ది వైట్ టైగర్ మూవీ రివ్యూ

Published On: January 23, 2021   |   Posted By:

ది వైట్ టైగర్ మూవీ రివ్యూ

ప్రియాంక చోప్రా ‘ది వైట్ టైగర్’ రివ్యూ

Rating:3/5

రాజస్దాన్ లోని లక్ష్మణ్ గఢ్ గ్రామానికి చెందిన బ‌ల్ రామ్ హ‌ల్వాయ్ (ఆదర్శ్ గౌరవ్) కు బ్రతుకూ లేదు..ప్రత్యేకమైన బ్రతుకు తెరువంటూ ఏమీ లేదు. చదువు లేక పోవటంతో తనకు ఏమీ లేదు అనే ఆలోచన కూడా లేదు. దాంతో చక్కగా ఎక్కడో చోట ఓ పెద్ద కుటంబంలో పనిచేస్తే నెలకు జీతం వస్తుంది,జీవితం ప్రశాంతంగా వెళ్తుందని నమ్ముతాడు. అతని దృష్టిలో పెద్ద ఉద్యోగం కారు డ్రైవర్. కష్టపడి డ్రైవింగ్ నేర్చుకుని ఓ పెద్ద మోతుబరి (మహేష్ ముంజ్రేకర్) మోచేతి నీళ్లు తాగుతానని, “బాంచన్ నీ కాల్మొక్తా” అని పడి ఉంటానని ఒప్పించుకుంటాడు. అలా ఆ మోతుబరి కొడుకు   అశోక్(రాజ కుమార్ రావు)కు డ్రైవర్ అవుతాడు. అశోక్ ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చాడు. అతనితోపాటు ఎన్నారై భార్య పింకీ(ప్రియాంక చోప్రా) కూడా దిగింది. ఆమెకు ఇక్కడ కులం, కట్టుబాట్లు అంటూ పనోళ్లుపై చేసే దాదాగిరి నచ్చదు. అలా బల్ రామ్ పై ఆమెకు సానుభూతి ఏర్పడుతుంది.

అశోక్ కూడా బల్ రామ్ ని గౌరవంగానే చూస్తూంటాడు లేదా చూసినట్లు భార్య దగ్గర నటిస్తూంటాడు. ఇలా బలరామ్ కు ఇదే మంచి బ్రతుకు అనిపిస్తూండగా..ఓ రోజు అనుకోని సంఘటన మొత్తం మార్చేస్తుంది. అది మరేదో కాదు…పింకీ పుట్టిన రోజున..తాగి ..డ్రైవింగ్ సీట్ లో తను కూర్చుని డ్రైవ్ చేస్తుంది. ఓ యాక్సిడెంట్ చేస్తుంది. దాంతో ఆ యాక్సిడెంట్ ని ఈ డ్రైవర్ మీద వేయటానికి కుటుంబం సిద్దమై…బలరామ్ చేత ఒప్పిస్తారు. అయితే ఆ యాక్సిడెంట్ ఆ తర్వాత సెటిల్ మెంట్ తో సెటిలైనా…బలరామ్ కు మాత్రం కళ్లు తెరుచుకునే స్దితి కలగచేస్తుంది. అక్కడ నుంచి అతను ప్రపంచాన్ని చూసే కోణం మారిపోతుంది. తమని ఎలా డబ్బున్న వాళ్లు వాడుకుంటున్నారో అర్దం చేసుకుంటాడు. భూస్వాములు జనం కష్టాన్ని   దోచుకుంటూ అమానవీయంగా, రాక్షసంగా అణచివేస్తున్నారని తనదైన చిన్న బుర్రలో తెలుసుకుంటాడు. అలాగని ప్రతిఘటించాలని అనుకోడు. అవకాసం వచ్చినప్పుడు తనూ ఓ పెద్ద మనిషి గా మారాలనుకుంటాడు. అలాంటి అవకాసం బల్ రామ్ కు వచ్చిందా..వస్తే అతను సద్వినియోగం చేసుకున్నాడా లేదా అనేది తెలియాలంటే సినిమాని తెరపై చూడాలి.
 
కథ,కథన విశ్లేషణ

పేదోడు పెద్దోడుగా ఎదిగే క్రమం ఎప్పుడు అందరికీ ఇంట్రస్టింగే.అయితే అందులో కొంతైనా నిజం ఉండాలి. ఫాంటసీలతో పనికానిచ్చేదామంటే పక్కున నవ్వేసి ప్రక్కకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రతీ మిడిల్ క్లాస్ వాడికీ పెద్దోడు అవ్వాలి, పెద్ద మనిషి అని మనస్సు అంతరాళలలో ఉంటుంది దానికి రోడ్ మ్యాప్ దొరుకు తుందేమో అని ప్రతీ సినిమా పనిగట్టుకుని చూస్తూంటాడు. నిజ జీవితంలో అనుకరించలేకపోయినా..చూస్తున్నంతసేపైనా ఇలా జరిగితుంది అనిపించగలగాలి. అలాంటి మ్యాజిక్ ని ‘ది వైట్ టైగర్’  ఎంతవరకూ చేసింది అంటే కొంతవరకే అని చెప్పాలి. సినిమాలో ముప్పాతిక భాగం క్యారక్టర్ ఎస్టాబ్లిష్ కు, పరిస్దితులను పేర్చటానికే సరిపోయింది. ఎప్పుడు హీరో హీరో అవుతాడా అని ఎదురుచూస్తే,అది ప్రీ క్లైమాక్స్ దాకా జరగదు. పోనీ అప్పుడైనా హీరో అయ్యే విధానం ఫెరఫెక్ట్ గా చూపెట్టారా అంటే అదీ లేదు. అంతా సినిమాటెక్ వ్యవహారంలా ఉంటుంది.

