నువ్వుంటే నా జ‌త‌గా ట్రైల‌ర్‌ విడుద‌ల

Published On: January 27, 2021   |   Posted By:

నువ్వుంటే నా జ‌త‌గా ట్రైల‌ర్‌ విడుద‌ల

శ్రీ‌కాంత్ బిరోజు, గీతికా ర‌త‌న్ జంట‌గా సంజ‌య్ క‌ర్ల‌పూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘నువ్వుంటే నా జ‌త‌గా’. సాయి అక్ష‌య ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాన్‌కైండ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై సుమ క‌ర్ల‌పూడి, రామ‌కృష్ణ బ‌లుసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త‌ను స్వ‌యంగా ర‌చించిన‌ ‘ద క‌ర్స్‌డ్ క‌పుల్’ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమాని ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్నారు.

 డైరెక్ట‌ర్లు బాబీ (కె.ఎస్‌. ర‌వీంద్ర‌), వేణు ఊడుగుల ‘నువ్వుంటే నా జ‌త‌గా’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఒక అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించిన‌ట్లు ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. మెగాస్టార్ చిరంజీవి త‌న‌ను ఇన్‌స్పైర్ చేసిన‌ట్లు ట్రైల‌ర్ ఆరంభంలో ద‌ర్శ‌కుడు తెలిపారు. ట్రైల‌ర్ ప్ర‌కారం 2007లో వార‌ణాసిలో ఈ సినిమా క‌థ మొద‌ల‌వుతుంది. రామ్ అనే అబ్బాయి, భూమి అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నారు, ఆ ప‌రిస్థితుల కార‌ణంగా ఎలాంటి వేద‌న‌ను అనుభ‌వించార‌నేది ఈ చిత్రంలోని ప్ర‌ధానాంశం.

ప్రేమ అనేది బాధ‌తో పాటు, బ‌లాన్నీ ఇస్తుంద‌ని ఈ సినిమా ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. “మాటివ్వు రామ్‌.. న‌న్నొదిలి ఎక్క‌డికీ వెళ్ల‌న‌ని” అని భూమి అడిగితే, “మాటిస్తున్నాను భూమి.. ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ నిన్నొదిలి వెళ్ల‌ను” అని రామ్ చెప్పాడు. కానీ రామ్‌.. త‌న మాట నిల‌బెట్టుకోలేక‌పోయాడ‌ని ట్రైల‌ర్ తెలియ‌జేస్తోంది. అలా ఎందుకు జ‌రిగింది?  ఆ ఇద్ద‌రి మ‌ధ్యా దూరం ఎందుకు పెరిగింది?  తిరిగి ఆ జంట ఒక్క‌ట‌య్యిందా, లేదా.. అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఆద్యంతం ఆస‌క్తిక‌ర క‌థ‌నం, స‌న్నివేశాల‌తో సినిమా న‌డుస్తుంద‌ని ట్రైల‌ర్ తెలియ‌జేస్తోంది. హీరో హీరోయిన్లు కొత్త‌వాళ్ల‌యినా ద‌ర్శ‌కుడు వాళ్ల‌తో మంచి న‌ట‌న రాబ‌ట్టుకున్నారు. జ్ఞాని బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌, సుకుమార్ అల్లు సినిమాటోగ్ర‌ఫీతో ట్రైల‌ర్ రిచ్ లుక్‌తో క‌నిపిస్తోంది. సినిమా కూడా అంతే రిచ్‌గా ఉంటుంద‌ని చెప్ప‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదు. ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌కుండా రిచ్ కంటెంట్‌తో, మంచి సాంకేతిక విలువ‌ల‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నామ‌ని నిర్మాత‌లు చెప్పారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యిన ‘నువ్వుంటే నా జ‌త‌గా’ చిత్రాన్ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది.

తారాగ‌ణం:
శ్రీ‌కాంత్ బిరోజు, గీతికా ర‌త‌న్‌, ర‌ఫిక్ష‌, రాజ‌శేఖ‌ర్‌, సునీత‌, ధ‌న‌ల‌క్ష్మి, ర‌ఫీ, స‌తీష్‌, జాను, ప్ర‌సాద్‌, టీఎన్ఆర్‌.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: స‌ంజ‌య్ క‌ర్ల‌పూడి
నిర్మాత‌లు: సుమ క‌ర్ల‌పూడి, రామ‌కృష్ణ బ‌లుసు
బ్యాన‌ర్‌: సాయి అక్ష‌య ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాన్‌కైండ్ మూవీస్‌
ఫైనాన్స్‌: చిన్మ‌యి
మ్యూజిక్‌: జ్ఞాని
సినిమాటోగ్ర‌ఫీ: సుకుమార్ అల్లు
ఎడిటింగ్‌: కార్తీక్ గుర్రం
లిరిక్స్‌: దినేష్ గౌడ్ క‌క్కెర్ల‌, స్వాతి కిర‌ణ్ మూర్తి