సత్వం షార్ట్  ఫిలిం రివ్యూ

Published On: July 28, 2021   |   Posted By:
సత్వం షార్ట్  ఫిలిం రివ్యూ
 


‘ నాన్న అంటే భయం కాదు,నాన్న అంటే నాకొక బలం.ప్రతి ఒక్కరికి నాన్న ఒక బంధం..భాధ్యత…’ ఇలాంటివి ఫాదర్స్ డే రోజు స్టేటస్ లుగా పెట్టుకోవటానికి బాగుంటాయి. కానీ నిజ జీవితంలోకి వస్తే అలాంటి నాన్నలు ఎంతమంది ఉంటారు. అంటే చాలా మంది చేతులెత్తుతారు. చాలా మంది తల దించుతారు. జీవితంలో ప్రతీ సారి ఆ సందిగ్దత వస్తూంటుంది. చిన్నప్పుడు బుడి బుడి నడకలు అప్పుడు సపోర్ట్ ఇచ్చిన నాన్న పెద్దయ్యాక మన ప్రతీ పనిలోనూ మనకు సపోర్ట్ గా ఉంటాడా…మన ఆలోచనలకు మద్దతు ఇస్తాడా…మా నాన్న ఆ రోజు కాస్త సపోర్ట్ ఇచ్చి ఉంటే …అని చాలా మంది వాపోతూంటాం. అది అర్దం చేసుకోవటంలో సమస్య కావచ్చు..అర్దం కాని సమస్య కావచ్చు.

మధు(రంజిత్) కు కూడా అదే సందిగ్దావస్ద లో పడతానని ఏ రోజు అనుకోని ఉండదు. కానీ జీవితం అతని చేతిలో లేదు. తండ్రికు యాక్సిడెంట్ తో తను మొదలెడదామనుకున్న స్టార్ట్ అప్ మూలన పడింది. దాంతో తండ్రికి అండంగా, కుటుంబానికి ఆలంబనగా నిలబడ్డాడు. ఏ అర్దరాత్రో హఠాత్తుగా మెలకవ వచ్చినప్పుడో లేక తన స్నేహితులు తనలాంటి ఆలోచనలో ముందుకు వెళ్తున్నప్పుడో ఖచ్చితంగా ఆ ఆలోచన గుర్తు వచ్చి కలుక్కుమనే ఉంటుంది. అయితే ఆవేదనని ఆలోచనలతో దాచేసే మనస్తత్వం అలవోకగా అబ్బేసి ఉంటుంది. తెలివైన వాడు కదా. ఏదైనా స్పీడుగా నేర్చుకోగలడు..తీరిగ్గా సంభంధాలను పునర్వించుకోగలడు. అయితే అతను చేద్దామనుకున్న పని…చేయలేకపోయానేగా మారుతున్న ప్రాసెస్ లో ఆ విషయం తండ్రి గ్రహించగలిగితే…అదే దర్శకుడు ‘సత్వం’ లో చెప్పే ప్రయత్నం చేసాడు. అయితే అది ప్రయత్నంగానే ఉండిపోయిందని చెప్పాలి. షార్ట్ ఫిలిం..కంటెంట్ లోనూ షార్ట్ గానే ఉండిపోయింది. ఏ ఎమోషన్ ని పూర్తి గా రిజిస్టర్ చేయలేకపోయింది. షార్ట్ ఫిలిం చూసాక…నిజమే కదా ..మన జీవితంలోనూ ఇలాంటి ఓ రోజు వచ్చిందనే జ్ఞాపికను ఈ షార్ట్ ఫిలిం అందించలేకపోయింది. దర్శకుడు మేకింగ్ మీద, షాట్స్ మీద పూర్తి దృష్టి పెట్టారే కానీ..ఫీల్ ని రిజిస్టర్ చేయలేకపోయారు. తండ్రి,కొడుకుల మధ్య బాండ్ ఎస్టాబ్లిష్ చేయకుండా ఈ ప్లాట్ క్లైమాక్స్ ని పండించలేదు. ఆ పరిణితి స్క్రిప్టులో మిస్సైంది.

