మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

Published On: November 1, 2019   |   Posted By:

మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

ఫస్టాఫే చెప్పు చాలు (‘మీకు మాత్రమే చెప్తా’రివ్యూ)

Rating:2/5

రాజేంద్రప్రసాద్ నటించిన ఏప్రియల్ 1 విడుదల సినిమాలో ఓ సీన్ ఉంటుంది.  హీరోయిన్ శోభన తను హాస్పటిల్ లో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవటానికి ఏదన్నా ఓ సినిమా క్యాసెట్ ,టీవి పంపమంటుంది. వీడియో పార్లర్ యజమాని, ఆమెను గాఢంగా ప్రేమిస్తున్న దివాకరం(రాజేంద్రప్రసాద్) షాపు నుంచి పొరపాటున ఓ అడల్ట్ క్యాసెట్ వెళ్లిపోతుంది. దాంతో ఆమె ఆ క్యాసెట్ చూస్తే తన మీద ఉన్న ఇంప్రెషన్ ఎక్కడ పోగొట్టుకుని, పెళ్లికి ఒప్పుకోదో అనే భయంతో ఆ క్యాసెట్ ని చూసేలోగా దాన్ని తీసేయ్యాలని ఫిక్స్ అవుతాడు. ఆ టెన్షన్ అందుకు అతను పడే తాపత్రయం మనకు చాలా కాలం గుర్తిండిపోతుంది. సరిగ్గా అలాంటి పాయింట్ నే డీల్ చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ద్వారా నిర్మాత విజయదేవరకొండ ఏం చెప్పాడు, దర్శకుడైన తరుణ్ భాస్కర్ ఎక్సైటై హీరోగా చేయటానికి కారణమైన ఆ కథేంటి, సినిమా అన్ని వర్గాలకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
కథేంటంటే…

అనగనగా రాకేష్(త‌రుణ్ భాస్కర్) అనే కుర్రాడు. ఓ టీవీ ఛానెల్ లో పనిచేస్తూ…టీఆర్పీల కోసం చిత్రమైన వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తూంటాడు. ఆ క్రమంలోనే ఓ డైరక్టర్ మాట నమ్మి…హానీమూన్ బ్యాక్ డ్రాప్ లో సాగే  ‘మ‌త్తు వ‌ద‌ల‌రా, నిద్దుర మ‌త్తు వ‌ద‌లరా’ అనే వీడియో చేస్తాడు. మరో ప్రక్క  స్టెఫీ (వాణి భోజ‌న్‌)తో  ప్రేమలో పడతాడు. ఆమెకు ఎప్పుడూ ఏదో ఒక అబద్దం ఆడే రాకేష్ అంటే డౌట్. మొత్తానికి ఏదో విధంగా ఒప్పించి పెళ్లికి రెడీ అవుతాడు. ఈ లోగా తను చేసిన వీడియోతో సూప్ లో పడతాడు. ఆ వీడియోని ఫలానా అని చెప్పకపోతే బూతు వీడియోలాగ ఉంటుంది. దాంతో ఇప్పుడీ వీడియో కనుక తన కాబోయే భార్య కనుక చూస్తే ఘోరం జరిగిపోతుందని, నమ్మి దాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తాడు. అందుకు తన క్లోజ్ ఫ్రెండ్ కామేష్ (అభిన‌వ్ గౌతమ్‌) సాయం తీసుకుంటాడు. మరో ప్రక్క ఈ పెళ్లిని ఆపేయాలని ఆమె బావ జాన్సన్ విశ్వ ప్రయత్నం చేస్తూంటాడు. చూస్తే పెళ్ళి ఇంకో రెండు రోజులే ఉంది. వీడియో చూస్తే వైరల్ అయ్యిపోతోంది. ఏం చేయాలి. తన హ్యాకర్ ఫ్రెండ్ సాయింతో ఆ వీడియోని తీయించేస్తే మరొకటి ప్రత్యక్ష్యమైంది. అసలేం జరుగుతోంది. ఎవరు తనను ఇబ్బంది పెడుతున్న ద్రోహి. చివరకు రాకేష్ పెళ్లి జరిగిందా ?ఆగిందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

