జయసుధకు అభినయ మయూరి ఆవార్డు

Published On: September 4, 2019   |   Posted By:
జయసుధకు అభినయ మయూరి ఆవార్డు
 
 
మహానటి’ ఏ ఒక్కరో కాదు.. అందరూ మహానటిలే: జయసుధ

ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారనీ, వారిలో ఒకరు మోహన్‌బాబు అయితే, మరొకరు మురళీమోహన్ అనీ సహజనటిగా పేరుపొందిన జయసుధ వ్యాఖ్యానించారు. అంతే కాదు.. మనం ‘మహానటి’ అనే మాటను ఒకరికే ఉపయోగిస్తుంటామనీ, కానీ అందరూ మహానటిలేననీ ఆమె అన్నారు.

జయసుధకు ‘అభినయ మయూరి’ అనే ఆవార్డును ఇవ్వనున్నట్లు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ఆ అవార్డును ప్రదానం చేయనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో జయసుధ మాట్లాడారు. 

“ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒకరు మోహన్‌బాబు గారైతే, మరొకరు మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారితో హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో నటించాను. వాటిలో ఎన్నో సక్సెస్ అయ్యాయి. మహానటి అంటే మనం ఒక్కరే అనుకుంటాం. అందరూ మహానటిలే. మహనటి అయితే తప్ప ఇండస్ట్రీలో సస్టైన్ అవలేం. జమున గారి నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నా. ఆమెకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయి. వాటిని శాక్రిఫైస్ చెయ్యకుండా సక్సెసయ్యారు. మురళీమోహన్ గారు ఎవర్‌గ్రీన్ హీరో. ఆయన (జుట్టుకి) కలర్ వేసుకున్నా, వేసుకోకపోయినా యువకుడిలాగే కనిపిస్తారు. మా ఇంట్లో జీన్స్ ప్రకారం నా జుట్టు ఊడిపోతోంది. అవార్డులు రాకపోయినా ఫర్వాలేదని అంటుంటాం కానీ, అవార్డులు వస్తే మనసులో సంతోషంగా అనిపిస్తుంది. అవార్డు అనేది మనం చేసిన పనికి గుర్తింపు. కొన్ని అవార్డులు  ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఉదాహరణకు నంది అవార్డులు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టేశాయి. తమిళనాడు ప్రభుత్వం సినిమా ప్రముఖులకు కలైమామణి అవార్డు ఇస్తూ వస్తోంది. వాళ్లు దాన్ని బాగా చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాటిని ఏ పేరుతో ఇస్తారో.. ఇవ్వాలి. వాళ్లే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? మేం చాలా కార్యక్రమాలకు వస్తుంటాం. సోషల్ వర్క్‌కు రావాలంటే వస్తాం. అలాంటి మమ్మల్ని గుర్తించి అవార్డులిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానివల్ల నవ తరానికి కూడా అవార్డు విలువ తెలుస్తుంది. ఎవరిచ్చినా, ఇవ్వకపోయినా సుబ్బరామిరెడ్డి గారు ఆయన బర్త్‌డేకి అవార్డులు ఇస్తుంటారు. 20 ఏళ్ల నుంచీ నిర్విరామంగా ఆయన అవార్డులు ఇస్తుండటం చాలా గొప్ప విషయం” అని ఆమె అన్నారు.

అంతకు ముందు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ “ఇరవై ఏళ్ల నుంచీ సెప్టెంబర్ 16, 17 తేదీల్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. సినీ రంగానికి చెందిన ఎంతోమంది గొప్పవాళ్లకు అవార్డులు ఇస్తూ వస్తున్నా. ఇప్పుడు జయసుధకు ‘అభినయ మయూరి’ అనే అవార్డును ఇవ్వబోతున్నా. ఆమె అద్భుత నటి. మనం గర్వించే నటి. ఆమెది 46 ఏళ్ల కెరీర్. సెప్టెంబర్ 17న విశాఖపట్నంలోని కళావాహిని ఆడిటోరియంలో ఆమెకు అవార్డును ప్రదానం చేస్తాం. దానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వస్తున్నారు. కొంతమంది సినిమా కళను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. కానీ ఎన్నో శాఖల్ని ఇముడ్చుకున్న సినిమా దేవుని సృష్టిలో చాలా గొప్ప కళ. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటులు ఏ అవార్డు ప్రకటించినా వచ్చి తీసుకునేవాళ్లు. ఇప్పటి హీరోలు వాళ్లను ఫాలో కావడం లేదు” అన్నారు.

సీనియర్ నటుడు మురళీమొహన్ మాట్లాడుతూ “జయసుధ అదివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ‘జ్యోతి’ సినిమా మరో ఎత్తు. ఆ సినిమాతో ఆమె నటిగా విపరీతమైన పేరు తెచ్చుకుంది. ఇద్దరం చాలా సినిమాల్లో కలిసి నటించాం. తను స్నేహానికి చాలా విలువిచ్చే నటి. సుబ్బరామిరెడ్డిగారు ఆమెకు ‘అభినయ మయూరి’ అనే అవార్డుతో సత్కరించనుండటం ఆనందంగా ఉంది. ఏదో ఒకరోజు నాకు కూడా ఆయన ఏదో ఒక అవార్డును ఇస్తారని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా అవార్డుల్ని పట్టించుకోవట్లేదు. నంది అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకుంటారు. దయచేసి ఇప్పటి ప్రభుత్వం ఆ అవార్డుల్ని ఇవ్వాల్ని కోరుతున్నా. నాలుగేళ్ల నుంచీ ఆ అవార్డులు పెండింగులో ఉన్నాయి” అని చెప్పారు.

ఒకప్పటి అందాల నటి జమున మాట్లాడుతూ “జయసుధ ‘పండంటి కాపురం’లో నా కూతురిగా నటించింది. చాలా చక్కని నటి. ఆమెకు సుబ్బరామిరెడ్డిగారు అవార్డు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆమె మాతో సమానమైన మహానటి అని చెప్పొచ్చు. గొప్ప గొప్ప పాత్రలు చేసింది. కళల పట్ల, సినీ రంగం పట్ల సుబ్బరామిరెడ్డి గారికున్న అభిమానం చాలా గొప్పది. విశాఖపట్నంలో ఆయన చేసే సేవా కార్యక్రమాలు అపూర్వం” అన్నారు.