పత్రికాప్రకటన

Published On: August 12, 2021   |   Posted By:
 
పత్రికాప్రకటన
 
 
చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,  సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. 
 
 
మంగళవారం BRK భవన్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలు, ఇతర అంశాలపై  మంత్రి శ్రీనివాస్ యాదవ్ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ తో కలిసి అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
 
 
ఈ సమావేశంలో హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవి గుప్తా, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, విద్యుత్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, లా సెక్రెటరీ సంతోష్ రెడ్డి, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతు ప్రసాద్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు నారాయణ దాస్ నారంగ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు మురళి మోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అద్యక్షులు C.కళ్యాణ్, సెక్రెటరీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర రంగ అభివృద్దికి అనేక విధాల సహాయ సహకారాలు అందించిన విషయాన్ని గుర్తుచేశారు. సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా అనువుగా ఉన్న హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం అన్నారు. సినిమా షూటింగ్ ల కోసం అనుమతులు పొందేందుకు నిర్వహకులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా టికెట్ ల విక్రయాలలో పారదర్శకత కోసం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనివలన తక్కువ సర్వీస్ చార్జి తోనే ప్రేక్షకులు టికెట్ ను పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రైవేట్ సైట్ లు ఒక్కో టికెట్ కు  20 నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయని, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ( FDC ) ఆధ్వర్యంలో నిర్వహించే ఆన్ లైన్ టికెట్ విధానంలో ఒక్కో టికెట్ కు కేవలం 6 రూపాయలు మాత్రమే సర్వీస్ చార్జి వసూలు చేయబడుతుందని మంత్రి వివరించారు.  ఆన్ లైన్ టికెట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని హోం, లా సెక్రెటరీ లను మంత్రి ఆదేశించారు. లాక్ డౌన్ సమయంలో ధియేటర్ లు మూసివేసి ఉన్నందున ప్రభుత్వానికి చెల్లించాల్సిన విద్యుత్ చార్జీలు, ఆస్తిపన్ను రద్దు చేసి ఆదుకోవాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు అనుమతించాలని తదితర విజ్ఞప్తులతో సినీ ఎగ్జిబిటర్స్ వినతిపత్రాన్ని అందజేశారని, అందులో పార్కింగ్ ఫీజు వసూలు కు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. మిగిలిన అంశాల పరిష్కారానికి  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ప్రస్తుతం 4 షో లు ప్రదర్శించబడుతున్నాయని, 5 వ షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ షూటింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకోవడానికి, అనుమతించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల లోని కార్మికుల (24 క్రాఫ్ట్స్ ) కు అండగా ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడంలో కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా మూతపడిన థియేటర్ లను 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో తెరిచేందుకు ప్రభుత్వం నవంబర్ 2020 అనుమతులు ఇచ్చిందని, కరోనా తగ్గుముఖం పట్టడంతో 100 శాతం సీటింగ్ కెపాసిటీ తో తెరిచేందుకు ఫిబ్రవరి 2021 న ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.