దెయ్యం మూవీ రివ్యూ

Published On: April 17, 2021   |   Posted By:

సినీజీవి భయం: ఆర్జీవి ‘దెయ్యం’ రివ్యూ

Rating: 1.5/5

అప్పుడెప్పుడో 2014లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డా. రాజశేఖర్ చేసిన మొదటి హారర్ సినిమా ‘పట్ట పగలు’. ఆ సినిమా రకరకాల కారణాలతో అప్పుడు రిలీజ్ కాలేదు. అయితే మరి ఇన్నాళ్లకు ఏమనుకున్నారో ఏమో ..టైటిల్ మార్చి వదిలారు. అసలే కరోనా భయంతో జనాలు థియోటర్ వైపుకు వెళ్లటంలేదు. ఇలాంటి పరిస్దితుల్లో భయపెడతానంటూ దిగిన ఈ దెయ్యం ఏమేరకు తన పనిలో విజయం సాధించింది. వర్మ ఈ సారైనా సక్సెస్ అయ్యారా…లేక వదిలించుకున్న బాపతా ఈ సినిమా..రాజశేఖర్ వంటి నటుడు ఈ హారర్ సినిమా ఒప్పుకోనంత విషయం ఏముంది సినిమాలో …వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్..

మెకానిక్ శంకర్(రాజశేఖర్) కూతురు విజ్జి(స్వాతి దీక్షిత్) కాలేజీకు వెళ్లి చక్కగా చదువుకూంటూంటుంది. అయితే హఠాత్తుగా ఓ రోజు నుంచి ఆమె ప్రవర్తన మారిపోతుంది. దెయ్యం పట్టిన దానిలా రాత్రిళ్లు నడవటడం, గట్టిగా అరుస్తూంటుంది. దాంతో చుట్టు ప్రక్కల జనం భయపెడితే, తండ్రి తన చిట్టి తల్లికి ఏమైందని కంగారుపడతారు. డాక్టర్లూ ఏమీ తేల్చకపోవటంతో..ఆమె ప్రవర్తనకు కారణం మానవాతీత శక్తులే అని నిర్దారణకు వస్తారు. ఈ లోగా ఆమెలో ఉన్న దెయ్యం ఐడెంటిటీ కూడా బయిటకు వస్తుంది. అదో సైకో దెయ్యం. ఆ దెయ్యం ఎవరు..అసలు విజ్జిలోకి ఆ దెయ్యం ప్రవేశించటానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా..చివరకు ఆ సైకో దెయ్యాన్ని వెళ్లకొట్టారా వంటి విషయాలు తెలియాలంటే దైర్యం చేసి థియోటర్ కు వెళ్లచ్చు.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్..

