హలో మూవీ రివ్యూ

Published On: December 22, 2017   |   Posted By:

హలో మూవీ రివ్యూ

నటీనటులు – అఖిల్, కల్యాణి, అజయ్, జగపతిబాబు, రమ్యకృష్ణ తదితరులు..
దర్శకుడు – విక్రమ్ కె.కుమార్
సంగీత దర్శకుడు – అనూప్ రూబెన్స్
బ్యానర్ – అన్నపూర్ణ స్టుడియోస్
నిర్మాత – నాగార్జున
సినిమాటోగ్రాఫర్ – పీఎస్ వినోద్
రిలీజ్ డేట్ – డిసెంబర్ 22
రన్ టైం – 132 నిమిషాలు
సెన్సార్ – క్లీన్ యు సర్టిఫికేట్
మొదటి సినిమా ఫ్లాప్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. ఈసారి మంచి సెటప్ తో సినిమా రెడీ చేశాడు. విక్రమ్ కుమార్ లాంటి డైరక్టర్, పీఎస్ వినోద్ లాంటి సినిమాటోగ్రాఫర్, ఖర్చుకు కాంప్రమైజ్ కాని అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై హలో రూపంలో మరోసారి మనముందుకొచ్చాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఎన్నాళ్ల గానో అఖిల్ ఎదురుచూస్తున్న సక్సెస్ ను అందించిందా..? బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

కథ

హీరో శీను (అఖిల్) ఓ అనాధ. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. అతడ్ని చేరదీసి పెంచి పెద్ద చేస్తారు జగపతిబాబు, రమ్యకృష్ణ. అలా అనాధ కాస్తా రిచ్ కిడ్ గా మారతాడు. చిన్నప్పుడే ఓ సందర్భంలో జున్ను (కల్యాణి) కలుసుకుంటాడు శీను. తర్వాత జున్ను వాళ్ల తండ్రికి బదిలీ అవ్వడంతో ఢిల్లీ వెళ్లిపోతారు. అలా జున్ను జ్ఞాపకాలతో గడిపేస్తున్న శీనుకు 14 ఏళ్ల తర్వాత ఆమెను కలిసే అవకాశం వస్తుంది. తను వస్తున్నానని ఫోన్ చేసి చెబుతుంది జున్ను. అంతలోనే ఆ ఫోన్ మిస్ అయిపోతుంది. అఖిల్ నుంచి ఓ దొంగ ఆ ఫోన్ కొట్టేస్తాడు. ఫోన్ దొరికితే తప్ప జున్ను కలవడం కుదరదు.
ఆ ఫోన్ ను వెదికి పట్టుకునే క్రమంలో విలన్ గ్యాంగ్ తో తలపడతాడు అఖిల్. మరోవైపు విధి ఆడిన వింత నాటకంలో భాగంగా అఖిల్, కల్యాణి కలుసుకుంటారు. కానీ అఖిల్ పేరు శీను అనే విషయం జున్నుకు తెలియదు. హీరోయిన్ కల్యాణి పేరు జున్ను అనే విషయం అఖిల్ కు తెలియదు. ముద్దుపేర్లు వదిలేసి అసలు పేర్లతో (అవినాష్, ప్రియ) పరిచయం అవుతారు ఇద్దరూ. ఓవైపు ఈ ట్రాక్ నడుస్తూనే, మరోవైపు ఫోన్ కోసం అఖిల్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఫైనల్ గా అఖిల్ కు తన ఫోన్ దొరికిందా లేదా.. చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్న జున్నును ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నాడు అనేది బ్యాలెన్స్ కథ.

