వి.వి.వినాయ‌క్‌.. మూడోసారి

Published On: August 11, 2017   |   Posted By:

వి.వి.వినాయ‌క్‌.. మూడోసారి

ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల‌తో  బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ను రూపొందిస్తూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌. కెరీర్ ప్రారంభంలోనే ఈ విధానానికి శ్రీ‌కారం చుట్టాడు విన‌య్‌. త‌న తొలి చిత్రం ఆదిని నంద‌మూరి వారి క‌థానాయ‌కుడు ఎన్టీఆర్‌తో తెర‌కెక్కించిన వినాయ‌క్‌.. రెండో చిత్రాన్ని చెన్న‌కేశ‌వ‌రెడ్డిగా అదే ఫ్యామిలీకి చెందిన బాల‌కృష్ణ‌తో రూపొందించాడు. ఆ త‌రువాత త‌న వ‌రుస చిత్రాలైన బ‌ద్రినాథ్‌, నాయ‌క్ కోసం ఈ శైలిని మ‌రోసారి అనుస‌రించాడు. బ‌ద్రినాథ్ చిత్రంలో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ న‌టించగా.. నాయ‌క్‌లో అదే కుటుంబానికి చెందిన రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

క‌ట్ చేస్తే.. మ‌ళ్లీ అదే త‌ర‌హాలో రెండు వ‌రుస చిత్రాల‌ను ఒకే కుటుంబానికి చెందిన హీరోల‌తో తెర‌కెక్కించే దిశ‌గా వెళ్తున్నాడు సద‌రు ద‌ర్శ‌కుడు. ఈ ఏడాది ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం.150 ని డైరెక్ట్ చేసిన విన‌య్‌.. త‌దుప‌రి చిత్రాన్ని చిరు మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో రూపొందిస్తున్నాడు. అంటే.. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల‌తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వినాయ‌క్‌కి మూడోసారి  వ‌చ్చింద‌న్న‌మాట‌. గ‌త రెండు సంద‌ర్భాల‌లో ఒకే ఫ్యామిలీకి చెందిన రెండు వ‌రుస చిత్రాల‌లో ఏదో ఒక‌టి మాత్ర‌మే హిట్ అవుతూ వ‌స్తోంది.   ఈ సారైనా అందుకు భిన్నంగా విన‌య్ రెండో చిత్రంతోనూ విజ‌యం అందుకోవాల‌ని ఆశిద్దాం.