ఆవిరి మూవీ రివ్యూ

Published On: November 2, 2019   |   Posted By:

ఆవిరి మూవీ రివ్యూ

వై దిస్ కొలావరి? (‘ఆవిరి’ రివ్యూ)


Rating:1.5/5

తొలి నుంచీ తనకంటూ దర్శకుడుగా తనకంటూ ఓ ముద్ర వేసుకున్న రవిబాబు..సినిమాలంటే ఓ వర్గంలో మంచి క్రేజ్. చిన్న బడ్జెట్ తో సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్లతో కూడిన కథాంశాలతో ఆయన తెరకెక్కించే సినిమాలు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అయితే హాలీవుడ్ ఇన్ఫూలియెన్స్ విపరీతంగా ఉండే ఈయన సినిమాలు ఒక్కోసారి మహా అతిగా ఉంటాయి. ఇంగ్లీష్ బి లేదా సి గ్రేడ్ సినిమాలను తలపిస్తాయి. అనసూయ,అవును వంటి సినిమాలను తెరకెక్కించిన ఆయనే అవును 2, అదిగో సినిమాలు తీసారంటే నమ్మబుద్ది కాదు. అంత దారుణంగా ఉంటాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఆయన నుంచి వచ్చిన ఈ చిత్రం ఆయన హిట్ సినిమాల లిస్ట్ లో చేరిందా…ప్రేక్షకులను ఆకట్టుకుందా, అసలు ‘ఆవిరి’ రివ్యూ ఏంటో చూద్దాం.

స్టోరీ లైన్

రాజ్‌కుమార్‌ ‌రావు (రవిబాబు),   లీనా(నేహా చౌహాన్) మేడ్ ఫర్ ఈచ్ అదర్. వీళ్లిద్దరూ తమ హ్యాపీ లైఫ్ ని తమ కూతుర్లు శ్రేయ,మున్నిలతో  లీడ్ చేస్తూంటారు. అయితే దురదృష్టవశాత్తు  ఓ ప్రమాదంలో అస్తమాతో బాధపడే పెద్ద కూతురు శ్రేయ చనిపోతుంది.దాంతో ఆ ఇంట్లో ఉంటే శ్రేయనే గుర్తుకు వస్తుందని.. ఒక పాత పెద్ద బంగ్లాలోకి ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారు.అయితే కొత్త ఇంట్లో చిన్న కూతురు మున్ని(శ్రీముక్తా) విచిత్రంగా బిహేవ్ చేయటం మొదలెడుతుంది. తనతో ఆత్మ మాట్లాడుతుంది అన్నట్టుగా ప్రవర్తిస్తుంటుంది. అంతేకాదు ఆ ఆత్మ సాయంతో ఇల్లు వదిలిపోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూంటుంది. ఇంతకీ ఎవరిదా ఆత్మ అంటే ఆ పిల్ల అక్కదే. తన చెల్లిని సైతం ఆ ఇంట్లోంచి బయిటకు తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తూంటుంది. క‌ట్టుదిట్ట‌మైన భధ్రత క‌ల్పించినా ఇంట్లోంచి మాయ‌మైపోతుంది. అసలు మున్ని ఎక్కడికి వెళ్లింది.?అసలు మున్ని ఎందుకు ఇల్లు వదిలి వెళ్లిపోవాలనుకోవటానికి శ్రేయ ఆత్మ ఎందుకు  ప్రేరేపిస్తోంది ? చివరకు ఆత్మ విషయంలో రాజ్ కుమార్, లీనాలు ఏం చేశారు..? మున్ని తిరిగి వచ్చిందా లాంటి విషయాలు  తెలియాలంటే ‘ఆవిరి’ చూడాలి.  

బోర్ కే బోర్

అసలు రవిబాబుకే హారర్ సినిమాలంటే బోర్ కొట్టేసినట్లుంది. ఆ విషయం ఈ సినిమా చూస్తూంటే మనకు అర్దం అవుతుంది. ఎంత విసుగ్గా…విషయం  లేకుండా సీన్స్ నడుపుతున్నాడో చూస్తున్న కొలిదీ రవిబాబు మీదా, చూస్తున్న మన మీద మనకే జాలి వేస్తుంది. అసలు ఈ సినిమా తియ్యాలని ఎందుకనుకున్నారో అర్దం కాదు. ఎందుకంటే ఈ సినిమా చూస్తూంటే గతంలో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును 2 సినిమా గుర్తుకు వస్తుంది. దాన్నే కొద్ది పాటి మార్పులతో మళ్లీ తీసారనిపిస్తుంది.  రాజుగారి గది 3 వంటి సినమాల్లో దెయ్యాలు కష్టపడి నవ్విస్తే..ఇక్కడ బోర్ కొట్టిస్తూంటాయి. చాలా డల్ గా సినిమా సా….గు…తూంటుది. దానికి తోడు పిజ్జా పార్శిల్ ..హైడ్ అండ్ సీక్ గేమ్ లాగ ప్రవర్తించి డెలివరీ  బోయ్ ని భయపెట్టడం వంటివి ఎందుకో అర్దం కాదు. డ్రైవర్‌ లేని బైక్‌పై చిన్న పాప హ్యాండ్స్ ఫ్రీ రైడింగ్‌ చేస్తూ వెళ్లడం మనకి షాకింగ్ గా ఉంటుంది కానీ ఆ పిల్ల తల్లికి ఏమీ అనిపించదు. ఇలా ఎన్నో మహాధ్బుతాలు సినిమా నిండా పరుచుకుని మనని అపహాస్యం చేస్తూంటాయి.

టెక్నికల్ గా ..

సరైన స్క్రిప్టు రాసుకోకుండా తోచింది,తోచినట్లు తెరకెక్కించేసిన  రవిబాబు నుండి ఇలాంటి సినిమా తప్ప వేరేది ఆశించలేం. ‘ఆవిరి’లో పొరపాటున కొన్ని సీన్స్ బాగున్నాయి.  కెమెరామెన్ కెమెరా పనితనం హారర్ సన్నివేశాల్లో బాగుంది.  సంగీతం ఆకట్టుకోలేకపోయినా.. హారర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కొంచెం భయపెడుతుంది. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్  పేరు చూసి కంగారుపడతాం. ఆ తర్వాత ఆయన దర్శకుడు ఏది చెబితే అది కట్ చేసుకుంటూ వెళ్ళిన్నట్టు అర్దం చేసుకుంటాం. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే.

చూడచ్చా…

మన ఇంట్రస్ట్ ని ఆవిరి చేయటమే ఈ సినిమా టార్గెట్ అని తేలిపోయాక ఇంక చూడమని ఎలా చెప్తాం.   

ఎవరెవరు…

నటీనటులు: రవిబాబు, నేహా చౌహాన్‌, బేబీ శ్రీముక్త, భరణి శంకర్‌, ముక్తర్‌ ఖాన్‌ తదితరులు
కూర్పు: మార్తాండ్‌ కె వెంకటేష్‌
రచన, దర్శకత్వం, నిర్మాత: రవిబాబు
నిర్మాణ సంస్థ: ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌
సమర్పణ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