ప్లస్ పాయింట్స్

– విక్రమ్ కుమార్ డైరక్షన్, స్క్రీన్ ప్లే
– సినిమాటోగ్రఫీ
– పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
– యాక్షన్ ఎపిసోడ్స్
– ప్రొడక్షన్ విలువలు

మైనస్ పాయింట్స్

– ఫ్లాట్ గా సాగే స్టోరీ
– క్లైమాక్స్ కు ముందు బోర్ కొట్టించే సీన్లు
– ఫస్టాఫ్ లో అఖిల్ అర్థగంట కనిపించకపోవడం

బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ

స్ట్రయిట్ గా చెప్పుకుంటే కథ చాలా సింపుల్. ఫోన్ అనే ఎలిమెంట్ ను పక్కనపెడితే.. హీరోహీరోయిన్లు విడిపోయి మళ్లీ కలుసుకునే కథలు తెలుగులో చాలానే చూశాం. అంతెందుకు.. ఈ సినిమాలో అఖిల్ కు తండ్రిగా నటించిన జగపతిబాబు కూడా హీరోగా ఇలాంటి సినిమా ఒకటి చేశాడు. కానీ అప్పటి సినిమాలను ఈ మూవీతో వేరుచేసి చూపిస్తుంది విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే. నాగార్జున వాయిస్ ఓవర్ తో కథను ఎత్తుకునే సందర్భం నుంచి “బ్యాక్ ఫోర్త్ కాన్సెప్ట్” లో విక్రమ్ కుమార్ సినిమాను నడిపించిన విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. తన గత సినిమాల్లానే ఇందులో కూడా ఓ రకమైన మేజిక్ చూపించాడు విక్రమ్. సన్నివేశాలతో కట్టిపడేశాడు. జగపతిబాబు, రమ్యకృష్ణ, అఖిల్ మధ్య అద్భుతమైన ఎమోషన్స్ పండించిన దర్శకుడు… అదే కాంబినేషన్ లో కామెడీ కూడా పుట్టించాడంటే విక్రమ్ కుమార్ టాలెంట్ అర్థం చేసుకోవచ్చు.
ఈ దర్శకుడికి సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ నుంచి పూర్తి సహకారం అందింది. ఒక్కో ఫ్రేమ్ చూస్తే ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. చాలా సన్నివేశాల్ని సూర్యోదయం, సూర్యాస్తమయం టైమ్ లో తీశారు. ఆ ఫీల్ కూడా సినిమాలా బాగా ఎలివేట్ అయింది. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. ప్రతి పాటా హడావుడి లేకుండా చక్కగా ఉంది. రీ-రికార్డింగ్ అయితే భలే కుదిరింది. ఆర్ట్ వర్క్, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ అన్నీ బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా సెకెండాఫ్ లో ప్రీ-క్లయిమాక్స్ ముందు కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. అక్కడ కాస్త బోర్ కొట్టింది.
నటీనటుల విషయానికొస్తే.. అఖిల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మరీ ముఖ్యంగా పార్కోర్ అనే డిఫరెంట్ ఫైట్స్ కోసం అఖిల్ పడిన కష్టం తెరపై కనిపించింది. స్టెప్స్, డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ లో కూడా చాలా ఇంప్రూవ్ మెంట్ కనిపించింది. హీరోయిన్ కల్యాణి మరీ అదిరిపోయే రేంజ్ లో లేకపోయినా, తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరికీ నచ్చేసింది. ఈ కథకు ఆమె పెర్ ఫెక్ట్. సెంటిమెంట్ సీన్స్ లో జగపతిబాబు, రమ్యకృష్ణ తమ సీనియారిటీ చూపించారు.
ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, హలో సినిమా టెక్నికల్ గా చాలా రిచ్ గా తెరకెక్కింది. ఈ సినిమా కోసం వేసిన సెట్స్, మెట్రో రైలులో తీసిన ఫైట్, విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే అందరికీ నచ్చుతాయి. కానీ ఫస్టాఫ్ లో దాదాపు అర్థగంట పాటు అఖిల్ కనిపించకపోవడం, సెకండాఫ్ ప్రీ-క్లయిమాక్స్ కు ముందు కాస్త్ బోర్ కొట్టడం, ఫ్లాట్ నెరేషన్ ఈ సినిమాకు మైనస్ పాయింట్స్.
ఓవరాల్ గా హలో సినిమా బాగుంది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. సినిమా హిట్.

రేటింగ్ – 3.25/5