ఈ సినిమా పాత సినిమా కాబట్టి బాగోలేదు అని ఒక్క మాటలో తేల్చేయచ్చు కానీ..ఇప్పుడు ఇదే కథతో తీసినా ఎక్కటం కష్టమే. హాలీవుడ్ దెయ్యం కథలను తీసుకొచ్చి ఇక్కడ నేటివిటి అద్దేసి వదిలేద్దామనుకుంటే అవి అతుక్కోవటం లేదు. రివర్స్ అయ్యి నిర్మాతను, డైరక్టర్ ని , చూడ్డానికి ప్రయత్నించేవాళ్లను పీక్కు తినేలా తయారవుతున్నాయి. సినిమా ఎంత విసుగ్గా ఉంటుందంటే..కూతురు దెయ్యం పట్టి అరుస్తూంటే, తండ్రి అదే పనిగా బాధపడుతూంటాడు. అంతకు మించి ఏమీ జరగదు. ఏదైనా జరిగితే సెకండాఫ్ ఉండదు అనే భయం కనపడుతుంది. దానికి తోడు భూత వైద్యులు నిమ్మ‌కాయ‌లు, మంత్రాలు చ‌దువుతూ పెద్దగా అరవటం వంటివి చూస్తూంటే నవ్వు వస్తుంది కానీ, కథలో లీనమై బుద్ది కాదు. ఆ తండ్రి ఎమోషన్ లోకి మన బుర్ర వెళ్లదు. ఎందుకంటే ఆ దెయ్యం పట్టిన కూతురుకి ప్రాణాపాయం లాంటిది ఏమీ జరగదు. అందులోనూ ఈ మధ్యన దెయ్యం సినిమా అంటే హారర్ కామెడీ అని జనం ఫిక్స్ అవ్వటంతో ఇదీ అదే బాపతేమో అనే డౌట్ వచ్చేస్తుంది. కాకపోతే వర్మ అనే లేబులే ఆ ఆలోచన రానివ్వకుండా అడ్డుకుంటుంది. స్క్రిప్టు అంతా ఓ రోజులు రాసేసినట్లుగా ,డైలాగులు అన్నీ స్పాట్ లో అప్పటికప్పుడు డవలప్ చేసేసినట్లుగా అనిపిస్తూంటాయి. ఎక్కడా కమిట్మెంట్ కనపడదు. ఈ సినిమా ఆడదు వర్మకే ముందే తెలిసిపోయి నీరసంతో డైరక్షన్ చేసినట్లు అనిపిస్తుంది.

దర్శకత్వం..మిగతా విభాగాలు

ఇలాంటి సినిమాలకు కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్క్రిప్టు ప్రాణంగా ఉండాలి. కెమెరా వర్క్ ఓకే కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ పాత కాలం సినిమా చూస్తున్న ఫీల్ తెస్తుంది. ఇక స్క్రిప్టు ఫెయిల్ అని మొదట పదినిముషాలకే అర్దమవుతుంది. అలాగే మేకింగ్ కూడా నాశిరకంగా ఉంటుంది. చీప్ ట్రిక్స్ సినిమాలో కనపడతాయి. టెక్నికల్ గా ఈ సినిమా చెప్పుకోదగ్గ రీతిలో లేదు. వర్మ రెగ్యులర్ స్టాండర్డ్స్ లో కూడా లేకపోవటం విషాదం.

నటీనటుల్లో రాజశేఖర్ ఓకే అనిపిస్తాడు. స్వాతి దీక్షిత్ అరవటమో నటన అన్నట్లు కొన్ని సీన్స్ చేసింది కానీ ..ఆ సినిమాలో మిగతావాళ్లతో పోలిస్తే ఆమె చాలా బెస్ట్. త‌నికెళ్ల భ‌ర‌ణి.. అనితాచౌద‌రి, స‌న‌.. మిగిలిన పాత్ర‌ల్లో వేరే వారి వాయిస్ తో కనిపిస్తారు. ఇంత గందరగోళ సినిమా వర్మ ఎలా చేసాడా అనిపించేలా ఉంటుంది.

చూడచ్చా

మరీ వర్మ తీసిన హారర్ సినిమాల మీద రీసెర్చ్ పోగ్రాం పెట్టుకుంటే తప్ప అనవసరం.

తెర ముందు..వెనుక

సంస్థ‌: న‌ట్టీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌;
న‌టీన‌టులు: రాజ‌శేఖ‌ర్‌, స్వాతిదీక్షిత్‌, బెన‌ర్జీ, ఆహుతి ప్రసాద్‌, అనిత చౌద‌రి, జీవా, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌న, అనంత్ త‌దితరులు;
సినిమాటోగ్రఫీ: స‌తీష్ ముత్యాల‌,
సంగీతం: డి.ఎస్‌.ఆర్;
ఎడిటింగ్: స‌త్య, అన్వర్;
నిర్మాత‌: న‌ట్టికుమార్‌;
ద‌ర్శక‌త్వం: రామ్‌గోపాల్ వ‌ర్మ;
రన్ టైమ్:1 గంట 38 నిమిషాలు
విడుద‌ల‌: 16 ఏప్రిల్ 2021