డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి మీడియా సమావేశం

Published On: March 26, 2021   |   Posted By:

డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి మీడియా సమావేశం

న‌న్ను మించి ‘రంగ్ దే’ క‌థ‌ను నితిన్‌, కీర్తి సురేష్ ఎక్కువ‌గా న‌మ్మారు
– డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి

* నితిన్‌ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేయ‌డంతో న‌మ్మ‌లేక‌పోయాను
* పీసీ శ్రీ‌రామ్ గారు క‌థ విన‌గానే చేయ‌డానికి ఒప్పుకోవ‌డం నాకు షాక్

‘తొలిప్రేమ’‌, ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ చిత్రాల త‌ర్వాత వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూడో చిత్రం ‘రంగ్ దే’. నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. మార్చి 26న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా గురువారం మీడియా ప్ర‌తినిధుల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ‘రంగ్ దే’కి ప‌నిచేసిన అనుభ‌వం, హీరో హీరోయిన్లు నితిన్‌, కీర్తి ఎంత‌గా ఈ క‌థ‌ను న‌మ్మార‌నే విష‌యం, లెజెండ‌రీ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీ‌రామ్ వ్య‌వ‌హార‌శైలి గురించి ఆస‌క్తిక‌రంగా చెప్పుకొచ్చారు వెంకీ అట్లూరి. ఆ విశేషాలు.. ‌

‘రంగ్ దే’ క‌థ ఎలా పుట్టింది?
‘మిస్ట‌ర్ మ‌జ్ను’ త‌ర్వాత ఒక క్యూట్ ఫ్యామిలీ మూవీ చెయ్యాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. ప‌క్కింటి అబ్బాయి, ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్ర‌ల‌తో అలాంటి సినిమా చెయ్యాల‌నుకున్న‌ప్పుడు అర్జున్‌, అను పాత్ర‌లు నా మ‌న‌సులో పుట్టాయి. అలా వ‌చ్చిందే రంగ్ దే. ఈ సినిమాలో ల‌వ్ ఫ్యాక్ట‌ర్ కంటే ఎమోష‌న్ ఫ్యాక్ట‌రే ఎక్కువ ఉంటుంది.

కథాంశం ఏమిటి?
ప‌క్క ప‌క్క‌నే ఉండే రెండు కుటుంబాల క‌థ ఇది. స‌హ‌జంగానే మ‌నం మ‌న ఇంట్లోవాళ్ల‌ను ప‌క్కింటివాళ్ల‌తో పోల్చి చూస్తుంటాం. అలాంటప్పుడు వాళ్ల మ‌ధ్య ప్రేమ‌, ద్వేషం లాంటి ఎమోష‌న్స్ ఏర్ప‌డుతుంటాయి. అలా పొరుగిళ్ల‌లోని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మ‌ధ్య వ్య‌వ‌హారం పెళ్లిదాకా వ‌స్తే ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌నేది ఆస‌క్తిక‌రంగా చిత్రీక‌రించాం. ఈ మూవీలో ఇటు క‌డుపుబ్బ న‌వ్వించే హాస్య స‌న్నివేశాల‌తో పాటు, మ‌న‌సుని త‌ట్టే భావోద్వేగ స‌న్నివేశాలూ ఉంటాయి.

‘రంగ్ దే’ అనే టైటిల్ పెట్ట‌డం వెనుక ఏదైనా కార‌ణం ఉందా?‌
ఇంద్ర‌ధ‌న‌స్సులోని ఏడు రంగుల్లో ఒక్కొక్క‌టి ఒక్కో ఎమోష‌న్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ని చెబుతుంటారు. అలాగే ఈ సినిమా క‌థ‌లో ర‌క‌ర‌కాల భావోద్వేగాలు ఉంటాయి. అందుకే ‘రంగ్ దే’ అనే టైటిల్ పెట్టాం. అయితే సినిమాలో కామెడీ, ఎమోష‌న్స్ ప్ర‌ముఖంగా క‌నిపిస్తాయి. చివ‌రి 35 నుంచి 40 నిమిషాల సినిమా నిజంగా ఎమోష‌న‌ల్‌గా న‌డుస్తుంది.

