రహస్యం మూవీ రివ్యూ

Published On: February 1, 2019   |   Posted By:

రహస్యం మూవీ రివ్యూ

‘అభినేత్రి’ పూనింది 

Rating: 1/5 

‘ప్రేమ కథా చిత్రం పుణ్యమా అని తెలుగు సినిమా చాలా ఏళ్లపాటు దెయ్యం కథలతో డబ్బులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది. చిన్న నిర్మాతలకు దెయ్యాలు సినిమాలు ఓ పెన్నిధిలా దొరికాయి. దెయ్యాలను అడ్డం పెట్టి నవ్వుకోవటం వరకూ బాగానే ఉంది కానీ రాను..రాను అవి నవ్వులు పాలవటం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ మధ్యన భయపెట్టి నవ్వించే దెయ్యాలు కాస్తంత రెస్ట్ తీసుకున్నాయి. అయితే చిన్న సినిమాలకు దెయ్యాలే దిక్కు అని భ్రమలో ఉన్నవాళ్లు అదే సక్సెస్ సీక్రెట్ (రహస్యం)గా ఫీలై తీస్తున్నారు. అలా వచ్చిన ఈ ‘రహస్యం’ఎంతవరకూ వర్కవుట్ అయ్యింది. కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథ

డైరక్టర్ అవుదామని జీవితాశయం పెట్టుకున్న రవి (శైలేష్) ఓ షార్ట్ ఫిలిం చేస్తాడు. అది చూసిన ఓ నిర్మాత (రామ సత్యనారాయణ)నుంచి పిలుపు వస్తుంది. నువ్వో హర్రర్ కథ రాయి..డైరక్షన్ ఛాన్స్ ఇస్తాను అని ఆఫర్ ఇస్తాడు. దాంతో హర్రర్ కథ రాయాలని ఫిక్సైన రవి…కథ కోసం దెయ్యాలను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ క్రమంలో ఓ మాంత్రికుడు (జబర్దస్త్ అప్పారావు) ని కలుస్తాడు. అక్కడ వీళ్లకు దివ్య (రితిక) పరచయం అవుతుంది. ఆమె ఓ దెయ్యం. నీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇమ్మంటుంది. వీళ్లు వదలించుకుందామని ప్రయత్నిస్తే ఫలితం ఉండదు. దాంతో వేరే దారి లేక  ఆ దెయ్యంతో సినిమా చేస్తాడు. ఇంతకీ ఆ దెయ్యం ఫ్లాష్ బ్యాక్ ఏమిటి..దానికి ఈ సినిమా పిచ్చ ఏమిటి…వెళ్లి ఏ రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్ వెనకో పడి ఆఫర్ ఇమ్మనక ..ఈ కొత్త దర్శకుడు సినిమాలో నటిస్తాననటం ఏమిటి…నిర్మాతకు ఆ దెయ్యానికి ఏదన్నా కథ ఉందా వంటి విషయాలు  తెలియాలంటే సినిమా చూడాల్సిందే.    

విషయం ఉందా

ఈ చిత్రం చూస్తూంటే అమధ్యన ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్ లో వచ్చిన ‘అభినేత్రి’ (తమిళంలో దేవి) గుర్తుకు రాక మానదు. ఆ సినిమాలో స్టోరీ లైన్ తీసుకుని ఈ సినిమా చేసినట్లు అనిపిస్తుంది. అయితే దానికి తెలుగు దెయ్యం కళ  అంటించేసరికి లోకల్ దెయ్యం కథ అయ్యిపోయింది.
అలాగే దెయ్యాలు..వాటికో సమస్యలతో కూడిన ప్లాష్ బ్యాక్ ఉండటం, చివరకు హీరో వాటి సమస్యలు తీర్చటం  అనే స్టోరీ లైన్ లు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. దెయ్యాలు కూడా ఇంట్రస్ట్ చూపని లైన్ ఇది. అయితే దెయ్యాల సినిమాకు ఇదే సక్సెస్ ఫుల్ ఫార్ములా అని నమ్మి నిర్మాత, దర్శకుడు ముందుకు వెళ్ళారు. అయితే సినిమా పరమ బోర్ గా సాగుతుంది. కొత్తదనం ఏమి పెద్దగా ఉండదు. కొత్త ఆర్టిస్ట్ లతో ఈ సినిమా చాలా కష్టంగా అనిపిస్తుంది. 

టెక్నికల్ గా

ఈ సినిమాలో కథ,కథనానికి తగ్గట్లే టెక్నికల్ వ్యాల్యూస్ పూర్ గా ఉన్నాయి. ఉన్నంతలో సినిమాటోగ్రాఫర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. శైలేష్ లో దర్శకుడు కన్నా నటుడు బాగున్నాయి. నిర్మాణ విలువలు ..రామసత్యనారాయణ గత చిత్రాల స్దాయిలో ఉన్నాయి.   

ఎవరెవరు

నటీనటులు : శైలేష్ , శ్రీ రితిక, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జబర్దస్త్ ఫేమ్ అప్పారావు త‌దిత‌రులు.
దర్శకత్వం : సాగర్ శైలేష్
నిర్మాత : తుమ్మలపల్లి రామసత్యనారాయణ.
సంగీతం : కబీర్ రఫీ