ప్రస్టేషన్ పెరిగిపోయి…యజమానిని చంపేసి, ఆయన దగ్గర ఉన్న డబ్బు ఎత్తుకుపోయి వ్యాపారం మొదలెట్టి సెటిలయ్యాడు అని చెప్పి ముగించారు. ఓ మనిషిని చంపేసిన వాడిని ఈ దేశంలో ఎవరూ పట్టుకోలేకపోయారు అని తేల్చేసారు. అయితే డైరక్టర్ అనుకున్నంత చేతకాని దేశమైతే మనది కాదు. ఇక్కడా చట్టాలు,పోలీస్ వ్యవస్దా స్ట్రాంగ్ గానే ఉంది. అందులోనూ పెద్దవాడో, పొలిటీషయన్ అయితే మర్డర్ చేసి తప్పించుకోగలడేమో కానీ ఇక్కడ మామూలు కారు డ్రైవర్ వల్ల అది సాద్యం కాదు. అలాంటి విషయాలన్ని ప్రక్కన పెట్టి మన దేశంపై తనకున్న సొంత అభిప్రాయాలు రుద్దాడు. అఫ్ కోర్స్ ఆ పుస్తకంలోనూ అదే రాసి ఉండవచ్చు. అలాగే ఆ పుస్తకం రాసేనాటికి,సినిమా తీసేనాటికి మధ్య 12 సంవత్సరాల సుదీర్గమైన గ్యాప్ ఉంది. దాన్ని కూడా డైరక్టర్ దృష్టిలో పెట్టుకుని ఉంటే చూసేవాడికి దృష్టి దోషం అనిపించదు. అయితే చాలా వరకూ టైట్ స్క్రీన్ ప్లే తో సినిమాని లాగ్ లు లేకుండా పరుగెట్టించాడు కాబట్టి సినిమా ఇబ్బంది పెట్టలేదు.
 
టెక్నికల్ గా ..

ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లేనే ప్రధానం.  ప్రముఖ ఇండో–ఆస్ట్రేలియన్‌ రచయిత అరవింద్‌ అడిగి ఇదే టైటిల్ తో రాసిన నవల రైట్స్ తీసుకుని ఈ సినిమా చేసారు.  ది వైట్ టైగ‌ర్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్ గా  నిలిచింది. 2008లో మ్యాన్ బుక‌ర్ ప్రైజ్ గెలుచుకుంది. అలాంటి నవలకు విజువల్ గా ఇంపాక్ట్ వచ్చే షాట్స్ తో , డైలాగులతో, సీన్స్ తో డైరక్టర్ న్యాయం చేసాడు. అయితే నవల వేరు సినిమా వేరు. సినిమాలో చూపే పరిష్కారం ఊహించుకునేందుకు ఏమీ ఉండదు. కళ్లకు ఎదురుగా కనపడుతుంది. కాబట్టి కాస్త రియలిస్టిక్ గా ఉంది అనిపించాలి. ఆ విషయంలో డైరక్టర్ ఫెయిల్ అయ్యారు. నవలను యాజటీజ్ ఫాలో అయ్యిపోయారు. దాంతో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తేలిపోయాయి. అలాగే ఈ సినిమా కొరియన్ ఆస్కార్ ఫిల్మ్ పేరాసైట్ ని గుర్తు చేస్తోందనే విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది. డైరక్టర్ గా మాత్రం మేకింగ్ బాగుంది. ప్రియాంక చోప్రా, రాజ్ కుమార్ రావు వంటి ఆర్టిస్ట్ లు పీక్స్ లో ఫెరఫార్మెన్స్ చేసారు. ఇక డ్రైవర్ గా చేసిన ఆదర్శ్ గౌరవ్ సినిమాని పూర్తిగా తన భుజాలపై మోసాడు. కెమెరా వర్క్, ఎడిటింగ్, ఆర్ట్ వంటి డిపార్టమెంట్స్ పోటీ పడి మరీ చేసాయి.
 
చూడచ్చా

ఇంట్రస్టింగ్ నేరేషన్ కాబట్టి బోర్ కొట్టదు.

తెర ముందు..వెనక

నటీనటులు: ప్రియాంకచోప్రా, రాజ కుమార్ రావు, మహేష్ ముంజ్రేకర్, ఆదర్శ్ గౌరవ్ తదితరులు
సంగీతం: డాని బెన్సాయి, సౌందర్ జురేయన్స్
 ఛాయాగ్రహణం: పాలో కార్నెరా
నిర్మాత:  రమిన్ బహ్రాని,ముకుల్ డియోరా, ప్రేమ్ అక్కిరాజు
రచన-దర్శకత్వం: రమిన్ బహ్రాని
ఓటీటి: నెట్ ప్లిక్స్
రన్ టైమ్: 125  నిముషాలు
విడుదల  తేదీ: 23/01/2021