పూర్తిగా తయారు కాని స్క్రిప్టు

న్యూ ఏజ్ కామెడీగా చెప్పబడుతున్న ఈ సినిమాకు స్క్రిప్టే సమస్యగా మారింది. స్టోరీలైన్ వరకూ బాగానే ఉన్నా…ట్రీట్మెంట్ వెర్షన్ లోనే బోల్తా కొట్టారు. దాంతో ఫస్టాఫ్ సినిమా యమా స్పీడుగా , ఫన్ తో నడిచినా, సెకండాఫ్ కు వచ్చేసరికి కొద్ది సేపు కూడా ఎంగేజ్ చేయలేక విసుగెత్తించింది. క్యారక్టర్స్, కథా నేపధ్యం, సమస్య సరిగ్గానే సెట్ చేయగలిగినా సెకండాఫ్ లో ఆ సమస్యను సాల్వ్ చేసే విధానం సరిగా లేక, దాని నుంచి పుట్టే కామెడీ లేకుండా పోయింది. దాంతో ఇంటర్వెల్ దాకా మంచి సినిమా చూసేమన్న ఫీల్ తో సెకండాఫ్ ఎదురుచూసిన వారికి గట్టి దెబ్బే తగిలింది. సినిమాకు ఫస్టాఫ్ ఎలా ఉన్నా సెకండాఫ్ బాగుండే గెలవచ్చు అని చెప్తూంటారు. అలాంటిది సెకండాఫే సమస్యగా మారేసరికి సినిమాకు దశ,దిశ లేకుండా పోయింది. దానికి కారణం కథలో విలన్ ఎవరో చివరి దాకా తెలియని థ్రిల్లర్ నేరేషన్, సమస్యలోంచి మరో సమస్య పుట్టే స్క్రీన్ ప్లే రాసుకోకోపోవటం అని అర్దమవుతుంది. సెకండాఫ్ బాగా ల్యాగ్‌గా అనిపిస్తుంది. సినిమాలో చెప్పుకోదగ్గ ట్విస్టులు లేవు. క‌థంతా సింగిల్ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది.

తెలుగు భాగ్యరాజా అయ్యేవాడే…కానీ

హీరోగా తరుణ్ భాస్కర్ కు ఇది తొలి సినిమా. ఇది హిట్ అయితే ఆయన చక్కగా అప్పటి భాగ్యరాజా లాగ తనే హీరోగా, తన దర్శకత్వంలో లైటర్ వీన్ కామెడీలు చేసుకోవచ్చు. కానీ ఆ అవకాసం ఈ సినిమా ఇవ్వలేదు. అయితే నటుడుగా తరుణ్ భాస్కర్ కు వంకపెట్టలేం. బాగా చేసాడు. ఇక అనుసూయ విషయానికి వస్తే హ్యాకర్‌ పపా అక్కగా  కీలక పాత్రలో కనిపించింది. ఉన్నవి కొద్ది పాటి సీన్సే అయినా రాణించింది. మిగతా వాళ్లలో అభినవ్ గోమటం ఈ సినిమాలో హైలెట్ అయ్యారు. అబద్దాలు నచ్చని…, రాకేష్ చర్యలను అనుమానించే అమ్మాయి పాత్రలో వాణి భోజన్ ఫెరఫెక్ట్.

 దర్శకత్వం…మిగతా విభాగాలు

దర్శకుడుగా లిమిటెడ్ క్యారక్టర్స్ తో సినిమాని బాగా తెరకెక్కించాడు షమీర్. అయితే షార్ట్ ఫిలిం చూసిన ఫీల్ రావటమే సినిమాకు బ్యాడ్. మ‌ద‌న్ గుణ‌దేవా కెమెరా వ‌ర్క్‌ ఫరవాలేదు.  శివ‌కుమార్ పాటలు ఎలా ఉన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది.  ఎడిటింగ్ జస్ట్ ఓకే. పంచ్ లు పెద్దగా పేలలేదు. అయితే కొన్ని డైలాగులు నాచురల్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు వెరీ ప్యూర్. విజయ దేవరకొండ ను ఇంత నాశిరకమైన సినిమా నిర్మాతగా ఊహించలేం.
 
చూడచ్చా ?

కామెడీ సినిమా అంటే మరీ సినిమా అంతా కామెడీ ఉండక్కర్లేదు అని భావించేవాళ్లకు ఇది నచ్చుతుంది. మల్టిఫ్లెక్స్ లకు కొద్దిలో కొద్ది కాలక్షేపం.


తెర వెనక ముందు:-

న‌టీన‌టులు: తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్ గౌతమ్‌, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ త‌దిత‌రులు.
ఛాయాగ్రహ‌ణం: మదన్ గుణదేవా
సంగీతం: శివకుమార్
క‌ళ‌: రాజ్కుమార్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: అనురాగ్ పర్వతినేని
నిర్మాతలు: విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ
రచన-దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్