‘ఐరా’ సినిమా రివ్యూ

Published On: March 28, 2019   |   Posted By:

మళ్లీ దెయ్యం కథేరా… (‘ఐరా’ సినిమా రివ్యూ)

 Rating: 2.5/5

యూట్యూబ్ లో దెయ్యం నిజమైన వేళ

యూట్యూబ్ ఛానెల్  పెట్టి క్లిక్ అయితే డబ్బుకు డబ్బు, పేరు కు పేరు. ఇది ఈ నాటి యూత్ ఆలోచన. సేమ్ ఇలాంటి ఆలోచనే చేస్తుంది మీడియాలో పనిచేస్తున్న య‌మున(న‌య‌న‌తార‌). కానీ అందుకు ఫర్మిషన్ ఇవ్వడు ఆమె బాస్.  ఏం చేయాలి అనుకుంటండగా… ఆమెకు ఇంట్లో ఓ సమస్య ఎదురువుతుంది. తన ఇంట్లో వాళ్లు ఓ కుర్రాడిని చూపించి పెళ్ళి చేసుకోమని పోరుతూంటారు. దాంతో  ఇష్టం లేని పెళ్లి, ఇష్టం లేని ఉద్యోగం వదిలేసి తన నాయనమ్మ  పార్వ‌త‌మ్మ  (కులప్పుల్లి లీలా)  ఉండే పల్లెటూరు వ‌చ్చేస్తుంది. 

ఆ ఇల్లు ఓ పాతకాలంది. అక్కడికి వచ్చాక ఆమెకు వింత సమస్యలు ఎదురౌతాయి. ఆ ఇంట్లో రాత్రిళ్లు ఎవరో  తనను వెంబడిస్తున్నట్లు అనిపిస్తూంటుంది. అయితే చదువుకున్న పిల్ల కావటంతో అదంతా తన భ్రమ అని, తనలో భయానికి అది రూపం అని  లాజిక్  తో  లైట్ తీసుకుంటుంది.  కానీ మనస్సుపై  ముద్ర వేసిన ఆ సంఘటన ప్రేరణతో ఆమెకు  యూట్యూబ్ ఛానెల్ కు పనికొచ్చే ఓ ఐడియా వస్తుంది. దాంతో ఓ ఛానెల్ పెట్టి… తను  ఉంటున్న ఇంట్లో దెయ్యం ఉందని నమ్మిస్తూ ఫేక్ వీడియోలు చేసి  యూట్యూబ్ లో అప్ లోడ్ చెయ్యడం మొదలు పెడుతుంది. అవి సూపర్ గా క్లిక్ అవుతాయి. ఫుల్ ఖుషీ అవుతుంది యమున. అయితే ఈ ఆనందం ఎంతో సేపు ఉండదు. ఆ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉంది. అది ఓ రోజు  యమున నానమ్మ పై దాడి చేస్తుంది. అది కళ్ళారా చూసిన యమున స్పృహ తప్పుతుంది. దాంతో హాస్పటిల్ లో జాయిన్ చేస్తారు. అక్కడ కూడా ఆమెను ఆ దెయ్యం వదలదు. నానమ్మను చంపేస్తుంది. దాంతో యమునకు ఆ భయం రెట్టింపు అవుతుంది. తనను కూడా ఎవరో చంపటానికి ప్రయత్నిస్తున్నారని క్లారిటి వస్తుంది.

ఇదిలా ఉంటే  వేరొక చోట వరస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలన్ని అభినవ్ (క‌లైర‌స‌న్‌) అనే వ్యక్తితో లింక్ అప్ అయిన వ్యక్తులతో నిండి ఉంటాయి. అతను ఎవ‌రి కోస‌మో వెతుకుతూ ఉంటాడు. అత‌ను వెతుకుతూ, కలిసిన వాళ్లంద‌రూ ఆత్మహ‌త్య చేసుకుంటూ ఉంటారు.  ఆ తర్వాత అభినవ్ రియలైజ్ అవుతాడు. ఈ హత్యలకు కారణం తన ప్రియురాలు భవాని అని.  

మరో ప్రక్క యమున వెనక పడుతూ చంపటానికి ప్రయత్నిస్తోంది  కూడా భవాని (నయనతార డబుల్ ) అని తెలుస్తుంది. ఇంతకీ ఈ భవాని ఎవరు ? ఆమె ప్లాష్ బ్యాక్ ఏమిటి ?  యమునని భవాని ఎందుకు చంపాలనుకుంటోంది ? చివరికి భవాని ,యమున ను ఏంచేసింది ? అభిన‌వ్‌కి, యమున‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి?  అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