హీరోగా మీ మొద‌టి ఛాయిస్ నితిన్ యేనా?
నిజానికి నేను ఈ క‌థ రాసుకున్న త‌ర్వాత మొద‌ట నితిన్‌ను కాకుండా వేరే హీరోల‌ను అనుకున్నాను. ఈ సినిమా చేయ‌డానికి సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ముందుకు వ‌చ్చాక‌, నితిన్ పేరును నిర్మాత నాగ‌వంశీ సూచించారు. నితిన్ ఒప్పుకుంటాడో, లేదోన‌నే సందేహంతోనే నేను క‌థ చెప్పాను. త‌ను సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేయ‌డంతో న‌మ్మ‌లేక‌పోయాను. క‌థ‌ను ఆయ‌న అంత‌గా న‌మ్మాడు. నితిన్‌, కీర్తి అంత‌గా ఈ క‌థ‌ను న‌మ్మ‌డంతో వాళ్ల పాత్ర‌ల‌తో మ‌రింత బాగా ప్ర‌యోగాలు చేయ‌వ‌చ్చనిపించింది. ట్రైల‌ర్ రిలీజ్ చేశాక నా సినిమాల‌కు ఎప్పుడూ రానంత పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. దాంతో సినిమాపై నా న‌మ్మ‌కం ఇంకా పెరిగింది.

‘మ‌హాన‌టి’ త‌ర్వాత కీర్తి వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ఈ రోల్‌తో ఆమెకు ఎలాంటి పేరు వ‌స్తుంద‌నుకుంటున్నారు?‌
‘మ‌హాన‌టి’ ఒక లెజండ‌రీ ఫిల్మ్‌. నేను ఈ సినిమా కోసం సంప్ర‌దించిన‌ప్పుడు కీర్తి.. మిస్ ఇండియా, పెంగ్విన్‌, గుడ్‌ల‌క్ స‌ఖి సినిమాలు రాలేదు. మ‌హాన‌టి వ‌చ్చాక కీర్తిని ఆ సినిమా ఫేమ్‌గానే చెప్తున్నారు కానీ, దానికంటే ముందు ఆమె మంచి మంచి రోల్స్ చాలా బాగా చేసింది. ఈ సినిమాలో అను పాత్ర ఆమెకు మంచి పేరు తెస్తుంద‌ని న‌మ్ముతున్నాను.

నితిన్‌, కీర్తి సురేష్‌ల‌తో సెట్స్ మీద ప‌నిచేసిన అనుభ‌వం ఎలాంటిది?
నితిన్ నాకు ప‌దిహేనేళ్లుగా ప‌రిచ‌యం. అందువ‌ల్ల నాకు త‌న‌తో సెట్స్ మీద చాలా సౌక‌ర్యంగా అనిపించింది. కీర్తి విష‌యానికి వ‌స్తే, ఆమె వెనుక ‘మ‌హాన‌టి’తో వ‌చ్చిన పెద్ద పేరుంది. ఆమెతో ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ రెండో రోజు నుంచే చాలా కంఫ‌ర్ట్ అట్మాస్పియ‌ర్‌ను ఆమె క్రియేట్ చేసింది. అలా ఆ ఇద్ద‌రితో చాలా సౌక‌ర్యంగా ఈ సినిమా చేశాను. నా కంటే ఈ స‌బ్జెక్టును నితిన్‌, కీర్తి గ‌ట్టిగా న‌మ్మారు. షూటింగ్ జ‌రుగుతున్నంత సేపూ క‌థ గురించి, స‌న్నివేశాల గురించి నాతో బాగా డిస్క‌స్ చేస్తూ వ‌చ్చారు. అర్జున్‌, అను పాత్ర‌ల‌ను వారు బాగా చేశారు అనేకంటే ఆ పాత్ర‌ల్లో వాళ్లు బాగా ఇన్‌వాల్వ్ అయ్యార‌న‌డం క‌రెక్టుగా ఉంటుంది.

