హీరోయిన్ మెహ్రీన్ ఇంటర్వ్యూ

Published On: September 28, 2017   |   Posted By:

హీరోయిన్ మెహ్రీన్ ఇంటర్వ్యూ

అప్పుడెప్పుడో కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాలో కనిపించింది. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత మహానుభావుడు మూవీతో మరోసారి తెరపైకొస్తోంది మెహ్రీన్. రేపు విడుదలకానున్న ఈ సినిమా కచ్చితంగా తనకు బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది ఈ ముద్దుగుమ్మ.

మహాలక్ష్మికి, మేఘనకు సంబంధం లేదు

ఈ సినిమాలో నా పాత్ర పేరు మేఘన. ప్రేమించినప్పుడు హీరోకు ఓసీడీ అనే బలహీనత ఉన్న విషయం హీరోయిన్ కు తెలీదు. తర్వాత నిజం తెలిసి తను ఎలా ప్రవర్తిస్తుందనేది సినిమా స్టోరీ. ఇందులో నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. కృష్ణగాడి వీరప్రేమగాథలో చేసిన మహాలక్ష్మి పాత్రకు ఈ క్యారెక్టర్ కు అస్సలు సంబంధం ఉండదు. మహాలక్ష్మి ఓ పల్లెటూరి పిల్ల. కానీ మేఘన మాత్రం సిటీ అమ్మాయి.

ఈ సినిమా ఛాన్స్ రావడం నా అదృష్టం

నా జీవితంలో నాకెప్పుడు ఓసీడీ క్యారెక్టర్లు ఎదురవ్వలేదు. కానీ ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సినిమాను మారుతి డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వర్కింగ్ స్టయిల్ కు పడిపోయాను. ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం నా అదృష్టం.

మారుతి వర్కింగ్ స్టయిల్ సూపర్

మారుతితో వర్క్ చేయడం చాలా బాగుంది. ఈ సినిమా విడుదలకు ముందే మారుతి డైరక్ట్ చేసిన సినిమాలు చూశాను. ఈ సినిమా కంటే ముందే మారుతితో నాకు పరిచయం ఉంది. మరీ ముఖ్యంగా ఇది యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్ లో వస్తోంది. పైగా మారుతి చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఇలాంటి క్యారెక్టర్ మళ్లీ చేయలేనేమో అనిపించింది. అందుకే వెంటనే ఒప్పుకున్నాను.

ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి

సైకలాజికల్ డిజార్డర్ కాకుండా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. హీరోకు, నాకు మధ్య వచ్చే లవ్ సీన్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. కామెడీ ఉంది. ఇలా కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా వస్తోంది మహానుభావుడు సినిమా. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల మధ్య ఎలాంటి పోలికలు ఉండవు. కేవలం దర్శకుడు మాత్రమే సేమ్. కథ, కథనం పరంగా ఈ రెండు సినిమాలు డిఫరెంట్. సినిమా చూస్తే మొదటి 10నిమిషాల్లోనే ఆ విషయం మీకు అర్థమౌతుంది.

తెలుగు నేర్చుకుంటున్నాను

తెలుగు నాకు అర్థమౌతుంది. కాకపోతే నేను మాట్లాడలేను. డైలాగ్స్ అన్నీ నాకు తెలుగులోనే చెప్పేవారు. నేను అర్థం చేసుకొని నటించేదాన్ని. సినిమాలో నాకు చాలా పెద్ద డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ అన్నింటినీ నేను తెలుగులోనే చెప్పాను. యూనిట్ అందరి నుంచి మంచి సపోర్ట్ ఉంది.

ఇకపై అన్నీ తెలుగు సినిమాలే
కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత కావాలనే బ్రేక్ తీసుకున్నాను. ఆ టైమ్ లో ఓ హిందీ సినిమా చేశాను. అందుకే నాకు ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు నా టైమ్ వచ్చింది. రేపట్నుంచి నా టైమ్ మొదలవుతుంది. ప్రతి 2 వారాలకు ఒక సినిమా ఉంటుంది. ఈ ఏడాదిన్నరలో నేను ఏ సినిమా నుంచి బయటకు రాలేదు. కాకపోతే కొన్ని పరిస్థితులు అనుకూలించక కొన్ని సినిమాలు ఒప్పుకోలేదు. అయితే నేను మాత్రం ఖాళీగా లేను.

హిందీ సినిమాకు మంచి రెస్పాన్స్

హిందీలో ఫిలౌరీ సినిమా చేశాను. అనుష్క శర్మ నిర్మించిన సినిమా అది. అది బాగా ఆడింది. సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ వసూళ్లు బాగున్నాయి. నాకు బాలీవుడ్ ఛాన్స్ ఇచ్చినందుకు అనుష్కకు రుణపడి ఉంటాను. ప్రస్తుతానికి ఎలాంటి హిందీ సినిమాలు ఒప్పుకోలేదు. తెలుగులో ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత మళ్లీ ఆలోచిస్తా.

శర్వానంద్, రవితేజ గురించి..

శర్వానంద్ చాలా నిజాయితీ ఉన్న వ్యక్తి. చాలా మంచోడు. మహానుభావుడు షూటింగ్ కు ముందు శర్వాను ఒక్కసారి కూడా కలవలేదు. డైరక్ట్ గా సెట్స్ పై కలవడమే. మొదటి రోజు షూటింగ్ లోనే మేమిద్దరం బాగా కలిసిపోయాం. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఇక రవితేజ విషయానికొస్తే అతనిలో ఎప్పుడు ఓ ఎనర్జీ కనిపిస్తుంది. రవితేజ ఉంటే సెట్స్ అంతా సందడిగా ఉంటుంది. రాజా ది గ్రేట్ సినిమాలో నాకు ప్రతి రోజు ఓ పండగలా ఉండేది. తన సీనియారిటీని, స్టార్ డమ్ ను ఎప్పుడూ రవితేజ చూపించలేదు. ఇదే ఫస్ట్ మూవీ అన్నట్టు బిహేవ్ చేస్తారు. రవితేజలో ఈ క్వాలిటీ నాకు బాగా నచ్చింది.

మహానుభావుడిలో నాకు నచ్చినవి

అతిశుభ్రత అనే బలహీనత అందర్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో ఇది ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే అది మోతాదుకు మించితే రోగంగా మారుతుంది. ఈ సినిమాలో ఆనంద్ అనే క్యారెక్టర్ ఇలాంటిదే. సినిమాలో ఫస్టాఫ్ అంతా సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. సెకండాఫ్ లో గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది. స్టోరీ కాన్సెప్ట్ తో పాటు హీరో క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. తమన్ పాటలు కూడా బాగా నచ్చాయి.

అప్ కమింగ్ ప్రాజెక్టులు

ప్రస్తుతం 2 కథలు విన్నాను. ఇంకా ఏవీ ఓకే చేయలేదు. చేతిలో ఉన్న 3 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత వాటిలో ఒకటి సెలక్ట్ చేసుకుంటాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇకపై వరుసగా తెలుగులోనే సినిమాలు చేస్తాను.