బంగారు తల్లి మూవీ రివ్యూ

Published On: September 12, 2020   |   Posted By:

బంగారు తల్లి మూవీ రివ్యూ

మెరిసేదంతా బంగారం కాదు ( ‘బంగారు తల్లి’ రివ్యూ )

Rating:2/5

జ్యోతిక న‌టించిన సినిమాలు వరసపెట్టి లాక్ డౌన్ స‌మ‌యంలోనే డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. ఈ సంవత్సరం మే నెలలో.. జ్యోతిక న‌టించిన  త‌మిళ చిత్రం పొన్మంగ‌ల్ వంథ‌ల్  రిలీజైంది. ఆ సినిమానే ఇప్పుడు తెలుగులో బంగారు త‌ల్లిగా డ‌బ్ చేశారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. జ్యోతిక భర్త సూర్య నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది?  జ్యోతిక చేసిన ఈ ప్ర‌య‌త్నం ఏ మేర‌కు మెప్పించింది?  అసలు ఈ సినిమా కథేంటి..చూడదగ్గ సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్..

ఓ పదిహేనేళ్ల క్రితం…ఊటీలో జ్యోతి అనే ఆమె…. కొంత‌మంది చిన్న‌పిల్ల‌ల్ని దారుణంగా చంపేయటమే కాకుండా… అడ్డొచ్చిన ఇద్ద‌రు కుర్రాళ్లని కాల్చి పారేస్తుంది. అప్పట్లో ఆ ఇష్యూ చాలా పెద్దదవుతుంది. జ్యోతిని సైకోగా తేల్చి… చివరకు ఆమెను పోలీసులు ప‌ట్టుకుని, ఎన్‌కౌంట‌ర్ చేసి చంపేస్తారు. ఇది జరిగిన ఇన్నాళ్లకు…. ఈ కేసుని వెన్నెల (జ్యోతిక‌) అనే లాయ‌రు తిర‌గ‌తోడటం మొదలెడుతుంది. ఈ క్రమంలో ఈ  కేసుకు సంభందించి కొన్ని షాకింగ్ నిజాలు బయిటకు వస్తాయి. అయితే ఆ నిజాలు బయిటకు రానివ్వకుండా అక్కడ  పెద్ద మ‌నిషి వ‌ర‌ద‌రాజులు (త్యాగ‌రాజ‌న్‌),  ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ రాజార‌త్నం (పార్తీబ‌న్‌) అడ్డుపడతారు. వాళ్లను దాటుకుని  వెన్నెల‌ ఆ కేసు గెలిచిందా. అస‌లు సైకో జ్యోతి ఎవ‌రు?  ఆమె గతం ఏమిటి..అసలు చిన్న పిల్లలను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆమె చేతిలో చనిపోయిన ఆ కుర్రాళ్లు ఎవరు?  జ్యోతికీ వెన్నెల‌కూ ఉన్న సంబంధం ఏమిటన్న‌ది అస‌లు క‌థ‌.

ఎలా ఉంది..

అసలు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించగానే తమిళ చిత్ర పరిశ్రమలో దుమారం రేగింది. అయినా, సరే మాకుండే సమస్యలు మాకున్నాయి..వాటిని మీరు తీర్చలేరు కదా అంటూ  దర్శక-నిర్మాతలు అటువైపే మొగ్గు చూపారు. అమెజాన్‌ ప్రైమ్‌ లో డైరక్ట్ గా విడుదలైన తొలి తమిళ సినిమాగా వార్తల్లో నిలిచింది. అయితే సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. దానికి కారణం సినిమాలో కోర్ట్ డ్రామా ఎక్కువ అవటమే. పింక్ సినిమా ఆడింది కదా అని ఈ సినిమా ప్లాన్ చేసినట్లున్నారు. అలాగే సినిమాలో ఇన్విస్టిగేషన్ పార్ట్  చెప్పుకోదగిన స్దాయిలో ఇంట్రస్టింగ్ గా లేదు. కాకపోతే ఈ సినిమాలో కొన్ని ఎమోషన్ సీన్స్ మన గుండెలను తడతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ అంతకు మించి ఉండాలి కానీ..ఇంటర్వెల్ ట్విస్ట్ నే రివర్స్ లో ప్లే చేసారు. ఆ ట్విస్ట్ కోసం సెకండాప్ మొత్తం బలి ఇచ్చారు.

