హీరో కార్తి ఇంటర్వ్యూ

Published On: November 13, 2017   |   Posted By:

హీరో కార్తి ఇంటర్వ్యూ

తమిళ, తెలుగు భాషల్లో హీరోగా పాపులర్ అయిన కార్తి, ఈసారి ఖాకీ యూనిఫాంలో వస్తున్నాడు. కార్తి పోలీసాఫీసర్ గా నటించిన చిత్రం ఖాకీ. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న ఈ సినిమాలో చాలా విశేషాలున్నాయంటున్నాడు కార్తి.

ఈ సినిమా సంగతుల్ని మీడియాతో పంచుకునేందుకు ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన కార్తి,ఖాకీ గురించి చాలా వివరాలు షేర్ చేసుకున్నాడు.

కంప్లీట్ కాప్ స్టోరీ ఇది

న్యూస్ చదువుతున్నాం. నేరాలు, ఘోరాలు చూస్తున్నాం. తర్వాత పేజీకి వెళ్లిపోతున్నాం. కానీ చదువుతున్న స్టోరీ బ్యాక్ గ్రౌండ్ కు మాత్రం వెళ్లడం లేదు. ఎందుకిలా జరుగుతోందనే రీసెర్చ్ చేయడం లేదు.  ఈ సినిమా అలాంటి ఓ రీసెర్చ్. క్రిమినల్ ఎవరో తెలుసుకోవడం కష్టం, అతడ్ని పట్టుకోవడం చాలా కష్టం. 15 ఏళ్ల కిందట తమిళనాడు పోలీసులు ఇలాంటి ఘటనను ఎలా ఛేధించారు అనేది ఈ స్టోరీ.

రియల్ లైఫ్ పోలీస్ కనిపిస్తాడు

సినిమాలో పోలీస్ ఏదైనా చేయొచ్చు. అతడ్ని ఓ సూపర్ హీరోలా చూపిస్తారు. కానీ రియల్ లైఫ్ లో పోలీస్ కు చాలా అడ్డంకులు ఉంటాయి. లక్ష కండిషన్లు ఉంటాయి. అవన్నీ ఇందులో చూస్తారు. ఈ సినిమాలో పోలీస్ ను ఉన్నది ఉన్నట్టు రియలిస్టిక్ గా చూపించాం. అందుకునే జీతంతో ఓ పోలీస్ ఇలాంటి పనులు చేయడం చాలా కష్టం. ప్రతి పోలీస్ రోజుకు 22 గంటలు పనిచేస్తున్నాడు. ఆ మాత్రం జీతానికి అతడు ఎందుకు అంత కష్టపడాలి? ఈ విషయాల్ని ఇందులో చర్చించాం.

పోలీస్ కూడా మనిషే

ఇదొక రియల్ లైఫ్ స్టోరీ. దర్శకుడు వచ్చిన ఈ కథ నాకు చెప్పినప్పుడు అప్పటికే నాకు ఇది తెలుసు. ఈ క్యారెక్టర్ చేయాలని వెంటనే ఫిక్స్ అయ్యాను. ఇందులో హీరో కనిపించడు. పోలీస్ ను కూడా సాధారణ మనిషిగా చూపించాం. అదే ఈ సినిమాలో కొత్తదనం.

సినిమా అంతా ఓ డ్రామా

15 ఏళ్ల కిందటి కథ ఇది. అప్పుడు ఇంటర్నెట్ ఇంత స్పీడ్ లేదు. మొబైల్స్ కూడా ఇంత పాపులర్ కాదు. అలాంటి టైమ్ లో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ఎంత కష్టమైంది. దాని వల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగాయి అనే విషయాన్ని ఖాకీ సినిమాలో చూపించాం. సినిమా మొత్తం ఓ డ్రామాలా సాగిపోతుంది. కావాలని పాటలు ఇరికించలేదు. అన్ని సాంగ్స్ స్టోరీలో భాగమే.

సింగంకు ఖాకీకి సంబంధం లేదు

సింగం పోలీస్ సినిమా పోలీస్. ఖాకీలో పోలీస్ రియల్ పోలీస్. బయట పోలీసులు ఎలా ఉంటారో ఖాకీలో కూడా పోలీస్ అలానే ఉంటాడు. 80శాతం రియలిస్టిక్ గా ఉంటుంది. అక్కడక్కడ సినిమాటిక్ లుక్ కనిపిస్తుంది. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత పోలీస్ పాత్ర చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ చేస్తున్న ప్రతిసారి గర్వంగా అనిపిస్తుంది.

రకుల్ వెరీ నార్మల్

ఈ సినిమాలో రకుల్ చాలా బాగా చేసింది. ఓ పోలీస్ భార్య ఎలా బిహేవ్ చేస్తుందో అలానే ఇందులో రకుల్ కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆమె చేయని క్యారెక్టర్ ఇది. ఆమెకిది కంప్లీట్ ఛేంజ్ ఓవర్. ఓ నార్మల్ అమ్మాయిగా కనిపిస్తుంది. సాదాసీదా చీర కట్టుకొని, పువ్వలు పెట్టుకొని కనిపిస్తుంది. తన జీవితం అంటే భర్త మాత్రమే.

