హ్యాపీ బర్త్ డే టు కింగ్ నాగార్జున

Published On: August 29, 2017   |   Posted By:

హ్యాపీ బర్త్ డే టు కింగ్ నాగార్జున

అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో అక్కినేని నాగార్జున. తండ్రి వారసత్వాన్నే కాదు, ఆయనలోని విలక్షణ నటనను కూడా పుణికి పుచ్చుకుని ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్‌ చిత్రాలు, మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు, భక్తిరస చిత్రాలు ఇలా విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న హీరో టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున. 1986లో విక్రమ్‌ సినిమాతో తెలుగు సినిమా రంగం ప్రవేశం చేసిన నాగార్జున. నటుడిగా మూడు దశాబ్దాలను పూర్తి చేసుకున్నారు. కెరీర్‌ ప్రారంభం నుండి విలక్షణమైన కథ, కథనాలు, క్యారెక్టరైజేషన్స్‌ ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఇమేజ్‌ చట్రంలో కూరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అప్రతి హాతంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ ఈతరం యంగ్‌ హీరోలతో పోటీపడి అన్నీ రకాల చిత్రాల్లో నటిస్తున్నారు. నటుడిగా, స్టూడియో అధినేతగా, నిర్మాతగా తనదైన మార్కును చూపిస్తున్నారు. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, రా రండోయ్‌ వేడుక చూద్దాం వరుస విజయాలను నిర్మించి టేస్ట్‌ ఫుల్‌ నిర్మాతగా ప్రూవ్‌ చేసుకున్నారు.

వెండితెరైనా, బుల్లితెరైనా నాగ్‌.. ఓ ట్రెండ్‌ సెట్టర్‌

విక్రమ్‌, అరణ్యకాండ, కెప్టెన్‌ నాగార్జున వంటి చిత్రాలతో ప్రేక్షుల్లో తనదైన ముద్ర వేసిన నాగార్జున దర్శకరత్న డా||దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటించిన ‘మజ్ను’ చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టడమే కాకుండా భగ్న ప్రేమికుడిగా తను చూపిన అసాధారణ నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు.

సంకీర్తన, అగ్నిపుత్రుడు, కిరాయిదాదా, కలెక్టర్‌గారి అబ్బాయి వంటి చిత్రాలతో నాగార్జున ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

మణిరత్నం దర్శకత్వంలో విడుదలైన గీతాంజలి నాగార్జున కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఫైట్స్‌, డ్యాన్సులతోనే కాదు, అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు.

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మతో నాగార్జున చేసిన మరో ప్రయోగం శివ. అప్పటి వరకు ఉన్న ఇండియన్‌ సినిమా తీరు తెన్నుల్నే మార్చేసేలా ఈ సినిమా తిరుగులేని విజయం అందుకుంది. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ సినిమాను అప్పటి ట్రెండ్‌కు భిన్నంగా ట్రెండ్‌ సెట్‌ చేయడం నాగార్జున సాహసానికి నిదర్శనమని చెప్పాలి.

నటుడిగానే కాదు మంచి నిర్మాతగా ఇండస్ట్రీకి చాలా మంది కొత్త నటీనటులు, టెక్నిషియన్స్‌ను పరిచయం చేసిన క్రెడిట్‌ కూడా నాగ్‌కే సొంతం. టాలీవుడ్‌లో హీరోగా ఎంటర్‌ అయి 3 దశాబ్దాలు దాటినా మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు చేయడం, వరుస మూడు చిత్రాలు 50 కోట్ల క్లబ్‌లో చేరి 150 కోట్లకి పైగా కలెక్ట్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేయడం అనేది కింగ్‌ నాగార్జునకే చెల్లింది.

