మూవీ రివ్యూ : వర్మ “క్లైమాక్స్”

Published On: June 7, 2020   |   Posted By:

Rating:1/5

వర్మ అంటే ఒకప్పుడు బ్రాండ్. ఇప్పుడు వర్షం కురిసేటప్పుడు వేడి పచ్చి మెరపకాయ బజ్జీలు అమ్ముకుంటే లాభిస్తుందని తెలిసి,ఆ పనిచేస్తున్న రోడ్ సైడ్ బిజినెస్ మ్యాన్. ఏదో ఆ క్షణానికి హాట్ టాపిక్ ఏమి ఉంటే దాని చుట్టూ నాలుగు సీన్స్ అల్లేసి, మీడియాలో కాస్త అల్లరి చేసేసి అమ్ముకుందామని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దృష్టి ఇప్పుడు లాక్ డౌన్ టైమ్ లో మంచి ఊపు మీద ఉన్న ఓటీటిల మీద పడింది. ఆలోచన వచ్చిందే తడువుగా ఆర్జీవి వరల్డ్ అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసారు. క్రైమ్, సెక్స్ కు ఓటీటిలో మార్కెట్ ఎక్కువని ఏకంగా అడల్ట్ ఫోర్న్ స్టార్ మాల్కోవాని రంగంలోకి దింపాడు. ఆమెతో గతంలో సినిమా చేసినప్పుడు షూట్ చేసిన ఓ చిన్న ఫిల్మ్ ని కాస్తంత మసాలా యాడ్ చేసి ఓటీటిలో వదిలాడు. ఈ సినిమా వర్మకు ఎంతవరకూ లాభించిందనేది ప్రక్కన పెడితే..చూసేవారికి ఏమన్నా గిట్టు బాటు అవుతుందా..సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఓ యంగ్ కపుల్ (మియా మ‌ల్కోవా, ఆమె ల‌వ‌ర్‌) ఎంజాయ్ చేయటానికి రాజస్దాన్ థార్ ఎడారి దగ్గరలో ఉండే ఓ మారు మూల ప్రాంతం చేరుకుంటారు.అంత మండిపోయే ఎండలో ఎంజాయ్ చేసేదేముంటుంది..కానీ అది వర్మ తన కథ ప్రకారం ఏర్పాటు చేసిన స్పాట్ కాబట్టి వెళ్లక తప్పదు.అప్పటికీ అక్కడ గోడపై డు నాట్ ఎంటర్ అని రాసి ఉంటుంది. దాన్ని లెక్క చేస్తే కథ ఏముంటుంది అన్నట్లు ధీమాగా లోపలకు వెళ్తారు. పోనీ ఆ వెళ్లిన జంట ఏదో తమ మానాన ఏ హోటల్ కో పోయి దుకాణం పెట్టుకోకుండా ఇసుక తిన్నెల్లో, అక్కడో ఒయాసిస్ ఉంటే అందులోనూ రాసక్రీడలు మొదలెడతారు. ఈ లోగా ఎక్కడి నుంచి వస్తారో అక్కడకి బైక్ రైడింగ్ చేస్తూ ఫారినర్స్ కొందరు,ఇండియన్స్ మరికొందరు వచ్చి వీళ్లను ఓ ఆటాడుకుంటారు. వాళ్ల నుంచి తప్పించుకుని ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇద్దామంటే…అక్కడ నుంచి మరో రకమైన సమస్యలు వస్తాయి. బోయ్ ప్రెండ్ ని చావబాది మాల్కోవాను ఎత్తుకుపోయి చంపేయబోతారు. అప్పుడు ఆ బోయ్ ప్రెండ్ ఏం చేసారు. చివరకు వాళ్లంతా ఎవరు..ఆమెను ఎందుకు చంపాలనుకున్నారు. అసలు ఈ సినిమాకు క్లైమాక్స్ అని పేరు పెట్టడం వెనక ఏదన్నా అర్దం ఉందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది…

”అసహజమైన విషయాలను మనం ఎక్స్ ప్లెయిన్ చేయలేం. ఒకవేళ ఎక్స్ ప్లెయిన్ చేయగలిగితే అది అసహజమైనది కాదు” అంటూ మొదట్లోనే వర్మ ఓ కొటేషన్ కొట్టి మనం తిట్టుకోకుండా ఉండాలని ప్లాన్ చేస్తారు. అయితే ఆ కొటేషన్ యొక్క అంతరార్దం తెలియక మొదట మనం ఏదో వర్మ మార్క్ మేధో సూక్తి అనుకుంటాం…క్లైమాక్స్ కు వచ్చేసరికి…ఈ సినిమా గురించి మనకు మొదటే హింట్ ఇచ్చి హెచ్చరించాడని, అది చూసుకోకుండా మనం ఆవేశపడి మరో పది నిముషాల తర్వాత అయినా ఏదైనా అద్బుతం కనపడతుందేమో అని ఆవేశపడ్డాం అని అర్దం అవుతుంది. అప్పటికి ఈ 53 నిముషాల సినిమాల లాంటి వీడియో పూర్తైపోతుంది. వర్మలో ఏ మార్పూ లేదు …ఆయన సినిమాలను నమ్మే మనలోనూ ఏ మార్పు లేక ఈ సారి కూడా మోసపోయాం అనే పచ్చి నిజం తెలుసుకుంటాం.

నిజంగా మాల్కోవాతో ఆయన అద్బుతమైన సినిమా చేసి ఉంటే…ఏ నెట్ ఫ్లిక్స్ కో అమ్మేద్దుడు కదా ఇలా సొంతంగా ఓటీటి పెట్టుకుని రిలీజ్ ఎందుకు చేసుకుంటాడు అనే లాజిక్ ని పట్టుకుంటాం. ఇవన్నీ ప్రక్కన పెడితే మాల్కోవా ఉంది కదా అని ముచ్చడపడిన వాళ్లకు ఈ సినిమా పెద్ద దెబ్బే కొడుతుంది. అలాగే వర్మ సినిమా కదా మినిమం టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి అనుకుందామనుకున్నా కెమెరా వర్క్ తప్ప చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. ఇక ఈ సినిమాకు ఓ కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు వంటివేమీ లేవు. హాలీవుడ్ సీ గ్రేడ్ సినిమాని కాపీ కొట్టి ఈ సినిమా చేసాడని కొద్దిపాటి సినిమా పరిజ్ఞానం ఉన్నవాళ్లకు కూడా తెలిసిపోతుంది. నటీనటులు నటన వంటి విషయాలు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది.

చూడచ్చా

పైరసీ ప్రింట్ లో కూడా చూడటం టైమ్ వేస్ట్ వ్యవహారమే.

ఎవరెవరు

నటీనటులు : మియా మల్కోవా – రెనాన్ సేవరో..ఇంకొందరు కొత్త ఆర్టిస్ట్ లు
సంగీతం : రవి శంకర్
ఛాయాగ్రహణం : అగస్త్య మంజు
నిర్మాత : ఏ కంపెనీ/ఆర్.యస్.ఆర్ ప్రొడక్షన్
రచన – దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