రియల్ లైఫ్ ఘటనలే

ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలుంటాయి. దొరికిన ఆధారాల ద్వారా ఎలా కేసు చేధించాడనే విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించాం. ఒక పోలీస్ కు ఒక కేసు మాత్రమే ఉన్నట్టు చూపిస్తారు సినిమాల్లో. కానీ వాస్తవానికి ఒక పోలీస్ కు రోజుకు వందల కేసులు వస్తాయి. వాటిలో ఒక కేసుపై దృష్టి పెట్టడం చాలా కష్టం. ఇలా రియల్ గా ఉండే పరిస్థితుల మధ్య ఖాకీ సినిమా నడుస్తుంది.

చాలామంది కొత్తవాళ్లు ఉన్నారు

ఇదొక ట్రావెల్ సినిమా. సౌత్ నుంచి నార్త్ వరకు కేసు కోసం వెళ్లాలి. కాబట్టి ఇందులో చాలామంది ఆర్టిస్టులు, మరీ ముఖ్యంగా థియేటర్ ఆర్టిస్టులు కనిపిస్తారు. భోజ్ పురి ఆర్టిస్టులు కూడా కనిపిస్తారు. వీళ్లందరి వల్ల ఈ సినిమాకు ఓ కొత్తదనం వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది కదా. అది కూడా చూపించాం.

పోలీసులపై ప్రేమ పెరిగింది

ఈ సినిమా చేసిన తర్వాత పోలీసులపై చాలా గౌరవం పెరిగింది. ఎక్కడైనా పోలీస్ కనిపిస్తే సర్.. ఏమైనా తింటారా అని అడగాలనిపిస్తుంది. రోజంతా దుమ్ము-ధూళి మధ్య నిల్చొని ఉంటారు. జీపులోనే ఏదో తింటుంటారు. పోలీసులంటే నాకు చాలా గౌరవం. ఖాకీ సినిమా చేసిన వాళ్లపై ప్రేమ పెరిగింది.

ప్రేక్షకుడిగా మాత్రమే ఆలోచిస్తా

ఏదైనా ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు అది తమిళ్ కు సూట్ అవుతుందా.. తెలుగులో వర్కవుట్ అవుతుందా అని ఆలోచించను. జస్ట్ ఓ సాధారణ ప్రేక్షకుడిలా కథ వింటాను. నచ్చితే చేస్తాను. కేవలం ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తే అవి ఆడవు. సినిమా మంచిదైతే భాషతో సంబంధం లేకుండా అందరూ చూస్తారు.

6 నిమిషాల సన్నివేశం సింగిల్ టేక్ లో…

ఖాకీ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. దర్శకుడు ముందే చెప్పాడు. నాకు ఈ సినిమాలో కార్తి కనిపించొద్దు. ఓ పోలీస్ ఆఫీసర్ కనిపించాలన్నారు. అందుకే క్యారెక్టర్ కోసం బాగా తగ్గాను. 6 నిమిషాల ఓ సీన్ ను సింగిల్ షాట్ లో తీశారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ను చూస్తే అవినీతి రాజకీయ నాయకుడైనా గౌరవం ఇస్తాడు. ఈ సినిమా అలానే ఉంటుంది.

అప్ కమింగ్ ప్రాజెక్టులు

నెక్ట్స్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తాను. తర్వాత రకుల్ హీరోయిన్ గా మరో సినిమా ఉంటుంది. అది కంప్లీట్ ప్రేమకథ. ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలే ఓకే చేశాను.

బిల్డింగ్ కడితేనే విశాల్ పెళ్లి

నడిగర్ సంఘం బిల్డింగ్ పనుల్లో నేను కూడా చురుగ్గా పాల్గొంటున్నాను.  ఆ బిల్డింగ్ కంప్లీట్ అయితే కానీ విశాల్ పెళ్లిచేసుకోడు. అతడి పెళ్లి కోసమైనా మేమంతా కష్టపడి బిల్డింగ్ కడుతున్నాం. కాకపోతే మౌలిక సదుపాయాలు కావాలి. దీని కోసం అంతా కలిసి రావాలి. కార్పస్ ఫండ్ పై వచ్చే వడ్డీతో బిల్డింగ్ కట్టడం కష్టం.

రాజకీయాలు నాకు పడవు

పాలిటిక్స్ లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు. పాలిటిక్స్ లో రాణించడం చాలా కష్టం. విశాల్ లాంటి బ్యాచిలర్ కు రాజకీయాలు ఓకే. నాలాంటి వాడికి అస్సలు పడవు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు.