`అమృతారామ‌మ్‌` మూవీ రివ్యూ

Published On: April 29, 2020   |   Posted By:

Rating: 1.5

తెలుగు సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులైంది. దాంతో ఓ సినిమా ఓటీటీనో మరో చోటో రిలీజ్ అవుతోందంటే ఓ ఆసక్తి. బాగుంటే మనం చూద్దాం అనే ఇంట్రస్ట్. అందులోనూ డైరక్ట్ ఓటీటిలో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు చిత్రం అని బాహుబలి రేంజి బిల్డప్ పబ్లిసిటీతో వస్తోంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు రిలీజ్ రైట్స్ తీసుకున్నారు. అంటే ఏదో విషయం ఉండే ఉంటుందనే ఆలోచన. సర్లే ఇంట్లో కూర్చుని చూసేదే కదా ఓ లుక్కేస్తే పోలా అనే ధైర్యం ఈ సినిమాకు పుష్కలంగా కలిసొచ్చాయి. అయితే అన్ని కలిసొచ్చిన ఈ సినిమాకు కంటెంట్ కూడా అదే స్దాయిలో కలిసొచ్చిందా..అసలు ఈ సినిమా మ్యాటర్ ఏంటి..మన తెలగు సినిమా ప్రేక్షకుడు మీటర్ కు లొంగేదా ….చూద్దాం.

ఇదే కథ

ఉద్యోగం సద్యోగం లేని రామ్ (రామ్ మిత్త‌కంటి) త‌న ప్రెండ్స్ తో క‌లిసి ఆస్ట్రేలియాలో కాలక్షేపం చేస్తూంటాడు. అదే సమయంలో మాస్ట‌ర్ డిగ్రీ కోసం ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన అమృత (అమృతా రంగ‌నాథ్‌) అతను పరిచయం అవుతాడు. తొలి చూపులోనే రామ్‌ తో పీక లోతు ప్రేమలో పడిపోతుంది. అది ఏ స్దాయి అంటే రామ్ ని ఎవరైనా అమ్మాయి పలకరించినా, హగ్ చేసుకున్నా తట్టుకోలేదు. అసూయతో రగిలిపోయి..రామ్ ని విసిగిస్తుంది. ఓ టైమ్ లో రామ్ ఆమెను వదిలించుకుందామనుకుంటాడు. కానీ ఆమెది స్వచ్చమైన ప్రేమతో ఇలా బిహేవ్ చేస్తోందని అర్దం చేసుకుంటాడు. కానీ ఈ లోగా అతని చుట్టు ప్రక్కల పరిస్దితులు మారతాయి. స్నేహితుడు కోసం పది రూపాయల వడ్డీకి చేసిన అప్పు వాళ్లు బెదిరిస్తూంటారు. మరో ప్రక్క రామ్ మాజీ స్నేహితుడు కావాలని పగబట్టి రామ్ కు, అమృతకు మధ్య గొడవలు క్రియేట్ చేయటానికి ప్రయత్నిస్తూంటాడు. వీటిన్నటినీ దాటుకుని వీళ్లిద్దరూ ఒకటి అయ్యే సమయానికి ఓ ఘోరమైన సంఘటన వీరి జీవితంలో చోటు చేసుకుంటుంది. అక్కడ నుంచి ఏం జరిగింది..ఆ సంఘటన ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

“ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలో ఉండి..లేదా యాక్సిడెంట్ జరిగి..చివరి క్షణాల్లో వస్తే.. నీ లవర్ కు వారి హార్ట్ ని రీప్లేస్ చేసి బ్రతికిస్తాం” అప్పుడు హీరోయిన్ ఎమోషనల్ గా తీసుకునే నిర్ణయమే ఈ సినిమా కోర్ పాయింట్. సినిమా మొత్తాన్ని ఈ ఒక్క సీన్ నమ్ముకుని చేసారు. అయితే అసలు ఆ సీన్ లో బలమెంత అంటే…సూపర్ హిట్ టర్కీ సినిమా Love Likes Coincidences సినిమా క్లైమాక్స్ లో బలమెంత అని ప్రశ్నించాలి. ఎందుకలా అంటే రెండూ ఒకటే కాబట్టి..దర్శకుడు ఆ సినిమా చూసి ఈ కథ రాసుకున్నాడని అర్దమైపోతుంది. పోనీ రాసుకోవచ్చు…ఎవరైనా ఎక్కడైనా ప్రేరణ పొందాల్సిందే. కాకపోతే ఆ ప్రేరణ సహేతుకంగా లేకపోతే సమూలంగా నాశమైపోతుంది. అదే ఈ సినిమాకూ జరిగింది. సినిమా మొదటి నుంచి చివరి దాకా ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ నడుపుతున్నానని దర్శకుడు ఫీల్ అవుతాడు కానీ మనకు అనిపించదు. ఎప్పటికి అసలు కథలోకి వస్తాడు రా అని ఎదురుచూస్తూంటాము. కానీ కథలోకి వచ్చేసరికే సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తుందని తెలిసే సరికి నీరసం వస్తుంది. పోనీ ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకు ఎవరైనా నటన తెలిసిన ఆర్టిస్ట్ లు ఉంటే భరించగలమేమో కానీ అదీ జరగదు.

టెక్నికల్ గా …

“నీ లిప్ స్టిక్ బాగుంది
ధాంక్స్..నీ కోసమే వేసుకున్నా
ఎందుకు..నువ్వు పాడు చేస్తావని
నేను ఎందుకు పాడు చేస్తాను..
సరే..నేనే పాడు చేసుకుంటాలే
నువ్వైనా ఎందుకు పాడు చేసుకోవటం బాగున్నప్పుడు..
సరే..నా లిప్ స్టిక్ చెరిపేయ్…”

వంటి కొన్ని డైలాగులు సినిమాలో బాగున్నాయి. అలాగే రీ రికార్డింగ్ సైతం బాగుంది. మిగతావన్ని చెప్పుకోదగిన స్దితిలో లేవు. కథ..అందులో సీన్స్ ….చిత్తూరు నాగయ్య గారి సినిమాల రోజుల నాటివిలా కనపడతాయి. ఎక్కడైనా కొత్తదనం కానీ, ఈ జనరేషన్ ని గుర్తు చేసే విధానం గానీ ఉండదు. తోచినట్లు రాసుకుని, నచ్చినట్లు తీసుకుని వదిలినట్లుంది. ఇక ఆస్ట్రేలియా వెళ్లినా …అక్కడ వడ్డీ వ్యాపారం చేసే ఒక తెలుగోడు, అదీ లుంగీ, బనీను వేసుకుని, చుట్ట కాల్చుతూ,నలుగురుని వెనకేసుకుని తిరగటం ఓ పెద్ద కామెడీ.

ఇంతోటి కథకు ఆస్ట్రేలియా వెళ్లటం ఎందుకో అర్దం కాదు. ఇక నటీనటులంతా కొత్తవాళ్లే. అక్కడ వాళ్లే అనుకుంటాను. బాగానే చేసారు కానీ గొప్పగా చేయలేరు. సినిమా అనిపించేలా నటించలేదు. డైలాగులు చెప్పుకుంటూ వెళ్లిపోయారు. అయితే వాళ్లలో చేయాలనే ఆసక్తి మాత్రం కనపడింది. హీరో,హీరోయిన్స్ లో హీరోయన్ బెస్ట్. హీరో నాచురల్ గా నటన అయితే కొన్ని చోట్ల చేసాడు. డైరక్షన్ బాగా వీక్.

చూడచ్చా

లాక్ డౌన్ టైమ్ లో మరీ కొత్త సినిమాలు ఏమీ చూడలేదని మనసు పీకేస్తుంటే ఓ లుక్కేయచ్చు కానీ ఎక్సపెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకండి.

ఎవరెవరు..

న‌టీన‌టులు‌: రామ్ మిట్ట‌కంటి, అమిత రంగ‌నాథ్‌, శ్రీజిత్ గంగాధ‌ర‌న్‌, జేడీ చెరుకూరు
ద‌ర్శ‌కుడు: సురేంద‌ర్ కోటండి
నిర్మాత‌: ఎస్ ఎన్ రెడ్డి
సంగీతం: ఎన్ ఎస్ ప్ర‌సు
బ్యాన‌ర్‌: ప‌ద్మ‌జ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సినిమావాలా
ప్రెజెంట‌ర్‌: సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