ఏక్ మినీ కథ మూవీ రివ్యూ

Published On: May 27, 2021   |   Posted By:

ఏక్ మినీ కథ మూవీ రివ్యూ

Rating:2.5/5

ఆ మధ్యన సైజ్ జీరో అనే సినిమా వచ్చింది. సైజ్ సమస్య అయ్యిపోతే దాన్నుంచి బయిటపడే ప్రయత్నంలో ఫేక్ ప్రాక్టీషర్స్ బారినపడటం కథాంశం. ఇప్పుడు మరో సైజ్ సమస్యగా ఈ సినిమా వచ్చింది. పాయింట్ గా ఇదీ యూత్ కు కనెక్ట్ అయ్యేదే. అందుకేనేమో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే బ్యానర్ వాల్యూ కూడా సినిమాపై అంచనాలు పరగటానికి కారణం అయ్యింది. అంతేకాదు ఈ కథా రచయిత ..మేర్లపాక గాంధీ కూడా ..సక్సెస్ ఫుల్ డైరక్టర్ అవటం ఓ వర్గాన్ని ఎట్రాక్ట్ చేసింది. మరి సినిమా ఈ రకంగా పెరిగిన అంచనాలను ఏ మేరకు రీచ్ అయ్యింది. సినిమాలో అసలుకథేంటి,బూతు సినిమానా లేక మామూలు సినిమానా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
స్టోరీ లైన్

సివిల్‌ ఇంజనీర్‌ సంతోష్‌(సంతోష్‌ శోభన్‌) కి జీవితంలో అన్నీ ఉన్నా ఆనందం లేదు. ఎందుకంటే తన పురుషాంగం చిన్నది,రేపు పెళ్లి చేసుకుంటే ఏమిటి అనే ఆలోచన అతన్ని తినేస్తూంటుంది. దాంతో ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ …సైజ్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూంటాడు. ఓ టైమ్ లో సైజ్ పెంచుకునేందుకు ఆపరేషన్ చేయించుకోవాలని కూడా ఫిక్స్ అవుతాడు. కానీ వర్కవుట్ కాదు. ఈ లోగా అతని జీవితంలోకి అమృత(కావ్య థాప‌ర్‌) వస్తుంది. ఆమెతో వివాహం జరుగుతుంది. ఇప్పుడు ఆ సమస్య మరింతగా పెరిగిపోతుంది. శోభనం రోజు తన సైజు గుట్టు బయిటపడుతుందేమో అని వాయిదా వేయటం మొదలెడతాడు. అలాగే సైజ్ పెంచుకునేందుకు ఓ స్వామిజీ (శ్రద్ధాదాస్‌)ని ఆశ్రయిస్తాడు. అప్పుడు ఏమైంది. స్వామిజీ ఏం సలహా ఇచ్చింది. సంతోష్ సైజ్ పెరిగిందా..అతని సమస్య తీరింగా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
ఎనాలసిస్

