‘విశ్వాసం’ రివ్యూ

Published On: March 4, 2019   |   Posted By:

‘అతి’ ‘విశ్వాసం’ రివ్యూ

రేటింగ్ : 2/5


వీర్రాజు (అజిత్) ఓ పెద్ద మనిషి. అన్యాయం అంటే అరవై ఊళ్లు దాటైనా వెళ్లి న్యాయం చేసి వస్తూంటాడు. కానీ మన సమాజం, కుటుంబాలు ఎలాంటివి? సుభాష్ చంద్రబోస్, గాంధీ లు ప్రక్కింట్లో పుట్టి మనకోసం పనిచేయాలి కాని, మనింట్లో పుట్టకూడదని భావించే బ్యాచ్. అందుకేనేమో అతన్ని వాళ్లావిడ నిరంజన(నయనతార) ఏక్సెప్ట్ చేయలేదు (సర్లే ఎవరి భార్యలు ఎవరిని ఏక్సెప్ట్ చేస్తున్నారు, ఏక్సెప్ట్ చేసినట్లు నటిస్తున్నారు అంటే చెప్పలేం కానీ) . నీ లాంటి వ్యక్తి వల్ల సమాజానికి, మన ఊరికి ఉపయోగమేమో కానీ మన ఫ్యామిలీకు సమస్యలు వచ్చేస్తున్నాయి అంటుంది. 


ముఖ్యంగా నీ మీద కోపంగా ఉన్న వాళ్లు మన బిడ్డ మీద దాన్ని చూపిస్తున్నారు అంటూ వాపోతుంది. కానీ పులిని ఎక్కిన వాడు దిగగలడా? అలాగే అందరి తలలో నాలుకలా, ఓ పెద్ద మనిషిలా ఉపకారం చేసే వ్యక్తిలా పేరు వచ్చాక దాన్ని వదులుకుని ఎవరైనా వెళ్లగలరా? అదే పరిస్దితి వీర్రాజు కు వచ్చింది. భార్య ముఖ్యమా? తనని, తన శక్తి సామర్ధ్యాలని నమ్ముకున్న జనం ముఖ్యమా? అంటే మందిగా ఉన్న జనం ముఖ్యం అనుకున్నాడు. ఇదంతా గతం. పదేళ్ల క్రితం నాటి మాట…


మరి వర్తమానం ఏమిటి…


రావులపాలెం ప్రాంతానికి చెందిన వీర్రాజు చెప్పిందే అక్కడ జనాలకి శాసనం. చుట్టు పక్కల గ్రామాలకు ఆయనో దేవుడు. ఆయన చెప్పిందే  వేదం. తమ వాళ్లకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే వీర్రాజు అంటే అందరికీ భయం, భక్తి. ఇలా పెదరాయుడు తరహాలో చాలా బిల్డప్ లు ఉంటాయి. 


ఇక పదేళ్లకోసారి వాళ్ల ఊళ్లో  జరిగే జాతరకు బయటి ఊర్లకు పని కోసం, చదువు కోసం వెళ్లిన వారంతా తిరిగి వస్తూండటం ఆనవాయితి. అలా వాళ్లంతా ఒక్కసారిగా ఊళ్లో వాలడంతో అంతా సంతోషంగా గడుపుతుంటారు. ఊరి పెద్ద  వీర్రాజు మొహంలో ఎప్పుడూ నవ్వు ఉంటుంది కానీ ఆ నవ్వు వెనక సంతోషం మాత్రం కనపడదు. అందుకు కారణం అతని మానసిక బాధ. అతని  భార్య నిరంజన(నయనతార), కూతురు (శ్వేత) పదేళ్లుగా తనకు దూరంగా ఉండటమే. అది అందరికీ తెలుసు. తమ సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఆ పెద్ద మనిషి సంతోషం కోసం ఏమీ చెయ్యలేమా అని  ఆ ఊరువాళ్లు అనుకుంటారు. (ఈ రోజుల్లో జనం ఇంత సెంటిమెంట్ గా ఎదుటివాడి గురించి  ఆలోచిస్తున్నారా? అని అడక్కండి. అదో తమిళ సినిమా అక్కడ అన్ని కాస్త అతిగానే ఉంటాయి. )

