కోమాలి మూవీ రివ్యూ

Published On: December 4, 2020   |   Posted By:

కోమాలి మూవీ రివ్యూ

చూడచ్చు ఓ పాలి:  ‘కోమాలి’ రివ్యూ

Rating: 2.5/5

ఏదైనా భాష నుంచి ఏదైనా సినిమా డబ్బింగ్ అయ్యి మన ముందుకు వస్తోందంటే అది కొద్దో గొప్పదని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఫ్లాఫ్ సినిమాలు డబ్ ఎందుకు చేస్తారనేది మన లాజిక్. అయితే ఫ్లాఫ్ సినిమాలే కాదు యావరేజ్,బిలో యావరేజ్ లు కూడా ఓ పది పైసలో పావలోనో చేసుకుందామని డబ్బింగ్ అయ్యి మన ముందు దూకుతూంటాయి. అప్పుడు వాటి నుంచి విభిన్నత, కొత్తదనం వంటివి ఎదురుచూడకుండా చూపెట్టింది చూడాలి. అయినా ఓటీటిలో వచ్చే సినిమాలే కష్టంగా ఉన్నాయి చూడటానికి, ఇంక డబ్బింగ్ సినిమాలంటారా అని నోరు చప్పరిస్తే ఏం చేస్తాం. తమిళంలో బాగానే ఆడిన కోమాలి అనే సినిమా అదే టైటిల్ తో తెలుగులోనూ వచ్చింది. కాజల్ మనకు బాగా తెలుసున్న ఫేస్ కాబట్టి ఆమెను హైలెట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విషయం ఏమిటి..కోమాలి కథేంటి..మనోళ్లకు నచ్చే మసాలాలు ఉన్న సినిమాయోనా వంటి విషయాలు చూద్దాం పదండి.

స్టోరీ లైన్

పిల్లాడుగా ఉన్నప్పుడు రవి(జయం రవి) చాలా పద్దతిగా పెరుగుతాడు. కాలేజీకు వెళ్లాక కాస్తంత పద్దతలు ప్రక్కన పెట్టి తన క్లాస్ మేట్ నిఖిత (సంయుక్త హెగ్డే) ప్రేమలో పడతాడు. అయితే కరెక్ట్ గా లవ్ మ్యాటర్ ఆమె దగ్గర ఎక్సప్రెస్ చేద్దామనుకునే సరికి ఖర్మం బాగోక…ఓ రౌడి ఓ మర్డర్ చేసి పారిపోతూ అక్కడకు వచ్చి, ఆమెను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామనుకుంటాడు. ఆమెను సేవ్ చేద్దామని రవి..వెళ్లి ఆ గొడవలో తలకు బలంగా దెబ్బ తగిలించుకుంటాడు. దాంతో కోమాలోకి పోతాడు. అలా కోమాలోకి వెళ్లిన రవి ..ఓ పదహారేళ్లకు మళ్లి మన ప్రపంచంలోకి వస్తాడు. అయితే అతని బుర్ర పదహేరేళ్ల క్రితమే ఆగింది. అక్కడనుంచి అప్ డేట్ అవ్వలేదు. కానీ ప్రపంచం చాలా వెర్షన్స్ మార్చేసి ముందుకు వెళ్లిపోయింది. వాటిని అందుకోవటానికి, లేటెస్ట్ ప్రపంచం ఉన్న వెర్షన్ కు అప్ డేట్ అవటానికి నానా కష్టాలు పడతాడు.

మరో ప్రక్క ఇతనికో బావ,కమ్ క్లోజ్ ప్రెండ్ మణి(యోగిబాబు). వీడు కోమాలోంచి బయిటకు వచ్చినప్పుడు డాక్టర్ మణిని పిలిచి ఓ మాట చెప్తాడు. బాబూ…మీ వాడు ఈ పదహారేళ్లలో ఏమి మిస్సయ్యాడో వాటిని అందుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. మీరు అతనికి సాయం చేయండి. లేకుండా అతను డిప్రెషన్ లోకి వెళ్లిపోయి..ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడు అని హెచ్చరిస్తాడు. దాంతో మణి తన బావ అయిన రవిని వెంటనేసుకుని అతని కోరిక తీర్చాలని బయిలుదేరతాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. కాజల్ తో రవికు ఎక్కడ పరిచయం అయ్యింది. కోమాలోకి వెళ్లేముందు ప్రేమించిన అమ్మాయి నిఖిత ఇప్పుడేం చేస్తోంది. మధ్యలో ఎమ్మల్యే (కెఎస్ రవికుమార్) యాంగిల్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథా,కథన విశ్లేషణ

