ఉమామహేశ్వర ఉగ్రరూపస్య  మూవీ రివ్యూ

Published On: July 30, 2020   |   Posted By:

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య  మూవీ రివ్యూ

Rating:-2.5/5

ఈ మ‌ధ్య‌కాలంలో మంచి బ‌జ్ తెచ్చుకున్న చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ‘బాహుబలి’‌ నిర్మాతలు‌ శోభూ యార్లగడ్డ, ప్ర‌సాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్యదేవ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం వెంకటేష్‌ మహా తెర‌కెక్కించిన ఈ సినిమాకు మంచి క్రేజే క్రియేట్ అయ్యింది. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ రోజు రిలీజ్ ప్లాన్ చేయటంతో చాలా మంది ఆసక్తిగా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూసారు. ఒకటి రెండు వాయిదాలు పడినా …మొత్తానికి ఓటీటిలోనే రిలీజైంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా కథేంటి..టైటిల్ లో ఉన్న ఉమా మహేశ్వరరావు ఎవరు…ఈ మళయాళి రీమేక్ మన తెలుగు వాళ్లకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

ఉమా మహేశ్వర రావు(సత్యదేవ్) అరకు వ్యాలీలో “కోమలి ఫోటో స్టూడియో” ఓనర్. స్వతహాగా చాల మంచివాడు..పద్దతైన వాడు..తన పని తాను చూసుకుని వెళ్లిపోయే సాత్వికుడు. కానీ ఒకరోజు అనుకోకుండా తన తప్పు లేకపోయినా ఉమా మహేశ్వర రావు ప్రక్క ఊరి నుంచి వచ్చిన రౌడీ  జోగి చేతిలో దెబ్బలు తింటాడు. ఆ గొడవ తరువాత తనని కొట్టినవాడిని తిరిగి కొట్టేంత వరకూ చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆ కొట్టిన రౌడీ దుబాయి వెళ్లిపోతాడు. దాంతో అతను ఎప్పుడొస్తాడా పగ తీర్చుకుందామా అని ఎదురుచూడాల్సిన పరిస్దితి.

ఆ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి అతని జీవితం అనేక మార్పులకు లోనవుతుంది. మహేశ్వరరావు స్కూల్ డేస్ నుంచి ప్రేమించిన అమ్మాయి స్వాతి మరొక‌ర్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఈ లోగా మరో అమ్మాయి  జ్యోతి(రూపా కొడవయుర్) అతని జీవితంలోకి వస్తుంది. ఆమెకు ఆ రౌడీ జోగి కు సంభదం ఏమిటి. మహేష్ .. త‌న కోపాన్ని, ల‌క్ష్యాన్ని, శ‌ప‌థాన్నీ ఎలా తీర్చుకున్నాడు? దుబాయి వెళ్లిన ఆ రౌడీ తిరిగివచ్చాడా..లవ్ స్టోరీ చివరకు ఏ మలుపు తీసుకుంది. తన పగ తీర్చుకోవటం కోసం కోసం ఏం చేశాడు?  అన్న‌దే క‌థ‌.  ఆ విశేషాలు తెలియాలంటే “ఉమా మహేశ్వర – ఉగ్రరూపస్య” సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

C/O కంచెర పాలెం సినిమా తరువాత  దర్శకుడు వెంకటేష్ మహీ చేసిన సినిమా కావటంతో ఓ వర్గం ఈ సినిమాపై బాగానే ఆశలు పెట్టుకుంది. అయితే కేరాఫ్ కంచెర పాలెం నచ్చిన వారికి ఈ సినిమా నచ్చే అవకాసమే ఎక్కువుంది. మెల్లిమెల్లిగా ఈ దర్శకుడు తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకోగలుగుతున్నాడు. తన సినిమాలు కోసం ఎదురుచూసే పరిస్దితి తెచ్చుకోవటం అదీ రెండో సినిమాకీ ఓ దర్శకుడుగా అతను సాధించిన విజయమే అని చెప్పాలి.

