వంశీ దర్శకత్వంలో  పసలపూడి

Published On: April 17, 2018   |   Posted By:

వంశీ దర్శకత్వంలో  పసలపూడి

దర్శకుడు వంశీ గురించి, ఆయన చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తెలుగు దనం ఉట్టి పడే  పాత్ర చిత్రణ, ఆరోగ్యకరమైన కామెడీ, విభిన్నమైన కథాంశం ఆయన సినిమాల్లోని ప్రత్యేకత. దర్శకుడిగానే కాదు, రచయితగా ‘పసలపూడి కథలు, ‘దిగువ గోదావరి కథలు’ రచించారు. రచయితగానే కాదు దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకున్న వంశీ ఎన్నో గుర్తుంచుకోదగిన సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వంలో వంశీ మార్కు సినిమా వచ్చి చాలా కాలమైంది.

వంశీ సినిమాలను ఆదరించేవారు చాలామంది ఉన్నారు. వాళ్లందరికీ ఒక శుభవార్త. త్వరలోనే వంశీ ఓ కొత్త సినిమా ప్రారంభించబోతున్నారు. సినిమా పేరు ‘పసలపూడి’. పసలపూడి అనేది ఆయన స్వగ్రామం. రచయితగా ఆయనకు పేరు తెచ్చిన రచన ‘పసలపూడి కథలు’. ఇప్పుడు పసలపూడి టైటిల్‌తోనే సినిమా చేస్తున్నారు వంశీ. ఆయన సినిమాలకు, రచనలకు బాపుతోనే టైటిల్స్ రాయించేవారు. ఇప్పుడు ‘పసలపూడి’ సినిమాకి బాపుతోనే టైటిల్ రాయించుకొని భద్రంగా దాచుకున్నానని వంశీ తెలిపారు. ఈ సినిమా తర్వాత తను చేయబోయే కొన్ని సినిమాలకు బాపు గీసిన టైటిల్స్ ఉన్నాయని తెలిపారు వంశీ.