మూతోన్‌ మూవీ రివ్యూ

Published On: October 16, 2020   |   Posted By:

మూతోన్‌ మూవీ రివ్యూ

సరి కొత్త సినిమా టోన్:‘మూతోన్‌’ రివ్యూ

Rating:3/5

ఆహా పుణ్యమా అని మళయాళంలో ది బెస్ట్ అనదగ్గ సినిమాలన్నీ డబ్బింగ్ అయ్యి మనకు అందుబాటులో వస్తున్నాయి. ఇప్పటికే జల్లికట్టు వంటి డిఫరెంట్ థ్రిల్లర్, ఆండ్రాయిడ్ కట్టప్ప వంటి ఎమోషనల్ ఫిల్మ్ లు చూడటం జరిగింది. ఇప్పుడు మరో థ్రిల్లర్ ‘‘మూతన్’’ మన ముందుకు వచ్చింది. అనురాగ్ కశ్యప్ వంటి అభిరుచి ఉన్న దర్శకుడు నిర్మాతగా వచ్చిన ఈ చిత్రం మళయాళంలో ఓ సెన్సేషన్. రిలీజ్ కు ముందే  ప్రతిష్టాత్మకమైన ‘‘న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్’’ లో ‘‘మూతన్’’ సినిమా ఏకంగా మూడు అవార్డులు గెలుచుకుంది.  ఇంత గొప్పగా చెప్పబడుతున్న ఈ చిత్రం కథేంటి…మన తెలుగువాళ్లకు ఎక్కుతుందా…మూతన్ అంటే అర్దం ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

ఇది ముల్ల అనే టీనేజర్ కథ. తమను వదిలేసి వెళ్లిపోయిన తన అన్నయ్య అక్బర్ ని వెతుక్కుంటూ లక్ష ద్వీప్ నుంచి బయిలుదేరతాడు. అన్నయ్యనే అనుకరిస్తూ ,అమితంగా ఇష్టపడే ముల్ల ఆ అన్వేషణలో భాగంగా ముంబై చేరుతాడు. అక్కడ నానా ఇబ్బందులు పడి, చివరకు ఓ టీ కొట్టులో ఉంటూ తన అన్నని ఎలా పట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నా ఉన్నట్టుంది ఓ రోజు కిడ్నాప్ అవుతాడు. అతన్ని కిడ్నాప్ చేసింది..భాయ్. భాయ్ చేసేవన్నీ అక్రమ వ్యాపారాలు. దయ, దాక్షిణ్యం లేని ఓ క్రిమినల్. పిల్లలను ఎత్తుకుపోయి అమ్మేయడం అతని వ్యాపారాల్లో ఒకటి. అయితే ముల్ల గురించి ఓ రోజు అతనికో నిజం తెలుస్తుంది. ఆ ముల్లా మరెవరో కాదు…తనని వెతుక్కుంటూ వచ్చినవాడే అని అర్దం చేసుకుంటాడు  భాయ్ గా మారిన అక్బర్. అయితే అక్కడ నుంచే కథ మరోమలుపు తిరుగుతుంది. జీవిత చక్రం అక్బర్ కు చుక్కలు చూపిస్తుంది. ముల్ల గురించిన మరో నిజం రివీల్ అవుతుంది. తను, ముల్ల ఇద్దరూ ప్రమాదంలో పడతారు. ముల్లకు తన అన్న అక్బర్ దగ్గరకే చేరానన్న విషయం ఎలా తెలుస్తుంది..చివరకు ఏమౌతుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
స్క్రీన్ ప్లే దర్శకత్వం..

ఈ సినిమా స్ట్రెయిట్ నేరేషన్ లో జరుగుతుంది. ఏదీ దాయాలని దాయడు. కానీ కథలో పాత్రలకు తమకు తెలియకుండా కొన్ని రహస్యాలను క్యారీ చేస్తూంటారు. ఆ సీక్రెట్స్ రివీల్ అయ్యినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఆ పాత్రలకు అవి క్యాజువల్ క్రిందే ఉంటుంది. కమర్షియల్ కథను ఆర్ట్ ఫార్మెట్ లో చెప్తే…ఎలా ఉంటుందో అలా ఈ కథ నడుస్తుంది. ఎక్కడా బోర్ కొట్టదు. అలాగని స్పీడుగానూ పరుగెత్తదు. స్లోగా కథ ఒక్కో ముడత సవరించుకుంటూ ముందుకు సాగుతుంది. అదంతా దర్శకుడురాలు రాసుకున్న స్క్రీన్ ప్లే గొప్పతనమే. నిజ జీవితం చూస్తున్న ఫీల్ , అదే సమయంలో ఇంత భయంకరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా అనే కంగారు ఈ సినిమా పుట్టించటంలో సక్సెస్ అవుతుంది. మన మనస్సును రక్కేస్తూ,ఎక్కేయటం ఈ సినిమా స్పెషాలిటీ. అయితే కొత్త తరహా సినిమా చూద్దామనుకునే వాళ్లకే ఈ సినిమా అంతు చిక్కుతుంది. లేకపోతే విసుగిస్తుంది. విరక్తి కలిగిస్తుంది.
 
టెక్నికల్ గా..

ఈ డార్క్ ఫెయిరీ టేల్ ని దర్శకురాలు టెక్నికల్ బ్రిలియన్స్ తో కట్టిపారేస్తుంది. కేవలం కెమెరా, ఎడిటింగ్ వంటి విభాగాలే కాకుండా 24 క్రాప్ట్ లు ఒక్కటై పనిచేసారని కొన్ని సీన్స్ లో డెప్త్ చూసి అనిపిస్తుంది. అయితే సినిమా స్లోగా నడపటమే మనకు కాస్త విసిగిస్తుంది. అయితే ఆర్ట్ తరహా కథనాలకు అలవాటు పడిన వాళ్లకు అదేమీ ఇబ్బందిపెట్టదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మన చెవుల్లో చాలా సేపు మ్రోగుతుంది.  
చూడచ్చా..

విభిన్నమైన సినిమా అదీ డార్క్ షేడ్స్ ఉన్నా ఫరావాలేదు అనుకుంటే సూపర్ ఆప్షన్.
 
తెర వెనక..ముందు

నటీనటులు:
నవీన్‌ పౌలీ, శశాంక్‌ అరోరా, సంజనా దీపు, రోషన్‌ మాథ్యు, శోభితా ధూళిపాళ, మెలిస్సా రాజు థామస్‌,
సినిమాటోగ్రఫీ: రాజీవ్‌ రవి,
మ్యూజిక్‌: సాగర్‌ దేశాయ్‌
స్క్రీన్‌ ప్లే: గీతూ మోహన్‌దాస్‌, అనురాగ్‌కశ్యప్‌,శ్రీజా శ్రీధరన్‌
నిర్మాత: అనురాగ్‌ కశ్యప్‌,
ఎడిటర్‌: బి.అజిత్‌ కుమార్
దర్శకత్వం: గీతూ మోహన్‌దాస్‌
రన్నింగ్ టైమ్ :1గం..50ని
స్ట్రీమింగ్ ఎక్కడ: ఆహా ఓటీటి
విడుదల తేదీ 16-10-2020.