సంగీత దర్శకుడు సాగర్ మహతి ఇంటర్వ్యూ

Published On: January 29, 2018   |   Posted By:
సంగీత దర్శకుడు సాగర్ మహతి ఇంటర్వ్యూ
నాగశౌర్య అప్ కమింగ్ మూవీ  ఛలో. ఈ సినిమా ట్రయిలర్ తో ఎంత హిట్ అయిందో, పాటలతో అంతకంటే పెద్ద హిట్ అయింది. మరీ ముఖ్యంగా చూసీచూడంగానే అనే పాట ఇనిస్టెంగ్ హిట్. ఈ పాట సక్సెస్ తర్వాత అంతా ఈ సంగీత దర్శకుడు ఎవరా అని ఆరాతీశారు. అతడే మెలొడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు సాగర్ మహతి. ఛలో సినిమాతో పాటు తన అప్ కమింగ్ మూవీ విశేషాల్ని మీడియాతో పంచుకున్నాడు సాగర్ మహతి.
అస్సలు ఊహించలేదు
నాకసలు ఏమీ తెలీదు.. ఇంత హిట్ అవుతుందని ఊహించలేదు. చలో ఫస్ట్ సాంగ్ ఈ రేంజ్ లో సక్సెస్ అయిందంటే ఆ క్రెడిట్ టోటల్ టీంకు దక్కుతుంది. డైరెక్టర్ ఒక మంచి సిచ్యువేషన్ ఇవ్వడం, ఫిల్మ్ మేకర్స్ దాన్ని అలాగే ప్రమోట్ చేయడం అన్నీ అలా కలిసొచ్చాయి. ఇండస్ట్రీలో కూడా చాలామంది ఈ పాటను మెచ్చుకున్నారు. చూసీ చూడంగానే అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ఇంత హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది.
కొత్తదనం ఉండాలి
పాటల్లో ఏదైనా కొత్తగా చేసినప్పుడు అది సక్సెస్ అవుతుందని నా నమ్మకం. మరీ ముఖ్యంగా నా పాటల విషయంలో నాన్న(మణిశర్మ) ప్రమేయం అస్సలు ఉండదు. ఎక్కడైనా, ఏదైనా డౌట్ వస్తే మాత్రం నాన్నను అడుగుతాను. అంతవరకే నాన్న పాత్ర. నా స్టయిల్ నేను ఫాలో అవుతుంటాను.
ఇమేజ్ ఇష్టముండదు
నాన్నని మెలోడీ బ్రహ్మ అన్నారని నేను కూడా ఏదో ఒక జానర్ లో బ్రహ్మ అనిపించుకోవాలని లేదు. నాకొచ్చిన సినిమాల్ని చేసుకుంటూ వెళ్తాను. గుర్తింపు అనేది ఒక సినిమాతో వచ్చేది కాదు. ఇక పాటలంటారా.. అది సినిమాలో సిచ్యుయేషన్ బట్టి, దర్శకుడి బట్టి మారిపోతుంది. ప్రతి పాటలో నా టేస్ట్ ఉండాలని అనుకోను.
ఆ పాట వెనక కథ
చూసీచూడంగానే అనే పాట వెనక గమ్మత్తయిన కథ ఉంది. నిజానికి ఆ పాట కావాలని చేసింది కాదు. ఓ చిన్న లవ్ థీమ్ చేద్దామని ప్రారంభించాం. ఆ తరవాత ఇదేదో బావుందనిపించి చిన్న సాంగ్ బిట్ చేద్దామనుకున్నాం. అది ఇంకా బాగా వచ్చేసరికి, ఇక ఆపుకోలేక ఏకంగా పూర్తి పాట కంపోజ్ చేశాం. అలా తయారైంది ఆ సాంగ్.
ఇంట్లోనే గురువు
ఏ సినిమాకైనా పాటలు ఒకెత్తు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. సాంగ్స్ ఎవరైనా కంపోజ్  చేయగలరు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి చాలా ప్యాషన్ ఉండాలి. ఓపిక ఉండాలి. అదొక ప్రత్యేకమైన కళ. లక్కీగా నాకు మా ఇంట్లోనే టీచర్ ఉన్నారు. నాన్నగారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఎక్స్ పర్ట్. సో.. ఆ విభాగంలో నాకు కొంచెం పని ఈజీ అయిందది.
చెన్నైకి, హైదరాబాద్ కు తేడా అదే
చెన్నై లో చాలా మంది వాద్యకారులున్నారు. అందుకే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చెన్నై ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ అలా కాదు. మనదగ్గర మ్యూజీషియన్స్ చాలా తక్కువ.  బిగినింగ్ లో నాక్కూడా ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామా అనిపించేది. కానీ ఇప్పుడు మా సొంత టీమ్  ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, ఎక్కడైనా రికార్డ్ చేయొచ్చు.
సంగీతంలో పోటీ ఉండదు
సంగీత దర్శకుల మధ్య పోటీ అనేది నేను నమ్మను. సినిమాలో పాటలు బాగుంటే మ్యూజిక్ డైరక్టర్ కు పేరొస్తుంది. లేకపోతే లేదు. అంతేతప్ప, ఇతర సంగీత దర్శకులతో పోలిక అనవసరం. నా వరకు నా సినిమాలో పాటలు బాగున్నాయా లేదా అనేదే నాకు ఇంపార్టెంట్.
అతడే నా ఫేవరెట్
వ్యక్తిగతంగా యువన్ శంకర్ రాజా స్టయిల్ నాకు చాలా ఇష్టం. ఇళయరాజా గారి అబ్బాయి అయి ఉండి కూడా, ఆయన ప్రభావం తన మ్యూజిక్ పై పడకుండా పాటలిస్తాడు.  ఆయన సాంగ్స్ కంపోజ్ చేసే తీరు అద్బుతంగా ఉంటుంది. బ్రహ్మాండమైన మెలొడీస్ చేశారు యువన్.
అప్ కమింగ్ ప్రాజెక్టులు
ప్రస్తుతానికి తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు. కన్నడలో కుమారి 21ఎఫ్ రీమేక్ కు సంగీతం అందిస్తున్నాను. ఆ సినిమా పూర్తయిన తర్వాత తెలుగు సినిమాల గురించి ఆలోచిస్తాను.ప్రస్తుతం ఛలో మ్యూజిక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాను.