సాయిధరమ్ తేజ్ ఇంటర్వ్యూ

Published On: February 8, 2018   |   Posted By:
సాయిధరమ్ తేజ్ ఇంటర్వ్యూ
ఇంటిలిజెంట్ సినిమాతో రేపు థియేటర్లలోకి వస్తున్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. వినాయక్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విశేషాలతో పాటు కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాల్ని మీడియాతో పంచుకున్నాడు.
ఇంటిలిజెంట్ కాన్సెప్ట్
సినిమా రిలీజ్ పై ఎలాంటి టెన్షన్ లేదు. మూవీ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ క్యారెక్టర్. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న టైమ్ లో ఓ దశలో విలన్ ను ఎదుర్కోవలసి వస్తుంది. మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్లను మరిచిపోకూడదు. వాళ్ల కోసం ఏమైనా చేయాలనేది ఈ సినిమా స్టోరీ.
కమర్షియల్ టచ్ ఉంది
నా కెరీర్ లో  ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా ఇది. నేను చాలా కొత్తగా ఫీలయ్యాను. ఆడియన్స్ కూడా అలానే ఫీలవుతారని నమ్ముతున్నాను. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కమర్షియల్ మీటర్ మిస్ అవ్వదు
వినాయక్ తో పనిచేయడం అదృష్టం
వినాయక్ తో సినిమా చేయడం నా అదృష్టం. 4 ఫ్లాపుల తర్వాత వినాయక్ గారు పిలిచి నాకు ఆఫర్ ఇవ్వడం నా అదృష్టం. వినాయక్ కు థ్యాంక్స్. అతని వర్కింగ్ స్టయిల్ చాలా బాగుంటుంది. హాయిగా మన పని మనం చేసుకోవచ్చు. వినాయక్ తో వర్క్ చేయడం చాలా ఈజీ. ఎక్స్ పీరియన్స్ దర్శకులతో వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఫస్ట్ టైం తెలిసింది. ఆకుల శివ ఇచ్చిన కథను, వినాయక్ గారు చాలా ఎంటర్ టైనింగ్ గా తీశారు.
తప్పుల నుంచి నేర్చుకున్నా
మనం ఏ తప్పు చేసినా అందులోంచి నేర్చుకోవాలి. నా ఫ్లాపుల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను ఏం నేర్చుకున్నాననేది ఇంటిలిజెంట్ సినిమాలో కనిపిస్తుంది. నిజానికి సినిమా అనేది అందరూ కలిసి వర్క్ చేస్తేనే వచ్చే అవుట్ పుట్. ఒక్కరిపై తప్పు వేయలేం. జవాన్ సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతోనే తీశాం. కానీ అది ఆడలేదు.
కథ ఓకే చేయడం వరకే…
కథలో నేనెప్పుడూ వేలు పెట్టను. దర్శకుడు చెప్పింది చేయడం వరకే నా పని. కథ, స్క్రీన్ ప్లే విషయాల్లో నా ప్రమేయం ఉండదు. కథ నాకు నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. ఆ తర్వాత ఇక నా ప్రమేయం  ఉండదు. క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్ విషయంలో కూడా వేలు పెట్టను.
రాజేంద్రప్రసాద్ చెప్పింది నచ్చింది
కొన్ని కథలు మాత్రమే చేయాలని ఎప్పుడూ అనుకోను. రాజేంద్రప్రసాద్ ఓ మంచి మాట చెప్పారు. మనకు వచ్చిన అవకాశాల్ని మనం ఎలా ఉపయోగించుకున్నామనే విషయంపైనే దృష్టిపెట్టాలి. అంతే తప్ప, ఇలాంటి ఛాన్సులు వస్తే బాగుంటుందని ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఆయన చెప్పిన రూటు లోనే నేను ఉన్నాను.
జవాన్ వర్కవుట్ కాలేదు
మైండ్ గేమ్ మీద ఆల్రెడీ జవాన్ సినిమా చేశాను. అది వర్కవుట్ కాలేదు. ఈ సినిమాలో కూడా మైండ్ గేమ్ ఉంటుంది కానీ అంతకుమించి ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ఓ ప్రాబ్లమ్ ను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎలా అధిగమించాడనేది స్టోరీ.
రిలీజ్ డేట్స్ పై మాట్లాడుకున్నాం
నా సినిమా, వరుణ్ సినిమా ఒకరోజు రిలీజైనా నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకైతే మా ఇద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయి హిట్టయితే ఆ కిక్ ఇంకోలా ఉండేది. అయినా వరుణ్ సినిమా ఒక రోజు పోస్ట్ పోన్ అయింది కాబట్టి అది కూడా హ్యాపీనే… మా మధ్య కాంపిటీషన్ లాంటిది ఎప్పుడూ ఉండదు. నేను, వరుణ్ రిలీజ్ డేట్ పై చర్చించుకున్నాం కూడా.
ప్రభాస్, బాలయ్యకు థ్యాంక్స్
రెబల్ స్టార్ ప్రభాస్ మా సినిమా ఆడియో లాంచ్ కి రావడం, బాలకృష్ణ గారు కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నాను. బాలకృష్ణ లాంటి వ్యక్తి మెగా ఫ్యాన్స్ ను గుర్తించి, మా కోసం మా సినిమాకు ప్రచారం ఇవ్వడం గ్రేట్.
ఉన్నంతలో తీశాం
సినిమా బడ్జెట్ దాటలేదు. సెట్స్ పైకి వెళ్లకముందే ఓ బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ లెక్కలోనే సినిమా తీశాం. బడ్జెట్ ఎక్కువైందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు.
చిరంజీవితో కంపేర్ చేయొద్దు
నన్ను చిరంజీవి గారితో పోలుస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. నాకు తెలిసి చిరంజీవి గారు ఒక్కరే. ఆయన్ని చేరుకోవడం ఎవరితరం కాదు. నేనెప్పుడూ చిరంజీవి గారి సాంగ్స్ రీమిక్స్ చేస్తాను అని అడగలేదు. డైరెక్టర్స్ చెబితేనే చేశాను. నా వరకు నేను ఆ సాంగ్ కి ఎంతవరకు కష్టపడాలో అంత వరకు కష్టపడతాను.
ఆ రోజు షాక్ అయ్యాను
రాజమండ్రిలో ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ ని చూసి నిజంగానే షాక్ అయ్యాను. అది ఓపెన్ ఫంక్షన్ కాబట్టి  అందరికీ లెటర్స్ పంపించాం. కానీ వాళ్ళు మాత్రం అంత ఓపిగ్గా అందరూ మాట్లాడేది విని, మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం, వాళ్ళు మాపై చూపించిన ప్రేమకి నిజంగా వాళ్లకు రుణపడి ఉంటాను.
అప్ కమింగ్ మూవీస్
కరుణాకరన్ గారి సినిమా ఆల్ రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఫిబ్రవరి 19 నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభమౌతుంది. కరుణాకరన్ గారితో పని చేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. లక్కీగా అవకాశం తొందరగానే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. కానీ వినాయక్ గారితో ఇంత తొందరగా సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. పైగా మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ తర్వాత, ఆయన సినిమాలో చేయడమనేది అసలు ఊహించలేదు.