వీర్రాజు ఏం చేసాడు…


ఇక ఊరి పెద్దలు, కుటుంబ సభ్యుల కోరిక మేరకు భార్యను, కూతురును జాతరకు తీసుకురావడానికి వీర్రాజు ముంబై ప్రయాణం కడతాడు. అయితే పదేళ్ల తర్వాత వచ్చాడు కదా అని నిరంజన జాలి చూపించదు. అతని వెనకే గొర్రెలా వచ్చేయటానికి  తల ఊపదు.  వీర్రాజు  మొహం కూడా చూడటానికి ఇష్టపడదు. దాంతో  వీర్రాజు నిరాశతో తిరిగి ఇంటికి వెళుతుండగా ఓ సంఘటన జరుగుతుంది..
తన కూతురును కొందరు వ్యక్తులు వెంటపడి చంపడానికి ప్రయత్నిస్తారనే విషయం తెలుసుకుంటాడు. దాంతో వీర్రాజు రంగంలోకి దూకుతాడు. కానీ అక్కడ మళ్లీ సెంటిమెంట్ …నేనే నీ తండ్రిని అని ఆమెకు చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కుమిలిపోతాడు. ఇంతకీ వీర్రాజు కూతురుని చంపాలనుకున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తిని వీర్రాజు వదిలేసాడా? వంటి విషయాలు తెరపై చూస్తేనే బాగుంటుంది.


ఎలా ఉంది పిక్చర్…


ఈ సినిమాని మాస్ అంకితం చేసినట్లుగా అడుగడుక్కీ చేసిన ఎలివేషన్స్ ద్వారా అర్దమవుతుంది. కొన్ని ఎలివేషన్స్ అయితే మరీ దారుణంగా ఉంటాయి. అసలు ఎనభైల్లో జరుగుతున్న కథా ఇది? అనే సందేహం కూడా వస్తుంది. అయితే ఇలాంటివి బోలెడు తెలుగులో మనం చూసేసాం. కాబట్టి కొత్తగా ఏమీ అనిపించదు.  


తెలుగు సినిమాలు చూసినట్లే…


వెంకటేష్ హీరోగా వచ్చిన తులసి, చిరంజీవి హీరోగా వచ్చిన డాడి ఇలా చాలా సినిమాలు మిక్సీలో వేసి రుబ్బి చేసిన వంటకంలా ఉంటుంది. మాస్ ఎలివేషన్స్ తప్పితే సినిమాలో విషయం అంటూ ఏమీ లేదు. 


డైరక్టర్ శివ ఎలా చేసారు…


అసలు ఇలాంటి రొటీన్ కథతో అజిత్ ని మెప్పించటమే సగం సక్సెస్ అయ్యినట్లు.  తన గత చిత్రాల్లోని సీన్స్ ని  సైతం స్ఫూర్తిగా తీసుకొని కాస్త కొత్తగా, అతిగా  చూపిస్తూ, సేఫ్ ‌గేమ్‌ ఆడాడు. అజిత్‌ని ఎలా చూపెడితే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారో అందుకు తగిన విధంగా సీన్స్ ను  రాసుకున్నాడు. 


సాంకేతికంగా…


వెట్రీ అందించిన సినిమాటోగ్రఫీ, డి ఇమ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పోటీ పడ్డాయి. రుబెన్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. శివ అందించిన స్క్రీన్ ప్లే నే ఇబ్బంది పెట్టింది. దాంతో చాలా చోట్ల బోర్ కొట్టేసింది . నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఇలాంటి రొటీన్ రొట్ట సినిమాల్లో చేసినా తమ హీరో సినిమాని సూపర్ హిట్ చేయటంలో తమిళం వాళ్లు ముందుటారు. కానీ అజిత్ ఇక్కడ తమిళ హీరోనే.తెలుగు వాడు కాదు కాబట్టి  ఓపినింగ్స్ సైతం రాబట్టలేకపోయింది. ఏదో శాటిలైట్ కోసం డబ్ చేసిన సినిమాలాగ పబ్లిసిటీ ఉంది. 

 ఆఖరి మాట


అజిత్ లాంటి నటన తెలిసున్న స్టార్ ని మాస్ పేరుతో ఇలాంటి ఊర సినిమాల్లో చేయటం దారుణం 

నటీనటులు : అజిత్ కుమార్, నయనతార, జగపతిబాబు, అనిక తదితరులు

సంగీతం: డి.ఇమ్మాన్‌

సినిమాటోగ్రఫీ: వెట్రి

ఎడిటింగ్‌: రుబెన్‌

నిర్మాత: టీజీ త్యాగరాజన్‌, సెంథిల్ త్యాగరాజన్

దర్శకత్వం : శివ

బ్యానర్‌: సత్య జ్యోతి ఫిల్మ్స్‌

విడుదల: 01-03-2019