కొన్ని కథలు ఖచ్చితంగా చెప్పాల్సిందే. అయితే ఆ కథలు చెప్పటానికి ధైర్యం కావాలి..తెగింపు కావాలి. అటువంటి కథే ఈ మినీ కథ. స్టోరీ లైన్ వినగానే చాలా మందికి ఆ ముగిసిన అధ్యాయం గుర్తుకు రావచ్చు లేదా నడుస్తున్న  జీవితం కావచ్చు. అంతవరకూ రైటర్, డైరక్టర్ సక్సెస్ సాధించారు. కాకపోతే సినిమా ట్రీట్మెంట్ విషయంలోనే దారి తప్పారు. ఫస్టాఫ్ లో సినిమాని చాలా ఇంట్రస్టింగ్ గా నడిపి,సెకండాఫ్ కు వచ్చేసరికి అసలు పాయింట్ కన్నా కొసరు డిస్కషన్ ఎక్కువ చేసారు. ముఖ్యంగా కథలో సమస్య వాస్తవంగా ఉన్నప్పుడు దానికి చూపించే పరిష్కారాలు కూడా అలాగే ఉండాలనే విషయం మర్చిపోయారు. దాంతో శ్రద్దాదాస్ క్యారక్టర్ వచ్చి చేరింది. ఆమె కథకు గ్లామర్ ని అద్దింది,ప్రీ క్లైమాక్స్ లో ఓ కీలకమైన మలుపుకు కారణమై ఉండచ్చు కానీ, అవి రెండు కథ గమనాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. ఎప్పుడు శ్రద్దాదాస్ పాత్ర ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే కథ డ్రాప్ అవ్వటం మొదలైంది. అలాగే హీరో క్యారక్టరైజేషన్ ..పూర్తి ఆత్మనూన్యతా భావంగా ఉండే సాధారణ వ్యక్తిలా తీర్చిదిద్దారు కానీ అతను ఎక్కడా కూడా సైంటిఫిక్ ఎప్రోచ్ కు ప్రయత్నించినట్లు కనపడదు. ఈ కథను సమరం గారు ఇచ్చిన సమాధానాలు ఆధారంగా చేసారు అని చెప్పారు. కానీ అదే డాక్టర్ సమరాన్నో,మరో డాక్టర్ నో ఈ కుర్రాడు ఎందుకు ఎప్రోచ్ కాలేకపోయారో అర్దంకాదు. సమస్య మీదే పెట్టిన దృష్టిని రచయిత కథగా మలిచేటప్పుడు వచ్చే సమస్యలపై పెట్టలేకపోవటమే పెద్ద సమస్యగా మారింది. అలాగే ఎమోషనల్ కనెక్టివిటీ సినిమాలో లేదు. ఇక గతంలో  స్నేహ భర్త ప్రసన్నహీరోగా నటించి దర్శకత్వం కూడా వహించిన “కళ్యాణ సమయల్ సాధమ్” కూడా ఇదే తరహా కథతో తెరకెక్కింది. అయితే.. అది అంగ స్కలనం గురించి.

నటీనటులు

సంతోష్ ఈ సినిమాతో తనలో మెచ్యూరిటీ ఉన్న నటుడి ఉన్నాడనిపించుకున్నాడు. ఎక్సప్రెషన్స్, డైలాగ్ డెలివరీలో సంతోష్ చాలా మెచ్యూరిటీ ప్రదర్శించాడు. అయితే కొన్ని సార్లు నాని గుర్తు వస్తున్నాడు.  కావ్య థాపర్ కు సినిమాలో చెప్పుకోదగ్గ సీన్ లేదు.  ఆమె డబ్బింగ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరిలకు  లెంగ్తీ రోల్స్ కానీ సోసోగా ఉన్నాయి.ఉన్నంతలో సుదర్శన్ బాగా నవ్వించారు. హర్షవర్ధన్ క్యారెక్టర్ కేవలం కథను నేరేట్ చేయటానికి టూల్ గా వాడుకున్నారు. శ్ర‌ద్ధాదాస్ క్యారక్టర్ అసలు వర్కవుట్ కాలేదు.

టెక్నికల్ గా ..

సినిమాలో  వన్ లైనర్స్, పంచ్ డైలాగ్స్ ఫన్నీగా బాగున్నాయి. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వినడానికి ఫ్రెష్ గా ఉంది. సినిమాటోగ్రాఫర్  మంచి స్టాండర్డ్స్ లో ఉంది.  రవీందర్ ఆర్ట్ వర్క్, సత్య జి ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ …హౌజ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి

చూడచ్చా..

కుర్రాళ్లకు కనెక్ట్ అయ్యే పాయింట్..బోర్ కొట్టినా భరించవచ్చు

ఎవరెవరు..

బ్యానర్: యూవీ కాన్సెప్ట్స్
నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు..
కథ: మేర్లపాక గాంధీ
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటర్: సత్య
దర్శకుడు: కార్తీక్ రాపోలు
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
రన్ టైమ్:2 గంటల 14 నిమిషాలు
ఓటీటి: అమెజాన్ ప్రైమ్
విడుదల తేదీ :మే 27, 2021