హీరో రాజశేఖర్ ఇంటర్వ్యూ

Published On: October 31, 2017   |   Posted By:

హీరో రాజశేఖర్ ఇంటర్వ్యూ

గరుడ వేగ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు హీరో డా.రాజశేఖర్. ఈ సినిమా తనకు రీఎంట్రీ లాంటిదని అంటున్నారు రాజశేఖర్. తన మార్కెట్ తక్కువగా ఉన్న టైమ్ లో పాతిక కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమా చేయడం సాహసం అయినప్పటికీ, మూవీ చూస్తే బడ్జెట్ పెట్టడంలో తప్పులేదని అంతా ఫీలవుతారని అంటున్నారు. గరుడ వేగ సినిమా విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు డా.రాజశేఖర్.

నిజంగా చాలా లక్కీ

చాలా రోజుల తర్వాత పీఎస్వీ గరుడ వేగ అనే సినిమాతో మీ ముందుకొస్తున్నాను. నా కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా. రిలీజ్ టైమ్ కు ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయింది. నా ఇమేజ్, నా రేంజ్, ప్రస్తుతం నేను ఉన్న పొజిషన్ కు ఇది కరెక్ట్ సినిమా. నన్ను క్యారెక్టర్ రోల్స్ చేస్తావా అని అంతా అడుగుతున్న టైమ్ లో ఇలాంటి సినిమా పడింది. నిజంగా లక్కీ.

ఏడాదిన్నరగా నలుగుతోంది

ఏడాదిన్నర కిందట ప్రవీణ్ సత్తారు మా ఇంటికొచ్చారు. మగాడు పార్ట్-2 అనే టైటిల్ తో నాకొక స్క్రిప్ట్ చెప్పారు. ఎందుకు ఆ టైటిల్ పెట్టారని అడిగితే, ఆ సినిమా స్ఫూర్తితో చేసిన సబ్జెక్ట్ ఇదని చెప్పారు. కెరీర్ స్టార్టింగ్ లో ప్రవీణ్ రాసుకున్న కథ ఇది. ఎట్టకేలకు తన ఐదో సినిమాగా దీన్ని తెరకెక్కించారు.

ఉన్నది ఉన్నట్టు తీస్తానన్నాడు

సబ్జెక్ట్ వినగానే నేను ఆశ్చర్యపోయాను. ఇంత భారీగా చెప్పారు, ఎగ్జిక్యూట్ చేయగలరా అని అడిగాను. అప్పుడు ప్రవీణ్ నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఇందుల ఉన్నది ఉన్నట్టు తీస్తాను డౌట్ వద్దని చెప్పారు. సినిమా చూస్తే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ప్రవీణ్ ఎలా చేయగలడా అనుకున్నాను. కానీ చెప్పింది చేయగలడని నాకు ఫస్ట్ డేనే క్లారిటీ వచ్చేసింది.

నా మార్కెట్ చాలా తక్కువ

నేను చాలా లో-లెవెల్లో ఉన్న పొజిషన్ ఇది. 3-4 కోట్లు పెడితే ఎక్కువ. కానీ నన్ను హీరోగా పెట్టి 25 కోట్ల రూపాయల ఖర్చుతో సినిమా చేశారు. హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో సినిమా చేయాలని నాకు ఎప్పట్నుంచో ఉంది. కానీ నా మార్కెట్ ఇంత లో-లెవెల్ లో ఉన్న సమయంలో ఇంత బడ్జెట్ తో రావడం నా అదృష్టం. మా నాన్నగారి ద్వారా కోటీశ్వర రాజు గారు పరిచయమయ్యారు. అతనికి స్టోరీ నెరేట్ చేశాం. అలా సినిమా సాకారమైంది.

ఇదే నా కమ్ బ్యాక్ మూవీ

ఈ సినిమా స్టోరీ విన్న వెంటనే నా భార్య జీవిత ఒకటే ఫీలైంది. ఇదే నా కమ్ బ్యాక్ మూవీ అని చెప్పింది జీవిత. ఇప్పటివరకు ఏవేవో సినిమాలకు డబ్బు ఖర్చుపెట్టేశాం. ఇలాంటి సినిమాలకు ఖర్చు పెట్టి ఉంటే డబ్బు వచ్చేసి, సక్సెస్ కూడా వచ్చేదని జీవిత ఫీల్ అయింది. నేను కూడా అలానే ఫీలయ్యాను. మొత్తమ్మీద 7 కోట్లతో తీద్దామనుకున్న ఈ సినిమా 25కోట్ల బడ్జెట్ తో తీయగలిగాం. నిజంగా ఈ సినిమా చేయడం నా అదృష్టం.

