రెడ్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక

Published On: January 14, 2021   |   Posted By:
రెడ్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక
 
”నేను మా పెదనాన్నతో కలిసి చాలా సినిమాలు చేశాను. అయితే  స్టేజీ మీద ఆయన గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడాలనిపిస్తోంది. నా దృష్టిలో ‘రెడ్‌’ చిత్రానికి రియల్‌ హీరో మా పెద్దనాన్న గారు. కరోనా టైం లో వచ్చిన ఇబ్బందులనన్నిటినీ తట్టుకున్నారు . ‘రెడ్‌’  చిత్రాన్ని ఈ రోజూ థియేటర్లవరకు తీసుకురావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఈ చిత్రాన్ని చంటి బిడ్డలా కాపాడుతూ వచ్చారు. అందుకే ఈ చిత్రానికి ఆయనే హీరో. నిజంగా నా ఎనర్జీ అంతటికీ కారణమైన నా అభిమానులకి, నా 15 ఏళ్ళ  కేరీర్ లో నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ  అందరికీ థాంక్స్. ఈ నెల 14న రెడ్ మూవీని థియేటర్లలో తప్పక చూడండి” అని ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ అన్నారు.
 
ఆయన ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రెడ్‌’. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై రూపొందిన చిత్రమిది. కృష్ణ పోతినేని సమర్పిస్తున్నారు. ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మాత. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు.
 
ఈ నెల 14న విడుదల కానున్న ‘రెడ్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత స్రవంతి రవికిశోర్‌, రామ్‌తో ఉన్న అనుబంధాన్ని ఆత్మీయంగా పంచుకున్నారు. 
 
దర్శకుడు త్రివిక్రమ్  మాట్లాడుతూ “ఈ చిత్రంలో పని చేసిన సాంకేతిక నిపుణులకి, నటీనటులు అందరికీ శుభాకాంక్షలు. ఈ నెల 14న రెడ్ థియేటర్లలో విడుదల కానుంది, తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే చూడాల్సిందిగా కోరుతున్నాం. ‘దేవదాస్’ చిత్రంలో రామ్‌ని చూశాక, రవికిశోర్‌గారితో ‘అబ్బాయి మెరుపు తీగ లాగా ఉన్నాడు’ అని అన్నాను. సిల్వర్‌స్క్రీన్‌ మీద రామ్‌ చలాకీతనాన్ని చూసిన తరువాత అతన్ని ఎనర్జిటిక్ స్టార్ గా అభిమానులు పిలుచుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం లో రామ్‌ చేసిన పాత్రలో నటించడం అంత ఈజీ కాదు.  స్క్రీన్‌ మీద పాత్ర అలా కనిపించడానికి, బ్యాక్‌ గ్రౌండ్‌లో హీరో చాలా కృషి చేయాలి. ఎంతో ఎనర్జీ కావాలి. చూసినంత సులువు కాదు అలాంటి పాత్ర చేయడం. రవికిశోర్ గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. ఖాళీగా ఉన్న నాతో స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి చిత్రాలు రాయించి నా కేరీర్ మార్చేసిన నిర్మాత రవికిశోర్‌గారు. ఆయనతో నాలుగు చిత్రాలు చేసే అదృష్టం ఇచ్చినందుకు ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మూవీ మేకింగ్‌కి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ లో పనిచేయడానికైనా ఆయన ఇష్టపడతారు.. ఇంత ప్యాషన్ ఉన్న వ్యక్తి పరిశ్రమలో ఉండాలి.  ఆయనకి గొప్ప విజయాలు దక్కాలి. అలా విజయాలు వస్తుంటేనే మరిన్ని చిత్రాలు చేయాలన్న కోరిక, హుషారు వస్తుంది. ఒక స్క్రిప్ట్ ని మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు  అంత బలంగా చదివే వ్యక్తులు నేను చూసింది ఇద్దరే, రామానాయుడు గారు, రవికిశోర్ గారు. అలాంటి వాళ్ళ దగ్గర  నా కేరీర్ మొదట్లోనే పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి అనుభూతిని, ప్రయాణాన్ని, సినిమా జీవితాన్ని నాకు నేర్పినందుకు వాళ్లకు మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను. 25 ఏళ్ళ కుర్రాడిగా… డబ్బుని పోగు చేసుకుని ఒక కథ అనుకుని లేడీస్ టైలర్ అనే చిత్రాన్ని తీశారు రవికిశోర్‌గారు.  నాయకన్ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయడాన్ని గమనిస్తే ఆయనకున్న అభిరుచి అర్థమవుతుంది. అప్పటి నుంచీ, ఇప్పటిదాకా ప్రేక్షకులకు మంచి కథలు చెప్పాలి అన్న తాపత్రయం, తపన ఉన్న వ్యక్తి అయన. రామ జోగయ్య శాస్త్రి లాంటి రచయితల నుండి ఎంతో మంది సాంకేతిక నిపుణులకి అండగా ఉండి ముందుకి నడిపించిన వ్యక్తి ఆయన. ఒక సంస్థ పేరు ఇంటి పేరు అయ్యిందంటే ఎంతో డెడికేషన్ ఉండాలి. ఇంకెన్నో సంవత్సరాలు ఇంకెంతో మంది ప్రతిభని ఆయన ఇలాగే ప్రోత్సాహించాలని, రామ్ కొడుకుని కూడా రవికిశోర్‌గారే లాంచ్ చేయాలని… సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఇలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల కిషోర్ చిత్రాలు నేను చూసాను, చాలా పొదుపుగా షాట్లు తీస్తాడు. జీవితం పట్ల చాలా నిబద్దత ఉన్న వాళ్ళకే అది అలవడుతుంది. ఇప్పటి వరకు వచ్చిన విజయాలకంటే రెడ్ ఇంకొక మెట్టు ఎక్కిస్తుందని  ఆశిస్తున్నాను. రవికిశోర్‌గారిలాంటి మంచి సంస్కారం ఉన్నవాళ్లు సినిమాలు తీయడం ఆపకూడదు. రామ్ ఇంకా చాలా సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమాలు ఇంకెన్నో చేయాలనీ, చేస్తాడని కోరుకుంటున్నాను” అని చెబుతూ రవికిశోర్ గారి కాళ్ళకి నమస్కరించారు.
 
హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ ” పరిశ్రమలో రచయితలంటే నాకు చాలా గౌరవం. నువ్వు నాకు నచ్చావ్ చిత్రం డైలాగులు నాకు మా పెద్దనాన్న రవికిశోర్ గారు చెప్పార. వాటిని వింటున్నప్పుడే  సినిమా చూసేయాలని పించింది, అప్పటికీ నాకు ఆ చిత్రం గురించి ఏది తెలీదు. ఒక ప్రేక్షకుడి లో అంత ఇష్టాన్ని ప్రభావితం చేయగల ప్రతిభ రచయితకి ఉంటుందని అర్ధమైంది. నాకు రచయితల మీద గౌరవం పెరిగింది త్రివిక్రమ్గారి వల్లే అని చెప్పొచ్చు. ఈ చిత్రం నాకు చాలా మంచి, కొత్త అనుభవాన్నిచ్చింది. నాయిక అమృత ఇందులో చాలా ముఖ్యమైన పాత్రలో యాక్ట్ చేసింది.  చాలా అద్భుతంగా చేసింది. మాళవిక శర్మ చాలా బాగా చేసింది. తడమ్‌ చూసినప్పుడు ఆ పోలీస్‌ కేరక్టర్‌కి నివేదా పేతురాజ్‌ పర్ఫెక్ట్ గా సరిపోతుందని అనుకున్నాం.  ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నందుకు తనకి చాలా థాంక్స్. అందమైన విజువల్స్ ని ఇచ్చిన సమీర్ రెడ్డి గారికి చాలా థాంక్స్. కిషోర్ తిరుమల గారు థ్రిల్లర్ తీస్తున్నారు అంటే అందరూ షాక్ అయ్యారు. కానీ నేను… సినిమా టీజర్ చూశాక, అందరూ  ఆశ్చర్యపడతారు అనుకున్నాను, అదే జరిగింది. ఆయన మంచి మాస్ చిత్రం కూడా తీయగలరు అంతటి ప్రతిభ ఉన్న సరస్వతి పుత్రుడు. ఏ జానర్ ఇచ్చినా, ఎలాంటి కథ ఇచ్చినా పాత్రకి కథనాలు రాయమన్నా రాయగలడు. ముందు ముందు ఇంకా చాలా పెద్ద చిత్రాలు తీయాలని మళ్ళీ ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. చిత్రంలో పనిచేసిన నిపుణులు, నటులందరికి చాలా థాంక్స్. వేరే లెవల్  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు, మంచి పాటలు ఇచ్చినందుకు మణిశర్మగారికి చాలా చాలా థాంక్స్. ఈ చిత్ర హీరో మా పెద్దనాన్న గారు. కరోనా టైం లో వచ్చిన ఇబ్బందులనన్నిటిని ఓర్చుకున్నారు.  ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లవరకు తీసుకురావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఈ చిత్రాన్ని చంటి బిడ్డలా కాపాడుతూ వచ్చారు. అందుకే ఈ చిత్రానికి ఆయనే హీరో. నిజంగా నా ఎనర్జీ అంతటికీ కారణమైన నా అభిమానులకి, 15 ఏళ్ళ  కేరీర్ లో నాకు తోడుగా ఉన్న మీ అందరికీ థాంక్స్. ఈ నెల 14న రెడ్ థియేటర్లలో విడుదలవుతుంది. తప్పక చూడండి” అని అన్నారు.
 
