శ్రీవిష్ణు ఇంటర్వ్యూ

Published On: December 5, 2017   |   Posted By:
శ్రీవిష్ణు ఇంటర్వ్యూ
తన కెరీర్ లోనే మెంటల్ మదిలో సినిమా బిగ్గెస్ట్ హిట్ అంటున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ కారణంగా ప్రస్తుతం కథల్ని ఎంచుకునే స్థితికి చేరానంటున్న శ్రీవిష్ణు.. ఆ మూవీ విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు.
మరపురాని అనుభూతి
మెంటల్ మదిలో సినిమా హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమా స్థాయిలో డబ్బులు కూడా బాగా రావడంతో వెరీ మచ్ హ్యాపీ. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కమర్షియల్ గా ఎక్కువ డబ్బులు వచ్చిన సినిమా ఇది. విమర్శకులు కూడా మా సినిమాను మెచ్చుకోవడం మరపురాని అనుభూతి.
అలా ఈ ఛాన్స్ వచ్చింది
అప్పట్లో ఒకడుండేవాడు సినిమా చేస్తున్న టైమ్ లో ఈ ఆఫర్ వచ్చింది. అప్పడు రాజ్ కందుకూరి ఫోన్ చేసి వివేక్ ను పంపారు. జనరల్ గా స్టోరీ విన్న తర్వాత ఎవరైనా వారం టైం తీసుకుంటారు. కానీ వివేక్ చెప్పిన 10 నిమిషాలకే నేను ఈ సినిమా చేస్తున్నట్టు చెప్పేశాను. ఆ తర్వాతే పూర్తి కథ విన్నాను. కచ్చితంగా ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుందని అప్పుడే గెస్ చేశాను. ఈ సినిమా రైటింగే కొత్తగా ఉంది. మాటలు మరింత కొత్తగా ఉన్నాయి.
బ్యాలెన్స్ అనే పదం ఎప్పుడూ వాడను
ఓవైపు హీరోగా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాను. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నానో నాకే తెలీదు. కాకపోతే ఒకసారి చేసిన పాత్రను మళ్లీ చేయకూడదనేది నా అభిప్రాయం. అది క్యారెక్టర్ రోలా, హీరోనా అనేది చూడను.
కన్ఫ్యూజన్ కనెక్ట్ అయింది
కన్ఫ్యూజన్ అనేది పెద్ద సమస్య కాదు. ప్రతి విషయంలో ఉంటుంది. పొద్దున లేచిన దగ్గర్నుంచి ఇది ఉంటుంది. ఇదేదో జబ్బు కాదు. కాకపోతే ఓ 10శాతం మంది మాత్రం రోజు మొదలుపెట్టేదే కన్ఫ్యూజన్ తో మొదలుపెడతారు. నాలో ఉన్న ఆ కన్ఫ్యూజన్ అందరికీ కనెక్ట్ అవుతుందని  నమ్మాను. అదే నిజమైంది. అందరూ అనుభవించిన అనుభూతే కాబట్టి బాగా
వర్కవుట్ అయింది.
ఆ విషయంలో చాలా క్లియర్
కథల విషయంలో చాలా క్లియర్ గా ఉంటాను. నాకు ఏది సెట్ అవుతుందో నాకు తెలుసు. ఓ కొత్త దర్శకుడు వచ్చి అద్భుతమైన స్క్రిప్ట్ చెప్పినప్పుడు అది నాకు సెట్ అవ్వదనిపిస్తే చేయను. నాకు నచ్చి, ఆ పాత్రలో నేను సెట్ అవుతాను అనుకుంటేనే చేస్తాను. నాకు సెట్ అవ్వదని తెలిసినప్పుడు.. అనవసరంగా డైరక్టర్ కెరీర్ ను వేస్ట్ చేసినవాడ్ని అవుతాను. టోటల్ యూనిట్ అంతా నా వల్ల నష్టపోతుంది.
ఆ సినిమా చాలా ప్రత్యేకం
ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో నేను చేసిన పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. తిరుమల కిషోర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. కథ చెప్పిన వెంటనే చేసేస్తానని చెప్పేశా. కిషోర్ నాకేం చెప్పలేదు. పాత్రకు తగ్గట్టు నేను నటించాను. అది అందరికీ నచ్చింది. ఆ సినిమా ఓ మంచి మెమొరీ.
కథ ప్రకారమే అన్నీ
ఓ కన్ఫ్యూజన్ ఉన్న వ్యక్తి హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లాడు. మనిషి వయసులో ఉన్నాడు. భాష రాదు, ఊరు కొత్త. ఇలాంటి వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో అలానే చేశాను. సెకెండ్ హీరోయిన్ కు కనెక్ట్ అవ్వడానికి ఇంతకంటే స్టఫ్ ఏం కావాలి. పైగా సెకెండ్ హీరోయిన్ ఆలోచనలన్నీ నా పాత్ర లోపల అలా నిక్షిప్తం అయి ఉండిపోతాయి. ముంబయి వెళ్లిన తర్వాత
ఆ ఆలోచనలు బయటకొస్తాయి. నా పాత్రను చిన్నప్పట్నుంచి చూపించడం వల్ల అందరికీ బాగా కనెక్ట్ అయింది.
అన్ని వర్గాల నుంచి ప్రసంశలు
ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకు ప్రశంసలు వస్తున్నాయి. నివేత పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆమెతో చాలా తక్కువగా మాట్లాడేవాడ్ని. ఇంతకుముందు నేను చేసిన హీరోయిన్లు ఎక్కువగా నార్త్ వాళ్లు. కాబట్టి ప్రామ్టింగ్ లో టైమ్ కుదిరేది కాదు. కానీ నివేత తమిళియన్ కావడంతో.. ఆమెతో నటించడం కూల్. తెలుగు బాగానే అర్థం చేసుకొని మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది.
కాస్త ఎదిగాను
కెరీర్ స్టార్టింగ్ లో పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తే చాలనుకున్నాను. అనుకోకుండా హీరో వేషాలు రావడంతో అవి చేశాను. నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో కథల్ని ఎంచుకునే పొజిషన్ లో నేను లేను. కానీ ఇప్పుడు మాత్రం వచ్చిన 2-3 కథల్లో నాకు నచ్చింది ఎంచుకునే సౌలభ్యం దక్కింది. నేను ఓ మంచి నటుడిగా ఎదిగానని నాకు అప్పుడు అనిపించింది. మెంటల్ మదిలో సక్సెస్ తర్వాత నాకు కథలు రావడం మరింత ఎక్కువైంది.
అప్ కమింగ్ మూవీస్
ఒకే జానర్ లో సినిమా చేయాలని లేదు. అలాఅని ఏదో ఒక కాన్సెప్ట్ కు ఫిక్స్ అయి కూడా లేను. వచ్చిన కథల్లోంచి అప్పటికప్పుడు దేనికైతే బాగా ఎక్సయిట్ అవుతానో, ఆ కథకు ఓకే చెప్పేస్తాను. ప్రస్తుతం నీది నాది ఒకే కథ అనే సినిమా చేస్తున్నాను. ఇది ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీ తర్వాత తిప్పరా మీసం అనే టైటిల్ తో మరో సినిమా
వస్తుంది.