హీరో రక్షిత్ ఇంటర్వ్యూ

Published On: November 13, 2017   |   Posted By:

హీరో రక్షిత్ ఇంటర్వ్యూ

లండన్ బాబులు సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు బెజవాడ కుర్రాడు రక్షిత్. ఈ సినిమా కచ్చితంగా తనకు బ్రేక్ ఇస్తుందని, హీరోగా నిలబెడుతుందని ఆశపడుతున్నాడు రక్షిత్. ఈ సినిమా డీటెయిల్స్ తో పాటు హీరోయిన్ స్వాతితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ను మీడియాతో షేర్ చేసుకున్నాడు.

సినిమాలో కామెడీ అదుర్స్

నాకిదే మొదటి సినిమా. డైరక్టర్ చిన్నికృష్ణకు ఇది మూడో సినిమా. ఆండావళ్ కట్లై అనే తమిళ సినిమాకు రీమేక్ గా లండన్ బాబులు సినిమా వస్తోంది. తమిళ్ లో విజయ్ సేతుపతి చేసిన సినిమా ఇది. మా లండన్ బాబులు చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్స్ వచ్చాయి.

మారుతి గారే అంతా..

మారుతి గారి పర్యవేక్షణలోనే సినిమా సాగింది. నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మారుతి గారు తెరకెక్కించారు. సినిమా ఆల్రెడీ చూశాను. ఫస్ట్ కాపీ వచ్చేసింది. అవుట్ పుట్ చూసి చాలా హ్యాపీగా ఉంది.

హీరోగా చేయమని అడిగారు

మారుతి గారు మాకు ముందే తెలుసు. దాదాపు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటివారు. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు విజయవాడ వచ్చిన మారుతి నన్ను, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. అప్పట్లో దాని గురించి ఏమీ అనుకోలేదు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్ లో మేం కలిసినప్పుడు నన్ను చూసి ఆయన హీరోగా ఫిక్స్ అయ్యారు. తమిళ సినిమా చూసిన తర్వాత చేయాలని నాకు కూడా అనిపించింది. అలా ఈ సినిమా సెట్ అయింది.

మధ్యతరగతి కుర్రాడి కథ

స్టోరీ ఏంటంటే.. ఓ యావరేజ్ మిడిల్ క్లాస్ అబ్బాయి డబ్బు సంపాదించాలనుకుంటాడు.. విదేశాలకు వెళ్తే ఈజీగా డబ్బు సంపాదించొచ్చని భావిస్తాడు. దీని కోసం వీసా, పాస్ పోర్ట్ ఎలా సంపాదిస్తాడు. ఆ క్రమంలో ఎలాంటి తప్పులు చేస్తాడు.. ఫైనల్ గా అతడు లండన్ వెళ్లాడా లేదా అనేది స్టోరీ. మధ్యలో స్వాతి ఎంటర్  అవుతుంది. ఇందులో స్వాతి రిపోర్టర్ గా చేశారు.

సందేశం ఉండదు.. అంతా కామెడీనే

ఇంజనీరింగ్ తర్వాత అంతా విదేశాలకు వెళ్లిపోవాలని అనుకుంటారు. వాళ్లకు సందేశం ఇచ్చేలా ఈ సినిమా ఉండదు కానీ, ఆ ప్రాసెస్ మాత్రం ఇందులో చూపించాం. సరదాగా నవ్వుకుంటూనే, వీసా ప్రాసెస్ లో జాగ్రత్తపడేలా సినిమా ఉంటుంది.

నేచురాలిటీ కోసం యాక్టింగ్ నేర్చుకోలేదు

యాక్టింగ్ విషయంలో పెద్దగా ట్రయినింగ్ తీసుకోలేదు. ఫస్ట్ లో ట్రయినింగ్ కోసం కొన్ని రోజులు వెళ్లినప్పటికీ మారుతి గారు వద్దన్నారు. యాక్టింగ్ నేచురల్ గానే ఉండాలన్నారు. అక్కడ్నుంచి అన్ని విషయాలు మారుతి గారే చూసుకున్నారు. నాతో సహజంగానే అన్నీ చేయించారు. నాకు ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనిపించలేదు. మారుతి గారి వల్లనే పరిశ్రమకొచ్చాను.

ఆమె చాలా కూల్

స్వాతి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అలాంటి నటితో ఫస్ట్ సినిమా చేయడం చాలా హ్యాపీ. మామూలుగా అయితే స్వాతి చాలా సెలక్టివ్. సినిమాల విషయంలో ఎంతో కేర్. ఆవిడ ఒప్పుకోవడంతోనే మా సినిమా సగం సక్సెస్ అయింది.  స్వాతి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.

టైటిల్ వెనక రహస్యం

ఆర్టిస్టుగా ఎదగడం కోసం ప్రస్తుతం డాన్స్, డైలాగ్స్ లో శిక్షణ తీసుకుంటున్నాను. మంచి కథలు ఉన్న స్టోరీలు చేద్దామనుకుంటున్నాను. మా సినిమాలో నేను, సత్య నటించాం. అంతర్వేది అనే గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి ఎలా బ్రోకర్ల చేతిలో పడ్డాం, ఫైనల్ గా లండన్ వెళ్లామా లేదా అనేది స్టోరీ. అందుకే లండన్ బాబులు అనే టైటిల్ పెట్టాం.

లవ్ స్టోరీ కాదు.. కానీ లవ్ ఉంటుంది

నేను విజయవాడ సిద్దార్థ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాను. తర్వాత ఎంఎస్ చేద్దామనుకున్నాను. ఈ గ్యాప్ లో బిజినెస్ చూసుకుందామని హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మారుతి గారి పరిచయంతో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా లవ్ స్టోరీలా ఉండదు. కానీ లవ్ ట్రాక్ ఇండైరెక్ట్ గా నడుస్తుంది.

మిడిల్ క్లాస్ అబ్బాయిగా..

ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఓ మిడిల్ క్లాస్ పాత్ర. మెడలో ఆంజనేయస్వామి తాయెత్తు. చేతికి కాశీ తాడు ఉంటాయి. వేసుకునే బట్టలు కూడా మిడిల్ క్లాస్ లోనే ఉంటాయి. సినిమాల్లో హీరో ఒకసారి వేసిన డ్రెస్ మళ్లీ ఆ సినిమాలో కనిపించదు. కానీ ఈ సినిమాలో నేను వేసుకున్న బట్టలే మళ్లీ మళ్లీ వేసుకుంటాను. నేచురాలిటీ కోసమే అలా చేశాం. ఇక స్వాతి టీవీ యాంకర్ గా నటించారు.

గట్టి పోటీ మధ్య వస్తున్నాం

చాలా గట్టి పోటీ మధ్య వస్తున్నాం. మా లండన్ బాబులుతో పాటు చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ మా సినిమా బాగా వచ్చింది. కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతోనే దిగుతున్నాం.