హీరోయిన్ మాళవిక శర్మ మాట్లాడుతూ ” రెడ్ థియేటర్లలో విడుదలవుతుంది అనే ఊహ చాలా బాగుంది. ఈ చిత్రంలో భాగమవ్వడం చాలా ఆనందంగా ఉంది. స్రవంతి రవికిశోర్ గారు నన్ను తెలుగు కుటుంబంలోకి స్వాగతం అనడం ఇంకా గుర్తుంది. నాకూ కుటుంబం కలిసి పనిచేస్తున్నట్టే అనిపించింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్.  అందమైన ‘మహిమ’ పాత్ర ఇచ్చినందుకు, ఆ పాత్రని అర్ధం చేసుకునేలా చేసినందుకు, నాకు సినిమా అంతటా సహాయంగా ఉన్నందుకు కిశోర్‌గారికి చాలా థాంక్స్. రామ్ కి, చిత్ర యూనిట్ కి మరియు నా కో-స్టార్స్ అందరికి ధన్యవాదాలు” అన్నారు.
 
హీరోయిన్ నివేదా పేతురాజ్ మాట్లాడుతూ “రెడ్ నా మనసుకి చాలా నచ్చిన చిత్రం. కథ వినకుండానే కిషోర్ తిరుమల గారి కథనాల మీద ఉన్న నమ్మకం తో చిత్రం చేయడానికి ఒప్పుకున్నాను. రామ్ తో కలిసి పనిచేస్తున్నాను అని తెలిసినపుడు చాలా సంతోషంగా అనిపించింది. పాత్ర కోసం ఆయన చాలా కష్టపడతారు, ఆయనకి వచ్చిన స్థానానికి పూర్తిగా అర్హుడు. అలాగే ఆయన స్థాయి ఇంకా ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. ఒక కుటుంబంతో కలిసి పనిచేసినట్టే అనిపించింది. మాళవిక కి, అమృతకి ముందు ముందు చాలా అద్భుతమైన కెరీర్ ఉంది. ఈ నెల 14న అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే అందరూ రెడ్ చూడండి” అన్నారు.
 
హీరోయిన్ అమృతా అయ్యర్ మాట్లాడుతూ, ” థియేటర్లు మళ్ళీ మొదలయినందుకు చాలా సంతోషంగా  ఉంది. నా పాత్రని చాలా అద్భుతంగా రాసినందుకు, నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తిరుమల కిషోర్ గారికి ధన్యవాదాలు. మా చిత్రం రెడ్ ని ఈ నెల 14న థియేటర్లలో తప్పకుండా చూడండి” అన్నారు.
 
దర్శకుడు తిరుమల కిషోర్ మాట్లాడుతూ, “ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రవికిశోర్ గారికి, అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన డి. ఓ. పి సమీర్ గారికి, సంగీతం అందించిన మణి శర్మ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి ధన్యవాదాలు. ఈ చిత్రం కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, జనవరి 14న  థియేటర్లలో చూడండి” అన్నారు.
 
 వేడుక లో ఛాయాగ్రాహకులు సమీర్‌ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్‌.ప్రకాష్‌,  ఎడిటర్ జునైద్‌, చిత్ర సమర్పకులు  కృష్ణ పోతినేని తదితరులు పాల్గొన్నారు .