కామెడీతో కథను డీల్ చేసారు కాబట్టి మెడికల్ డిటేల్స్ లోకి ఎక్కువగా వెళ్లలేదు. స్ట్రెయిట్ నేరేషన్ లో సాగిన ఈ సినిమాలో ప్లాట్ పాయింట్స్ బలంగా ఉండవు. చాలా మైనర్ గా ఉండే క్యారక్టర్స్ ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఫస్టాఫ్  హీరో కోమా లోకి వెళ్లి రావటం.అతను పదిహారేళ్ల తర్వాత ప్రపంచాన్ని చూసే కోణం వంటివి ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. అయితే సెంకడాఫ్ కు వచ్చేసరికి కథలో ఆ ప్రెషనెస్ పోయింది. రవి తను ఫైనాన్సియల్ గా నిలబడటానికి చేసే ప్రయత్నాలతో కాసేపు నడుస్తుంది. సెక్యూరిటి గార్డ్ గా చేయటం, యూట్యూబ్ ఛానెల్ నడపటం వంటివి కథలో ఇమడలేదు. ఇక ఆ తర్వాత రవికు లోకల్ పొలిటీషన్ ధర్మరాజు (కెఎస్ రవికుమార్)తో గొడవ రావటం, తను కోమాలోకి వెళ్లటానికి అతనే కారణం అని తెలియటం వంటివి జరుగుతాయి. అయితే పారలల్ గా జరిగే ఈ సబ్ ప్లాట్ అంత ఇంట్రస్టింగ్ గా డీల్ చేయలేదు. అయితే ఇక్కడ మనం కనెక్ట్ అవటానికి డైరక్టర్ కొంత అవకాసం ఇస్తాడు. సెల్ఫీలు లేని  ఆరోజులను మన రవి గతం తో గుర్తు చేస్తాడు. నైంటీస్ ప్లాష్ బ్యాక్ ఓ విజువల్ కామెడీగా నవ్విస్తుంది. అలాగే హీరో క్యారక్టర్ పాసివ్ గా ఉండటం కూడా కథపై ఆసక్తిని తగ్గించేస్తుంది. యోగిబాబు పాత్ర ఉన్నంత యాక్టివ్ గా కూడా హీరో పాత్ర ఉండదు.

నటీనటులు, దర్శకత్వం

దర్శకుడు మంచి విజువల్ సెన్స్ ఉన్నవాడే. అయితే అతనికి తనే రాసుకున్న స్క్రిప్టు సహకరించలేదు. స్క్రిప్టుపై మరికాస్త కుస్తీ పడితే సినిమా అవుట్ పుట్ వేరే విధంగా ఉండేది. పాయింట్ మాత్రమే కొత్తగా ఉంది. మిగతావన్నీ రొటీన్ గా అనిపించాయి. దానికి తోడు ప్రెడిక్టబులిటీ కూడా సినిమాపై ఆసక్తిని చంపేసింది. ఇక నటీనటుల్లో జయం రవి పాత్ర చాలా ఎంగేజింగ్ గా ఉంది. టీనేజర్ గా,నడివయస్సు వ్యక్తిగా వేరియోషన్స్ చక్కగా చూపించారు. యోగిబాబు లేకపోతే ఈ సినిమా లేదు అన్నంతగా చేసాడు. కమిడియన్ గా మాత్రమే కాకుండా ఈ సినిమాలో అతను క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ చేసాడు. సీరియస్ సీన్స్ లో కూడా చక్కటి ఫెరఫార్మన్స్ ఇచ్చాడు. కాజల్ అగర్వాల్ కు ఈ సినిమాలో చెప్పుకునేటంత తసీన్  లేదు. జయం రవి, యోగిబాబు కలిసి స్క్రీన్ ని పంచేసుకున్నారు. కామెడీ వన్ లైనర్స్ బాగా పేలాయి. కీ రోల్ లో కనిపించిన సంయుక్త హెడ్గే కూడా నీటైన ప్రెజన్స్ ఇచ్చింది.
 
టెక్నికల్ గా..

హిప్ హాప్ ఆది ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ కాస్తంత లౌడ్ గా ఉన్నట్లనిపించినా సినిమాకు యూత్ లుక్ ఇచ్చింది. పైసా సాంగ్ గ్రాండ్ విజువల్స్ తో బాగుంది. ఈ సినిమాకు గుడ్ విజువల్స్ , మ్యూజిక్, మంచి క్లైమాక్స్  ప్లస్ అయ్యాయి. ఫ్యామిలీలు, పిల్లలతో సహా చూడాలన్న కోరికతో చేసిన కొన్ని సీన్స్ పెద్దలకు కాస్తంత ఇబ్బంది పెడతాయి. చైల్డిష్ గా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ లో చెన్నై వరదలను వాడుకున్న తీరు బాగుంది. ప్రీ క్లైమాక్స్ లో జయం రవి ఎమోషన్ సీన్స్ చాలా మందికి నచ్చుతాయి.
 
చూడచ్చా..

తీసి పారేయదగ్గ సినిమాకాదు. వీకెండ్ కు ఓ చక్కటి కాలక్షేపం
 
తెర ముందు..వెనక

నటీనటులు: ‘జయం’ రవి, కాజల్ అగర్వాల్, సంయుక్తా హెగ్డే, యోగిబాబు, కె.ఎస్. రవికుమార్ తదితరులు.
సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటింగ్ : ప్రదీప్ ఈ. రాగవ్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్
సంగీతం: ‘హిప్ హాప్’ తమిజ్
నిర్మాత : ఇషారి కె.గణేష్
విడుదల తేదీ: 04,డిసెంబర్ 2020
రన్నింగ్ టైమ్: 141 నిముషాలు
స్ట్రీమింగ్ ఓటీటి: ‘జీ 5’