వెంకీమామ‌ మూవీ రివ్యూ

Published On: December 13, 2019   |   Posted By:

వెంకీమామ‌ మూవీ రివ్యూ

 కష్టంరా మామా (‘వెంకీ మామ’ రివ్యూ)

Rating:2.5/5


రామనారాయణ (నాజర్‌) పేరున్న జ్యోతిష్యవేత్త. ఆయన కూతురు జాతకం పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటిది. ఆ తర్వాత మనవడు కార్తీక్ (నాగచైతన్య) పుడతాడు. అతనిది శ్రీకృష్ణ అంశ. పుట్టిన ఏడాదిలోగా తల్లిని,తండ్రిని పొట్టన పెట్టుకుంటాడు. దాంతో ఆ పిల్లాడి జాతకం దృష్ట్యా వారి ఏడాది మనవడను చేరదీయడానికి రామనారాయణ నిరాకరిస్తాడు. కానీ ఆయన కొడుకు వెంకటరత్నం(వెంకటేశ్‌)  ఆయనకు రివర్స్. తండ్రి మాటను కాదని తన మేనల్లుడుని  చేర దీసి ప్రాణ సమానంగా పెంచి పెద్ద చేస్తాడు. అంతేకాదు…తన జీవితాన్ని, పెళ్లి ని సైతం త్యాగం చేసేస్తాడు. ఇలా మామా, మేనల్లుడు హాయిగా ఉన్న సమయంలో ఆ జాతకం ప్రభావం చూపెట్టడం మొదలెడుతుంది. దాంతో తను మామ దగ్గర ఉంటే ఆయనకి ప్రమాదం అని దూరం అయ్యిపోతాడు కార్తీక్. అయితే తనకు ప్రమాదమైనా మరొకటి అయినా తనకు తన మేనల్లుడే ముఖ్యమని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ క్రమంలో కొన్ని సమస్యల్లో పడతాడు.  తన మేనల్లుడు ఓ పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ మేనమామ ఏం చేసాడు. అల్లుడుకు ఎదురైన సమస్య ఏమిటి…వీళ్ల జీవితాల్లో తారసపడ్డ అమ్మాయిలు ఎవరు..అలాగే ఆ ఊరి ఎమ్మల్యే (రావు రమేష్) కు ఈ మామా,అల్లుడు అంటే ఎందుకు పడదు…వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 కథ,స్క్రీన్ ప్లే  

స్టోరీ లైన్ గా చెప్పుకున్నంత గొప్పగా సినిమా ఉండదు. అది ట్రీట్మెంట్ లోపమే అని చెప్పాలి. వెంకటేష్, నాగచైతన్య పాత్రలను మామా ,అల్లుళ్లుగా అనుకుని, అందులోకి శ్రీకృష్ణ అంశ అనే జాతకం పాయింట్ ని తీసుకొచ్చారు. అయితే అది సినిమాలో పెద్దగా కాంప్లిక్ట్స్ ని క్రియేట్ చేయలేకపోయింది. జాతకాలు సినిమాలో ఓ ఎలిమెంట్ గా ఉంటే బాగుండేది కానీ దాన్ని ప్రేమతో జయించవచ్చు అని ఓ ముగింపు ఇవ్వాలని ఫిక్స్ అయ్యి సీన్స్ నడపటంతో ఫస్టాఫ్ బాగానే ఉన్నా,సెకండాఫ్ సో సోగా మారిపోయింది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి దాదాపు కథ ఓ కొలిక్కి వచ్చేసింది. దాంతో సెకండాఫ్ మొత్తం కాశ్మీర్, టెర్రరిస్ట్ లు, మిలిట్రీ అంటూ ఇష్టమొచ్చినట్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇలా దారి తెన్నూ లేకుండా కథను నడటంతో చూసేవారికి …ఈ జాతకాల గోల తేలకుండా ఈ టెర్రరిస్ట్ లు గోల మెదలెట్టేరేంటిరా అనిపిస్తుంది. దానికి తోడు ఆ మిలిట్రీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సీన్స్ అన్నీ కమర్షియల్ టచ్ ఇచ్చి సీరియస్ నెస్ లేకుండా చేసేసారు. దాంతో ప్రీ  క్లైమాక్స్,క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా పండలేదు.

మురారిలాగ…

ఈ సినిమాని అప్పట్లో వచ్చిన మహేష్ బాబు చిత్రం మురారి లాగ నడపాల్సిన అవసరం ఉంది. జాతకాలు,మరణం అనివార్యం అని చెప్పాలనుకున్నడు దానికి ఇచ్చే పరిష్కారం కూడా అదే లేయర్ లో ఉండాలి. ఆ విషయం మర్చిపోయారు దర్శక,నిర్మాతలు. అలాగని జాతకాలను కొట్టిపారేసే ధైర్యమూ చెయ్యలేదు. దాంతో అటూ,ఇటూ కాని కథ గా మారిపోయింది.

ఎవరెలా
వెంకటేష్ కనపడగానే ఫన్ వస్తుందని ఆసిస్తాం. ఆయన కూడా అదే ట్రై చేసారు. తన మ్యానరిజం, డైలాగ్స్ లతో ఆ ప్రయత్నం చేసారు. అయితే కథ కలిసి వస్తే కదా. అంటే వెంకీకు స్క్రిప్టు సహకరించలేదన్నమాట. అయితే ఫస్టాఫ్లో మాత్రం ఉన్నంతలో కామెడీతో నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఇక నాగచైతన్య విషయానికి వస్తే… బాగానే చేసాడు కానీ సోల్ మిస్సైన ఫీల్ వచ్చింది. మెచ్చూర్డ్ గా ఫెరఫార్మ్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది.రాశి ఖన్నా, పాయిల్ రాజ్ పుత్ కేవలం గ్లామర్ కే పరిమితం అయ్యారు. నాజర్‌, గీత, ప్రకాశ్‌ రాజ్‌, రావూ రమేశ్‌, కిషోర్‌, హైపర్‌ ఆది  వంటి వారు తమ అనుభవంతో చేసుకుంటూ పోయారు కానీ క్యారక్టరైజేషన్ మాత్రం సెట్ కాలేదు.

టెక్నికల్ గా..

మ్యూజిక్ డైరక్టర్  తమన్ అందించిన రీరికార్డింగ్  ఆకట్టుకుంటుంది.పాటలు జస్ట్ ఓకే. ఎడిటింగ్  కొన్ని సీన్స్ ను ఇంకా టైట్ గా ట్రీమ్ చేయిచ్చు అనిపిస్తుంది.  సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. పల్లె సన్నివేశాల్లోని విజువల్స్ ను కెమెరామెన్ చాలా సహజంగా చూపించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

 చూడచ్చా
సెకంఢాఫ్ ని భరించే శక్తి ఉంటే…ఖచ్చితంగా చూడచ్చు


ఎవరెవరు
నటీనటులు : వెంకటేశ్‌, నాగచైతన్య, రాశి ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌, నాజర్‌, రావు రమేశ్‌, ప్రకాశ్‌రాజ్‌, హైపర్‌ ఆది, చమ్మక్‌ చంద్ర, గీత, కిషోర్‌ తదితరులు
సంగీతం : థమన్‌
సినిమాటోగ్రఫి: ప్రసాద్‌ మురేళ్ల
దర్శకత్వం: బాబీ (కేఎస్‌ రవీంద్ర)
నిర్మాతలు: సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