సంజనరెడ్డిగా వస్తున్న రాయ్ లక్ష్మి

Published On: April 1, 2019   |   Posted By:

సంజనరెడ్డిగా వస్తున్న రాయ్ లక్ష్మి

తమిళంలో రాయ్ లక్ష్మి నటించిన ఒంబదులే గురు చిత్రం ఇప్పుడు తెలుగులో సంజనరెడ్డి పేరుతో అనువాదమైంది. పి.టి. సెల్వకుమార్ దర్శకుడు. వాణీ వెంకటరమణ సినిమాస్ పతాకంపై నిర్మాత రవీంద్ర కల్యాణ్  తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 5న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టీజర్ ను సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఫిలిం చాంబర్ కార్యదర్శి సాయివెంకట్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరింపజేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. 

మరో అతిథిగా విచ్చేసిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాత రవీంద్ర కల్యాణ్ లో మంచి దర్శకుడు కూడా ఉన్నారు. గతంలో ఆయన తెలుగులో పెద్ద సినిమానే ప్లాన చేశారు. అయితే కాలం కలిసి రాకపోవడంతో చెన్నైకు వెళ్లారు. అక్కడ దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. కొన్ని సినిమాలను తెలుగులోకి అనువదించారు కూడా.  ఈ చిత్రం ఆయనకు మరింత పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మతం ఉంది అని అన్నారు. నిర్మాత రవీంద్ర కల్యాణ్ మాట్లాడుతూ, 120 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. రొమాంటిక్ కామెడీ, యాక్షన్ అంశాలతో సాగే చిత్రమిదని అన్నారు. ఇందులో సంజన రెడ్డి పాత్రలో రాయ్ లక్ష్మి అద్భుతమైన నటనను కనబరిచిందని చెప్పారు. ఇదే బేనర్ లో తన దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. 

మాటల రచయిత శ్రీసాయి మాట్లాడుతూ, భార్యాబాధితులైన నలుగురు స్నేహితులు బ్యాచిలర్ జీవితమే బావుంటుందని అనుకుంటారు. ఆ క్రమంలో ఆ నలుగురు ఒకరికి తెలియకుండా ఒకరు సంజన (రాయ్ లక్ష్మి)ని ప్రేమిస్తారు. ఈ పరిణామంతో సంజన ఓ డాన్ లా వారికి ఎలా గుణపాఠం చెబుతుంది అన్న అంశంతో చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.కస్తూరి, నూనె రంగనాయకులు వాయాల శ్రీనివాసరావు, సహ నిర్మాతలు బాదినేని వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.