సాగర సంగమం కు 37 సంవత్సరాలు పూర్తి

Published On: June 3, 2020   |   Posted By:
సాగర సంగమం కు 37 సంవత్సరాలు పూర్తి 
 
కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్ ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం ‘“ సాగర సంగమం ‘ .
 
ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో  “సాగర సంగమం” , తమిళంలో  “ సలంగై ఓలి “ , “ మలయాళంలో  “ సాగర సంగమం “ గా ఒకే రోజు విడుదల అయ్యాయి .
 
అన్ని భాషల్లో  ఆఖండ  విజయం సాధించింది . నేటి మేటి దర్శకులెందరికో  స్ఫూర్తి  ఈ చిత్రం. ఈ విషయం వాళ్ళు స్యయంగా ఎన్నో సార్లు వ్యక్తపరిచారు .
 
శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్ – ఏడిద నాగేశ్వరరావు కలయికలో  వచ్చిన మరో సంచలన కళా ఖండం ,” సాగర సంగమం “.
 
భారత చలనచిత్ర 100 సంవత్సరాలు సందర్భంగా CNN-IBNs List of the 100 Greatest Indian Films of All Time లో ఈ చిత్రం 13 వ స్థానం దక్కించుకుంది . అలాగే రష్యన్ భాషలోకి అనువదించి అక్కడి 400 థియేటర్లలో ఒకే సారి విడుదలయ్యి వారి అభిమానాన్ని కూడా పొందిన మొట్ట మొదటి తెలుగు చిత్రం .
 
ఈ చిత్రం శతదినోత్సవం తో పాటు ఎన్నో కేంద్రాలలో సిల్వర్ జూబిలీ , గోల్డెన్ జూబిలీ కూడా జరుపుకుంది. బెంగుళూరు లో 511 రోజులు ఒకే థియేటర్ లో ప్రదర్శింపబడ్డ చిత్రం సాగర సంగమం .
 
ఈ చిత్రం విడుదలయ్యాక చాలా మంది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి డాన్స్ క్లాసులకి వెళ్లేవారు . ఇప్పటికీ లోక నాయకుడు కమలహాసన్ తనకు బాగా నచ్చిన చిత్రాల్లో సాగర సంగమం పేరే ముందుంటది. అలాగే కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శక ప్రతిభ ప్రతీ సన్నివేశంలో మనకు కనబడుతుంది . ఇక ఇళయరాజా సంగీతం … ఈ చిత్రానికి ఓ హై లైట్ . ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి . అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వైవిధ్యంగా కుదిరింది .
 
అప్పటికే ఎన్నో తమిళ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి ఓ ట్రెండ్ సెట్ చేసిన ఇళయరాజాకు మొట్ట మొదటి సారి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి ఇచ్చిన చిత్రం సాగర సంగమం. అలాగే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కీ ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డు . జంధ్యాల మాటలు, వేటూరి పాటలు , నివాస్ ఫోటోగ్రఫీ , తోట తరణి కళా దర్శకత్వం ఇంకా ఎందరో ప్రతిభావంతుల కలయికే ఈ చిత్రాన్ని all time classic గా రూపుదిద్దింది.
 
ఈ చిత్ర శతదినోత్సవానికి హిందీ అగ్ర నటులు రాజకపూర్ , సునీల్ దత్ & రాజేంద్ర కుమార్ గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసి సాగర సంగమం గురించి ఎంతో గొప్పగా విశ్లేషించారు .
 
కమలహాసన్ నూతి మీద డాన్స్ చేసే “తకిట -తధిమి” పాట , జయప్రద తో కలిసి చేసే “ నాద వినోదము “ క్లైమాక్స్ లో వచ్చే “వేదం అణువణువున” పాటల్లో కమలహాసన్ చేసిన క్లాసికల్ డాన్సులు ఇప్పటికీ మనకి ఓ కొత్త  అనుభూతినిస్తాయి . అలాగే మౌనమేలనోయి పాటలో జయప్రద చూపిన హావభావాలు , ఎస్.పి. శైలజ నటన ఈ చిత్రానికి మరో ప్రత్యేకత .
 
సిరి సిరి మువ్వ, శంకరాభరణం తరువాత ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన  మరో కళాత్మక దృశ్య కావ్యం సాగరసంగమం. కళకు అంతం లేదు అనే భావన కలిగేందుకే ఈ చిత్రం చివర్లో “ NO END FOR ANY ART “ అని వస్తుంది .