం లేని థియోటర్స్ లిస్ట్ ప్రకటిస్తే ఆ విషయం తెలిసుకుని లవర్స్ ఎగబడటం ఖాయం.  

తెర వెనక ముందు:-

న‌టీన‌టులు: ప్రియా ప్రకాశ్‌ వారియర్, నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులుఛాయాగ్ర‌హ‌ణం: శీను సిద్ధార్థ్‌
కూర్పు: అచ్చు విజ‌య‌న్‌
సంగీతం: షాన్ రెహ‌మాన్‌
స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌ లిజో ప‌నాడా
నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు సంస్థ: సుఖీభవ సినిమాస్ విడుదల: 14 ఫిబ్రవరి 2019