నా టాప్-5 సినిమాల్లో ఇది ఉంటుంది

నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ ఇది. నేను చేసిన ది బెస్ట్ 5 సినిమాల్లో గరుడ వేగ కూడా ఉంటుంది. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నా అభిప్రాయమిది. గతంలో ఇలానే సూపర్ హిట్ అని కొన్ని సినిమాలకు చెప్పాను. అవి ఫ్లాప్ అయ్యాయి. కానీ ఈ సినిమా అలా కాదు. కచ్చితంగా హిట్ అవుతుంది.

సినిమా హిట్టని అప్పుడే అర్థమైంది

మా గరుడ వేగ టీజర్ రిలీజ్ అయినప్పుడే సినిమా హిట్ అనే విషయం మాకు అర్థమైపోయింది. టీజర్ కు లక్ష లైకులొస్తే చాలనుకున్నాం. కానీ 5 రోజుల్లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. అప్పుడే నాకు సినిమా హిట్టని అర్థమైపోయింది. టీజర్ కే ఇంత రెస్పాన్స్ అంటే సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది.

భారీగా, కొత్తగా ఉంటుంది

గతంలో ఇలాంటి కాన్సెప్ట్స్ తో చాలా సినిమాలొచ్చాయి. నేను కూడా నటించాను. కానీ గరుడ వేగ సినిమా చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమా చూస్తే మీకే అర్థమౌతుంది. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి. యాక్షన్ సీక్వెన్సులు మీకు బాగా నచ్చుతాయి. నచ్చడం కాదు, చాలా కొత్తగా ఫీల్ అవుతారు కూడా.

నన్ను తప్ప వేరే హీరోను ఊహించుకోలేదు

ఈ సినిమాకు నన్ను తప్ప మరో హీరోను ఊహించుకోలేకపోతున్నానని ప్రవీణ్ సత్తారు అన్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది. నాకు ఇంకా సీన్ ఉందని అనిపించింది. నేను కూడా చేయగలనని నామీద నాకు నమ్మకం కలిగింది. టీజర్, ట్రయిలర్ సక్సెస్ అవ్వడంతో నా నమ్మకం రెట్టింపు అయింది.

టైటిల్ వెనక పెద్ద కథే ఉంది

పీఎస్ వీ గరుడ వేగ 126 అనే టైటిల్ వెనక చాలా పెద్ద కథ ఉంది. ఈ సినిమాకు టైటిల్ కు చాలా లింక్ ఉంది. అదేంటో చెప్పేస్తే సస్పెన్స్ పోతుంది. సినిమా చూసిన తర్వాత మీకే అర్థమౌతుంది. ప్రవీణ్ కూడా టైటిల్ గురించి నన్ను మాట్లాడొద్దని చెప్పాడు.

నేను.. నా క్యారెక్టర్

సినిమాలో నా పాత్ర ఎన్ ఐఏ ఆఫీసర్. ఎన్ ఐ ఏ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్. నాకు పై అధికారిగా నాజర్ చేస్తున్నారు. ఓ అధికారి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ ఎలా ఉంటుందనేది ఇందులో చూస్తారు. మధ్యలో గరుడ వేగ అనేది ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. వృత్తిగతంగా ఆఫీసర్ కు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వ్యక్తిగతంగా ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తాయో సినిమా చూసి తెలుసుకోవాలి.

మా డబ్బు ఎక్కడికీ పోదు

ఈ సినిమాకు 25 కోట్ల రూపాయలు పెట్టడానికి మెయిన్ రీజన్ ఉంది. ఒకటి సినిమాపై నమ్మకం అయితే, రెండోది మినిమం గ్యారెంటీ వసూళ్లు. సినిమాకు ఏమాత్రం హైప్ వచ్చినా వారం రోజుల్లో 25 కోట్లు వస్తున్నాయి. కాబట్టి మేం పెట్టిన డబ్బులు ఎక్కడికీ పోవు. అదృష్టంకొద్దీ హిట్ అయితే ఊహించిన దానికంటే ఎక్కువే వస్తుంది. ఎలా చూసుకున్నా మేం సేఫ్ గానే ఉంటాం.

విలన్ గా రెడీ

గరుడ వేగ సినిమా సూపర్ హిట్ అయినా మంచి పాత్రలు వస్తే క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తా. విలన్ గా నటించడానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ధృవ సినిమాలో అరవింద్ స్వామి చేసినలాంటి పాత్రలో కనీసం 90 శాతం ఉన్నా నేను చేయడానికి రెడీ. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బాలకృష్ణ, నేను కలిసి సినిమా చేద్దామనుకున్నాను. అందులో అవసరమైతే నేను విలన్ గా కూడా చేస్తానని ప్రవీణ్ కు చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. హీరో ఎవరైనా మంచి విలన్ పాత్ర దొరికితే చేస్తా.