విశ్లేషణ…

దెయ్యం కథని రెగ్యులర్ కథగా చెప్తే కిక్ ఏముంటుంది అనుకున్నాడో ఏమో ఈ దర్శకుడు ఈ సినిమాకు బటర్ ఫ్లై ఎఫెక్ట్ థీరిని ముడిపెట్టాడు.  తనకు తెలిసో తెలియకో తను చేసే ఓ పని… వేరొకరి జీవితంపై ప్రభావం చూపెడుతుందని చెప్తూ అది మంచికి జరగచ్చు లేదా ప్రమాదానికి దారి తీయవచ్చు అంటూ ఈ దర్శకుడు ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేసాడు. అయితే ఈ బటర్ ఫ్లై ఎఫెక్ట్ గురించి సరైన అవగాహన లేకుండా చూస్తే కొంచెం కన్ఫూజన్ గానే ఈ కథ, కథనం అనిపిస్తుంది. ఏంటి విచిత్రమైన లింక్ అని కథ అర్దరహితంగా అనిపిస్తుంది. మరో ప్రక్క యమున క్యారక్టర్ తో  సినిమాని మొదలెట్టి సెకండాఫ్ ని భవాని పాత్రతో నింపేసారు. ఇద్దరూ నయనతారలేగా అని దర్శకుడు అనుకుని ఉండవచ్చు కానీ ప్రధాన పాత్ర యమననే ప్రేక్షకుడు ఫాలో అవుతాడు. ఆమె ఎమోషన్స్ , భయాలనే ప్రేక్షకుడు పట్టించుకుంటాడు. ఈ విషయం మర్చిపోయి భవాని పాత్రను హైలెట్ చేసి, యమున ను వదిలేసాడు. దాంతో ప్రధాన పాత్ర లేకుండా ఉపకథతో నడిచే సినిమాలా మారిపోయింది. ప్లాష్ బ్యాక్ ని కాస్త తగ్గించి యమున పాత్రను హైలెట్ చేసి ఉంటే సినిమా వర్కవుట్ అయ్యేదనిపిస్తుంది. 

ఫస్టాఫ్ ఫస్ట్ క్లాస్… సెకండాప్ ఫసక్

ఈ సినిమా ఫస్టాఫ్ సస్పెన్స్ , ఫన్ తో ముందుకు వెళ్లటంతో ఇంటర్వెల్ వరకూ చక్కని టెంపో మెయింటైన్ అయ్యింది. సెకండాఫ్ కు వచ్చేసరికి అది పడిపోవటం మొదలైంది. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యిందో బోర్ కొట్టడం మొదలవుతుంది. దానికి తగ్గట్లు ఎక్కువ తమిళులను అలరించే ఎలిమెంట్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు.  బాడీ షేమింగ్ వంటి అంశాలు నిజ జీవితంలో ఇబ్బందికరమైనవే కావచ్చు కానీ అదే పాయింట్ తో ఓ గంటసేపు డ్రామా చూడాలంటే ఇబ్బందే. దానికి తోడు సెకండాప్ లో వచ్చే  క‌లైర‌స‌న్‌, న‌య‌న‌తార ల‌వ్ ట్రాక్ భరించటం కష్టం అనిపిస్తుంది. 

డైరక్టర్ ఎలా డీల్ చేసారంటే…

డైరెక్ట‌ర్ స‌ర్జున్ కె.ఎం. ఎత్తుకున్న పాయింట్ మంచిదే. దానికి రాసుకున్న స్క్రీన్ ప్లే నే బోర్ కొట్టించింది. దానికి తోడు స్లో నేరేషన్ నీరసపరిచింది. నయనతారను గ్లామర్ గా ఓ పాత్రను, డీ గ్లామర్ గా మరో పాత్రను చూపాలనే తాపత్రయమే తప్ప వాటికి సరైన రీజనింగ్ లు ఇవ్వాలని ఆలోచించలేకపోయాడు. క్లైమాక్స్ అయితే పూర్ రైటింగ్ కు పరాకాష్టలా ఉంది.

టెక్నికల్ గా…

ఈ సినిమాకు సుద‌ర్శ‌న్ శ్రీనివాసన్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది.  విలేజ్ ఎట్మాస్మియర్ ని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. సుంద‌ర‌మూర్తి బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. న‌య‌న‌తార  కష్టపడి చేసింది కానీ కొత్తగా చేయటానికి ఏమీ లేకుండా పోయింది.  అలాగే కార్తీక్ జోగేష్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. లో బడ్జెట్ లో తీసిన ఈ సినిమా ఈ స్దాయి క్వాలిటీ వచ్చిందంటే నిర్మాతలు, దర్శకుడు ఎంత కష్టంపడ్డారో అనిపిస్తుంది.   

చూడచ్చా?

నయనతార అభిమానుల కన్నా హారర్ అభిమానులకు ఈ సినిమా  బాగానచ్చుతుంది. అద్బుతం అని చెప్పలేం కానీ అలా ఓ సారి చూసేయచ్చు. 

ఆఖరి మాట…

దెయ్యాల సినిమాలు ఇలా కంటిన్యూగా వస్తే దెయ్యాలే ధియోటర్స్ లో కూర్చుని చూడాల్సి ఉంటుంది. అంతకు మించిన ఆప్షన్ ఉండదు. 

తెర వెనక…ముందు

బ్యానర్: గంగా ఎంటర్ టైన్స్ మెంట్స్, కేజీఆర్ స్టూడియోస్ 

నటీనటులు: నయనతార, కళైయ‌ర‌సి,  యోగిబాబు, మ‌నోబాలా, ఎం.ఎస్‌.భాస్క‌ర్‌, వంశీకృష్ణ‌, ప్ర‌వీణ్ రంగ‌నాథ‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, లీలావ‌తి, కృష్ణ అభిషేక్‌, ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు
కెమెరా:  సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌,
ఎడిటింగ్:  కార్తిక్ జోగేష్‌,
స్క్రీన్‌ప్లే:  ప్రియాంక ర‌వీంద్ర‌న్‌
సంగీతం:  సుంద‌రమూర్తి. కె.ఎస్‌. 
నిర్మాత: కోటపాటి రాజేష్ 
కథ,  దర్శకత్వం:  సర్జన్ కె.ఎమ్