 కొన్ని సంవత్సరాలు ఒకే ఇంట్లో జీవితాలను పంచుకున్న వ్యక్తులలో కూడా ఒకరి గురించి మరొకరికి తెలిసేది తక్కువే. ఒక మనిషి గురించి తెలుసుకోవడం అంటే వారి అలవాట్లు, ఆలోచనలు కాదు వారి భావాలు అర్థం కావాలి.  మన స్పందనలు వారికి తెలిసిపోతాయనే విషయం టచ్ చేస్తే బాగుండేది.  తండ్రి,కొడులు  జీవితాలు ఒక్క క్షణం ఒక గాటున నిలిచిన ఫీలింగ్‌ కలుగిస్తే ఓ అద్బుతం జరిగేది.  నాన్న ఆస్ది మనకు ముఖ్యం కాదు,అలాంటి నాన్న లని కలిగి ఉండడమే పెద్ద ఆస్తి అనిపించాలి. ఓవరాల్ గా ఇదీ కథ అని మెదడుకు అర్దమయ్యే చెప్పగలిగాడు కానీ మనస్సులో ముద్రవేయలేకపోయాడు. కొంచెం అటూ ఇటూ గా చెప్పాలంటే డైరక్టర్ టచ్ మిస్సైంది. భావోద్వాగలతో సీన్స్ పండించే గాఢత కరువైంది.

టెక్నికల్ గా ఈ షార్ట్ ఫిలిం మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. కెమెరా వర్క్ బాగుంది. రాత్రిపూట వర్షం కురిసేటప్పుడు స్ట్రీట్ లైట్ వెలుగుని చూపే షాట్ మాత్రం హైలెట్. అలాగే షాట్స్ లో క్యాజువాలిటీ (ఎక్కడా కావాలనిషాట్స్ పెట్టినట్లు ఉండకపోవటం) డైరక్టర్ ప్రతిభపై గౌరవం పెంచుతాయి. ఆర్టిస్ట్ లలో రంజిత్ కుమార్, తండ్రిగా చేసిన శ్రీనివాస్ భోగిరెడ్డి బాగా చేసారు. రీరికార్డింగ్ బాగుంది. డైలాగులు జస్ట్ ఓకే. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది.నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా ఓ డౌట్…కొడుకు స్టార్ట్ అప్ పెడతానంటున్నాడు కాబట్టి…ఉద్యోగం వదిలేయ్..నేను సపోర్ట్ చేస్తా అంటున్నాడు తండ్రి. అదే తండ్రి ..నాన్నా నేను సినిమా ఫీల్డ్ కు వెళ్ధామనుకున్నది మానేసాను అదే నా గోల్ … అంటే అదే విధంగా సపోర్ట్ చేస్తాడా…ఏమో అప్పుడు ఆలోచనలో పడతాడేమో.. ఎనీహౌ…బెస్టాఫ్ లక్ టు టీమ్


నటీనటులు: శ్రీనివాస్(తండ్రి),శ్రీనివాస్ భోగిరెడ్డి, మధు(కొడుకు,రంజిత్, సరళ(తల్లి),రమణి కీర్తన(స్నేహితురాలు),దివ్య నర్ని రాజేష్ (స్నేహితుడు),విష్ణు వర్ధన్
ఛాయాగ్రహణం:సింఘం మోహిత్ కృష్ణ
 కథ :కనక వెంకటేష్ బి.
రచన: యన్. సి. దీవెన
 ఆర్ట్ డైరక్టర్:కశ్మీర ప్రభాకర్ సంత్
సౌండ్ డిజైన్:అశ్విన్ రాజశేఖర్
నిర్మాత:ప్రశాంత్  యెర్రమిల్లి
డైరక్టర్, రైటర్, ఎడిటర్:అఖిల్ డేగల