సినిమా విషయానికి వస్తే…బటర్ ప్లై ఎఫెక్ట్ థీరి ఆధారంగా తయారై ,మళయాళంలో హిట్టైన మహేషింటే ప్రతీకారం రీమేకే ఈ సినిమా. వాస్తవానికి మన వాళ్లు సినిమాల్లో పగ, ప్రతీకారం అనగానే కాస్తంత ఎక్కువ ఎక్సపెక్ట్ చేస్తారు. అందులోనూ టైటిల్ ఉగ్ర రూపస్య అని పెడితే పోలీస్ స్టోరీ స్దాయిలో ఏదన్నా హీరో రెచ్చిపోతాడామో అనుకుంటారు. కానీ నిజానికి ఈ సినిమా ఇన్నర్ కాంప్లిక్ట్ కు సంభందించింది. కాబట్టి ఇందులో హీరో పాత్ర సంఘర్షణకు కమర్షియల్ సినిమాల్లో లాగ భయంకరమైన,  బలమైన కారణం ఏమీ ఉండదు. దాంతో చాలా సింపుల్ గా అనిపించే ఈ పాయింట్ ని ఎంతమంది ఏక్సెప్ట్ చేసి,కనెక్ట్ అవుతారో చూడాలి. అలాగే స్లో నేరేషన్ సైతం …దానికి అలవాటు పడని వాళ్లకు ఇబ్బందిని కలగ చేస్తుంది.

అలాగే ఈ సినిమాలో మరో చెప్పుకోదగ్గ విషయం…సహజంగా అనిపించే పాత్రలు, నేపథ్యం.  కేరాఫ్ కంచెర పాలెం సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా నిజజీవిత పాత్రలతోనే దర్శకుడు సినిమా చేసే ప్రయత్నం చేసారు.అయితే ఆ ప్లో ఫస్టాఫ్ దాకానే ఉంటుంది. సెకండాఫ్ కు వచ్చే సరికి రిపీట్ అవుతున్నట్లున్న సీన్స్, ఇంట్రస్టింగ్ కథనం లోపిస్తుంది. అసలు మహేశ్వరరావు …ఎప్పుడు పగ తీర్చుకుంటాడా అని మనం ఎదురుచూస్తూంటే.. సెకండాఫ్ లో రొమాన్స్ సీన్స్ వచ్చేస్తూంటాయి. దాంతో అసలు విషయం కోసం ఎదురూచూస్తూ కూర్చోవాలి. ఫైనల్ గా అసలు విషయం దగ్గరకు వస్తే క్లైమాక్స్ ..చాలా సింపుల్ గా తేల్చేస్తాడు. అది ఆ సినిమా కథ వరకూ ఓకే కానీ, చూసే వాళ్లకి ఇంకొంచెం ఏదో కావాలనిపించటంలో అయితే తప్పులేదు.

ఏదైమైనా రీమేక్ అంటే ఒరిజనల్ ని దించటమే కాదు..మించటం కూడా…

టెక్నికల్ గా..

ఈ సినిమాను బాహుబలి లాంటి సినిమా చేసిన ఆర్కా మీడియా సంస్థ నిర్మాతగా వ్యవహరించటంతో నిర్మాణ విలువలకు ఎక్కడా లోపం కనపడదు. అలాగే కెమెరా వర్క్ కూడా సినిమాకు మరింతగా సహజత్వాన్ని అద్దింది. పల్లెటూరు అందాలు ..చాలా రోజుల తర్వాత మనస్సుకు పట్టేస్తాయి. అరే పెద్ద తెరపై ఈ సినిమా చూసి ఉంటే బాగుండునే అనిపిస్తుంది. సంగీతం విషయానికి వస్తే జస్ట్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా శ్రద్ద పెట్టి చేసారు. స్క్రీన్ ప్లే సెకండఫ్ లో తడబడినా, డైలాగులు మాత్రం తెరపై శివ తాండవం చేసేసాయి.

ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ లో హీరో సత్యదేవ్ నటించాడు అనేకన్నా జీవించాడు అని చెప్పాలి.  మిగతా ఆర్టిస్ట్ లు సైతం తమ ప్రతిభ ప్రదర్శన చేసారు. సుహాస్ నటన ఈచిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్  విషయంలో ఇంకాస్త ట్రిమ్ చేస్తే కాస్త స్లోగా అనిపించటం తగ్గుతుంది కదా అనిపిస్తుంది.

చూడచ్చా…

మళయాళి ఒరిజనల్ చూడనివాళ్లకు ఈ సినిమా ఓ కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తుంది.

ఎవరెవరు

నటీనటులు: సత్యదేవ్, హరి చందన, రూప, నరేష్, సుహాస్, జబర్దస్త్ రాంప్రసాద్, టీఎన్నాఆర్, రవీంద్ర విజయ్ తదితరులు
రచన, దర్శకత్వం: వెంకటేష్ మహా
నిర్మాతలు: విజయ ప్రవీణ పరుచూరి, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
సినిమాటోగ్రఫి: అప్పు ప్రభాకర్
సంగీతం: బిజిబల్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సౌండ్ డిజైనింగ్: నాగార్జున తాళ్లపల్లి
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్
రన్ టైమ్: 2hr 16mins
రిలీజ్ డేట్: 2020-07-30