పీసీ శ్రీ‌రామ్ లాంటి ప్ర‌ఖ్యాత సినిమాటోగ్రాఫ‌ర్‌తో ప‌నిచేశారు క‌దా.. ఎలా అనిపించింది?
జీవితంలో కొంత‌మందితో ప‌నిచేయాల‌ని అనుకుంటుంటా. పీసీ శ్రీ‌రామ్ గారితో అయితే క‌లిసి ప‌నిచేస్తాన‌ని నేను క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇండియాలోని టాప్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఆయ‌న పేరు ముందుగా వ‌స్తుంది. క‌థ చెప్ప‌గానే ఆయ‌న‌కు న‌చ్చింది. అదొక షాక్ నాకు. ఆయ‌న‌కు ముందుగానే బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చేయాలి, అదీ ఇంగ్లిష్‌లో. అది ఇచ్చాక ఆయ‌న త‌న అసిస్టెంట్లు ఆరేడుగురికి ఇచ్చి, చ‌ద‌వ‌మ‌ని చెప్పారు. అలా అంద‌రికీ ఆ స్క్రిప్ట్‌లో ఎప్పుడు ఏ సీన్‌, ఏ షాట్ వ‌స్తుందో తెలుసు. ఆయ‌న సెట్స్ మీదుంటే ఎవ‌రూ రిలాక్స్ అవ‌డానికి ఛాన్సే ఉండ‌దు, నాతో స‌హా. ఆయ‌న వ‌ల్లే 64 రోజుల్లో సినిమాని పూర్తి చేశాం. ఒక ద‌ర్శ‌కుడ్ని అయివుండి కూడా ఆయ‌న ద‌గ్గ‌ర నేను చాలా నేర్చుకున్నా.

దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణితో ప‌నిచేసిన అనుభ‌వం ఎలా ఉంది?
దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఈ సినిమాకు ఏం కావాలో అది ఇచ్చారు. ఆయ‌నిచ్చిన సాంగ్స్ ఒకెత్తు అయితే, రీరికార్డింగ్ ఇంకో ఎత్తు. ఈ సినిమాకు పాట‌లూ, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్ల‌స్ అవుతాయి. ఇక శ్రీ‌మ‌ణి అయితే ఈ సినిమాతో క‌లిపి నాకు 18 పాట‌లు రాసిచ్చాడు.  వ‌దులుకోవాల‌న్నా మేం ఇద్ద‌రం ఒక‌ర్నొక‌రం వ‌దులుకోలేం. మా ఇద్ద‌రికీ బాగా కుదిరింది.‌‌

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ గురించి ఏం చెబుతారు?
నిర్మాణ విలువ‌ల విష‌యంలో సితార ఎంట‌ర్టైన్‌మెంట్స్ ఏ రోజూ రాజీ ప‌డ‌లేదు. మేం ఇట‌లీలో షూటింగ్ ప్లాన్ చేసిన‌ప్పుడు అక్క‌డ లాక్‌డౌన్ విధించ‌డంతో, ఇండియాలోనే షూటింగ్ చేసేద్దామ‌నుకున్నా. కానీ నాగ‌వంశీ అలా కాద‌ని దుబాయ్‌లో ప్లాన్ చేయించారు. క‌థ‌లోనూ దానికి త‌గ్గ‌ట్లుగా బ్యాక్‌డ్రాప్ మార్చాం. ఈ సినిమా కోసం ఖ‌ర్చు పెట్టిన‌దంతా మీకు తెర‌మీద క‌నిపిస్తుంది.

మీ త‌ర్వాత సినిమా ఏంటి?
సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, దిల్ రాజు బ్యాన‌ర్ క‌లిసి నా త‌దుప‌రి చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. అది ల‌వ్ స్టోరీ కాదు. వేరే త‌ర‌హా సినిమా. ఇంత‌కంటే ఎక్కువ విష‌యాలు దాని గురించి చెప్ప‌లేను.