కానీ కొన్ని డైలాగులు సినిమా పూర్తయ్యాక కూడా మనని వెంటాడతాయి. మ‌నింట్లో పెరుగుతున్న అమ్మాయిల‌కు ఇలాంటి దుస్తులు వేసుకోకు, అలా మాట్లాడ‌కు, ఇలా చూడ‌కు… అని ర‌క‌ర‌కాలుగా చెబుతుంటాం. కానీ.. మ‌న ఇంట్లో పెరుగుతున్న అబ్బాయిల‌కు మాత్రం అమ్మాయిల్ని ఇలా గౌర‌వించు, వాళ్ల‌తో ఇలా ప్ర‌వ‌ర్తించ‌కు అని మాత్రం ఎందుకు చెప్పం? అని జ్యోతిక ప్రశ్నించటం మనని మనమే ప్రశ్నించినట్లు ఉంటుంది. అయితే ఇలాంటి కొన్ని సీన్స్ కోసం సినిమా మొత్తం భరించటం కాస్త కష్టమే.

అలాగే జ్యోతిక లాయిర్ పాత్ర చేసింది కాబట్టి లీగల్ థ్రిల్లర్ అనుకోవాలి తప్ప..ఆ ఛాయిలు ఏమీ పెద్దగా కనపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే చేసారనిపిస్తుంది. పోనీ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ అందాము అంటే పోలీస్ లు ఓ ప్రొసీజర్ అంటూ ఏదీ ఫాలో కారు. ఇవన్నీ కాదండీ ఓ డిటెక్టివ్ స్టోరీ..ఓ సీరియల్ కిల్లర్ మర్డర్ మిస్టరీని ఛేధించిన విషయం అందాము అంటే ఆ నేరేషన్ కనపడదు. సినిమాలో ఎక్కువ సీన్స్ కోర్ట్ లో ఉన్నాయి కాబట్టి కోర్ట్ రూమ్ డ్రామ్ అని ఫిక్స్ అవ్వాలి. అలాగే డ్రామా అనేదానికన్నా మెలోడ్రామా అంటే పద్దతిగా ఉంటుంది. ఎందుకంటే కన్నీళ్లతోనే కోర్టుని కన్వీన్స్ చేసే లాయిర్ కథ ఇది. 
 
టెక్నికల్ గా

 అయితే ఈ కోర్టు డ్రామా లో  జ్యోతిక, పార్తిబ‌న్, భాగ్యరాజా లాంటి గొప్ప స్టార్ల న‌ట ప్ర‌తిభ మెస్మ‌రైజ్ చేస్తుంది. ట్విస్ట్ అక్కడక్కడా మెరుస్తాయి.ఈ చిత్రాన్ని సూర్య త‌న సొంత బ్యాన‌ర్ లోనే కాస్తంత రిచ్ గానే నిర్మించారు. టెక్నికల్ గా ఎడిటింగ్ ఏమంత బాలేదు. కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అమిరింది. కథ,కథనం మరింత నావెల్టీగా ఉంటే బాగుండేది. దర్శకత్వం సోసోగా ఉంది. ఏదో చెప్పాలని తాపత్రయం కనపడుతోంది కానీ దాన్ని విజువలైజ్ చేసి తెరకెక్కించే సామర్ధ్యం అయితే కొరవడింది. . డ‌బ్బింగ్ విష‌యంలో జాగ్ర‌త్తలు తీసుకుంటే బాగుండేది.
 
చూడచ్చా..

మరీ టైమ్ గడవటం లేదు అనిపించినా లేదా జ్యోతిక ఫ్యాన్ అయినా చూడచ్చు.

తెర వెనక..ముందు

నటీనటులు: జ్యోతిక, పార్తిబన్‌, కె.భాగ్యరాజ్‌, త్యాగరాజన్‌, పాండియరాజన్‌, ప్రతాప్‌ పోతన్‌ తదితరులు
సంగీతం: గోవింద వసంతన్‌
ఎడిటింగ్‌: రుబెన్‌
సినిమాటోగ్రఫీ: రాంజీ
నిర్మాత: సూర్య
కథ, దర్శకత్వం: జె.జె.ఫెడ్రిక్‌
రన్ టైమ్: 2 గంటలు
బ్యానర్‌: 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌
ఓటీటి: ఆహా
విడుదల తేదీ: 11-09-2020