అల వైకుంఠపురములో టైటిల్ పెట్టడం వెనక త్రివిక్రమ్ ఆంతర్యం

Published On: August 16, 2019   |   Posted By:
అల వైకుంఠపురములో టైటిల్ పెట్టడం వెనక త్రివిక్రమ్ ఆంతర్యం
 
Image

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న  తాజా చిత్రానికి పెట్టిన టైటిల్ ‘అల వైకుంఠ పురములో’ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ టైటిల్ వినగానే మనస్సులో ఓ విధమైన ఫీల్ రావటమే కాక…ఓ ఆధ్యాత్మికపరమైన దృష్టి కూడా కలుగుతోంది. దాంతో ఈ టైటిల్ పెట్టడం వెనక విశేషం ఏమై ఉండవచ్చు అని ఆలోచనలో పడుతున్నారు. మాకు ఉన్న సమాచారాన్ని బట్టి బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ చేస్తున్న చిన్న విశ్లేషణ.
 
ఈ టైటిల్ లోని వాక్యం …పోతనామాత్యుడు రాసిన భాగవతంలో ముఖ్య ఘట్టమైన గజేంద్ర మోక్షంలోని అల వైకుంఠ పురంబులో అనే పద్య పాదంలోది.  నీళ్లలోకి దిగిన గజరాజును అక్కడున్న మొసలి కాలు పట్టుకోవడంతో.. దాని నుంచి విడిపించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నించిన ఏనుగు.. చివరకు ఆ శ్రీమన్నారాయణుడికి మొర పెట్టుకుంటుంది. అప్పుడు ఏనుగు మొరను ఆలకించిన మహా విష్ణువు హుటాహుటిన భూమిని చేరుకొని తన సుదర్శన చక్రంతో మొసలి తలను ఖండించి ఆ ఏనుగుకు విముక్తిని కలిగిస్తాడు.

గజేంద్ర మోక్షం దృష్టిలోంచి చూస్తే.. ఈ సినిమా కూడా ఇలాంటి కథా నేపథ్యంతోనే నడుస్తుందని తెలుస్తోంది. ఎక్కడో దూరంగా ఉన్న విష్ణుమూర్తి ..వైకుంఠపురం అనే ఇంట్లోకి వచ్చి అక్కడ ఉన్న మొసలి లాంటి కొందరి దుర్మార్గుల చేతిలో ఇరుక్కున్న టబు ను, ఆమె కూతురు అలకనంద ను సేవ్ చేస్తాడు అంటున్నారు.  ఈ సినిమాలో  టబు కోసం ఓ బంగ్లా సెట్‌ను వేశారని, దాని పేరే వైకుంఠ పురం అని సమాచారం. ఆ ఇంట్లోకి అల్లు అర్జున్ ప్రవేశించిన తర్వాత కథ వేడిక్కుతుందంటున్నారు. అంటే అల్లు అర్జున్ ..విష్ణు మూర్తి లాంటి క్యారక్టరైజేషన్ అన్నమాట. ఇంక హీరోయిన్ పేరు అలకనంద కావటంతో ఆమెను అల అని పిలుస్తారని, ఆమె ఉండే ఇoట్లో జరిగే కథ ఇది కాబట్టి ఆ టైటిల్ పెట్టారని కూడా అనుకోవచ్చు.

ఇక ఈ సినిమా ఎప్పటిలాగే ఫన్, యాక్షన్ తో  నడువబోతోందని తెలుస్తోంది.  ఇందులో మిడిల్ క్లాస్ కుర్రాడుగా అల్లు అర్జున్ కనపడనున్నారు. విలన్ గా నవదీప్ విశ్వరూపం చూపించనున్నారు. అన్నా, చెల్లి సెంటిమెంట్ సైతం సినిమాలో హైలెట్ గా ఉందని చెప్తున్నారు.

అంతేకాదు ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టడం వెనక…త్రివిక్రమ్ కు కలిసి వచ్చిన అ సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన సినిమాలు అయిన అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అ…ఆ,అరవిందసమేత.. ఇదిగో ఇప్పుడు ‘అల వైకుంఠ పురములో’ .

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, నివేథా పేతురాజ్, జయరామ్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, రావు రమేష్, సునీల్, సుశాంత్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.