సినిమాల్లోనే కాదు నాగార్జున వ్యాఖ్యాతగా మా టివిలో ధారావాహికగా వచ్చిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం ఆయనలోని మరో కోణాన్ని ఎలివేట్‌ చేసింది. అప్పటి వరకు తెలుగు టీవీల్లో ఉన్న కమర్షియాలిటీకి భిన్నంగా రూపొందిన ఈ ప్రోగ్రాం సామాన్యులకు చేరువైందంటే కారణం నాగార్జునే.

మల్టీస్టారర్స్‌కు శ్రీకారం..

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు చేసిన మల్టీస్టారర్‌ చిత్రాలు ఒక దశలో మృగ్యమైపోయాయి. అటువంటి సమయంలో మల్టీస్టారర్‌లకు శ్రీకారం చుట్టిన హీరో కూడా నాగార్జునే. సూపర్‌స్టార్‌ కృష్ణతో వారసుడు. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబుతో అధినేత. మంచు మంచు విష్ణుతో శ్రీకృష్ణార్జున, కౌశిక్‌ ప్రధానపాత్రలో నటించిన జగద్గురు ఆదిశంకరాచార్య చిత్రాల్లో నటించి మల్టీస్టారర్స్‌కు మార్గం చూపారు.

అంతే కాకుండా రీసెంట్‌గా తమిళ హీరో కార్తీతో కలిసి నటించిన ఊపిరి మరోసారి నాగార్జున కమిట్‌మెంట్‌కు అద్దం పట్టింది. ఈ చిత్రంలో కాళ్ళు చేతులు కదలలేని వ్యక్తి విక్రమ్‌ ఆదిత్యగా నాగార్జున చూపిన నటన అసమానం.

అలాగే తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అఖరి చిత్రం మనంలో కూడా ఇద్దరు తనయులు నాగచైతన్య, అఖిల్‌తో కలిసి నాగ్‌ చేసిన యాక్టింట్‌ అద్వితీయం. అటు ప్రేక్షకులే కాదు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు కూడా నాగ్‌ నటనకు ఫిదా అయిపోయారు.

యాక్షన్‌, మాస్‌ సినిమాలే కాకుండా హాలోబ్రదర్‌, ఆవిడా..మా ఆవిడే వంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌లో నటించి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే క్లాస్‌ , ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీస్‌ అయిన నిన్నేపెళ్ళాడతా, సంతోషం, మన్మథుడు వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.

భక్తిరస చిత్రాలు కూడా..

సినిమా అంటే ఉల్లాసం. కొత్తదనం ఉంటేనే ఆడియెన్స్‌ థియేటర్స్‌కు రావడానికి ఇష్టపడతారు కాబట్టి నిరంతరం కొత్తదనం కోసం తాపత్రయపడే నాగార్జున తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఒక పక్క ఇప్పటి ట్రెండ్‌కు తగిన సినిమాలు చేస్తూనే మరో పక్క భక్తిరస చిత్రాలకు పెద్ద పీట వేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ వంటి చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో నటుడుగా పరిపూర్ణతను సాధించారు.

నటవారసులు…

నాగ్‌ నట వారసులుగా నాగచైతన్య ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తుంటే అఖిల్‌ చిత్రంతో తెరంగేట్రం చేసిన అఖిల్‌ తన రెండో చిత్రం ‘హాలో’తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాను కూడా నాగార్జునే నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 22న ‘హలో’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నాగ్‌. వయసు పెరుగుతున్న కొద్ది యంగ్‌ అవుతున్న నాగార్జున అక్టోబర్‌ 13న ‘రాజుగారి గది2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అల్రెడి విడుదలైన ఈ సినిమా నాగార్జున్‌ లుక్స్‌కు ప్రేక్షకులు, అభిమానుల నుండి హ్యుజ్‌ రెస్పాన్స్‌ వస్తుంది.

ఇప్పటి హీరోలకు నటనలోనే కాదు, గ్లామర్‌లోనూ పోటీనిస్తున్న టాలీవుడ్‌ మన్మథుడు, కింగ్‌ నాగార్జున పుట్టినరోజు ఆగస్ట్‌ 29. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.