సినిమానే ఇంటిపేరు..అది చెప్తేనే గుర్తు పట్టేరు

Published On: May 5, 2020   |   Posted By:

ఈధర నరేష్ నటించిన సినిమా సుడిగాడు టీవిలో వస్తోంది చూసారా..
అదేంటి…అది అల్లరి నరేష్ నటించిన సినిమా కదా..మధ్యలో ఈ ఈధర నరేష్ ఎవరూ…
బాబూ…ఈధర నరేష్ అతని అసలు పేరు..ఈధర అనేది ఇంటిపేరు…
అదేంటి అల్లరి కాదా అతని ఇంటి పేరు..
ఇలా చాలా మంది ఆర్టిస్ట్ లు అసలు ఇంటి పేర్లతో చెప్తే అసలు గుర్తు పట్టడం కూడా కష్టమనిపిస్తుంది. తమ తొలి సినిమానే ఇంటి పేరు గా మార్చుకున్న కొందరి లిస్ట్ ని సరదాగా గుర్తు చేసుకుందాం…అవునా…నిజమా …నిజమే కదా అని అనక మారరు..లెటజ్ స్టార్ట్

1 అల్లరి నరేష్

ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఈవీవి సత్యనారాయణ కుమారుడైన నరేష్ .. మొదటి సినిమా అల్లరి (రవిబాబు డైరక్టర్, ఆయన పేరు కూడా అల్లరి రవిబాబు అయ్యిందనుకోండి). ఆ సినిమా హిట్ అవటంతో …అల్లరి నరేష్ అయ్యిపోయింది.

2 వెన్నెల కిషోర్

ప్రముఖ దర్శకుడు దేవకట్టా దర్శకుడుగా లాంచ్ అవుతూ వచ్చిన చిత్రం వెన్నెల. ఆ సినిమాలో కమిడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు బొక్కల కిషోర్ కుమార్ . అందులో అతని పాత్ర ఖాధర్ జనాలకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దాంతో ఆటోమేటిక్ గా ఆ తర్వాత అతని పేరు వెన్నెల కిషోర్ అయ్యిపోయింది.

3 చిత్రం శ్రీను

ప్రముఖ దర్శకుడు తేజ మొదటి సినిమా చిత్రంతో పరిచయం అయిన శ్రీనివాసులు…ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో వరస ఆఫర్స్ వచ్చాయి. ఇండస్ట్రీ గుర్తు పెట్టుకోవటం కోసం అతన్ని చిత్రం శ్రీను గా మార్చేసింది.

4 సత్యం రాజేష్

సూర్య కిరణ్ దర్శకుడుగా పరిచయం అవుతూ తీసిన సినిమా సత్యం. సుమంత్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో రాజేష్ బాబు అనే కుర్రాడుకి మంచి క్యారక్టర్. అది బాగా క్లిక్ అయ్యింది. అంతకు ముందు మూడు సినిమాలు చేసినా ఎవరు పట్టించుకోలేదు కానీ ఈ సినిమా క్లిక్ అవటం తో ఎవరూ అతను అని ఎక్వైరీలు మొదలయ్యాయి. ఆ తర్వాత నుంచి అతని పేరు ముందు సత్యం రాజేష్ అనేది వచ్చి చేరింది.

5 శుభలేఖ సుధాకర్

ప్రముఖ దర్శకుడు విశ్వనాధ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన శుభలేఖ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుధాకర్ కి శుభలేఖ ఇంటి పేరుగా మారిపోయింది. ఆ సినిమా ఘన విజయం సాధించటంతో అందరూ శుభలేఖ సుధాకర్ అని పిలవటం మొదలెట్టారు.

6 ఆహుతి ప్రసాద్

కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన ఆహుతి సినిమా పెద్ద హిట్. ఆ సినిమాతో పరిచయం అయిన అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్ కూడా సూపర్ హిట్. దాంతో అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్ ఇంటి పేరు ఆహుతిగా మారిపోయింది.

7 సాక్షి రంగారావు

ప్రముఖ దర్శకుడు స్వర్గీయ బాపు దర్శకత్వంలో 1967 లో వచ్చిన సాక్షి సినిమాలో నటించిన రంగవఝుల రంగారావు కు చాలా పెద్ద పేరు వచ్చింది. అందరూ ఆ సాక్షిలో చేసిన రంగారావు ఎక్కడ అని ఎంక్వైరీలు మొదలెట్టారు. అలా సాక్షి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రంగారావు సాక్షి రంగారావుగా మారిపోయారు.

8 మహర్షి రాఘవ

ప్రముఖ దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా అందరికీ గుర్తే. ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాఘవ మహర్షి రాఘవగా మారిపోయారు. రాఘవ అంటే ఎవరూ గుర్తు పట్టరు. మహర్షి రాఘవ అంటేనే అందరికీ తెలుస్తుంది.

9 షావుకారు జానకి

1949 లో షావుకారు అనే సినిమా ద్వారా జానికి వెండితెరకి పరిచయమయ్యారు. ఇందులో ఆమె పోషించిన సుబ్బులు పాత్ర బాగా క్లిక్ అయ్యింది. దాంతో అప్పటి నుంచి ఆమెను షావుకారు జానకి అని పిలవటం మొదలెట్టారు.

10 కిక్ శ్యామ్

ఓ తమిళ నటుడు తెలుగులో ఓ సినిమా చేసి, ఆ సినిమానే ఇంటి పేరుగా మారటం ఆశ్చర్యం అనిపిస్తుంది. అతనే తమిళ నటుడు శ్యామ్ సుధీమ్ ఇబ్రహీం .అతను రవితేజ హీరోగా వచ్చిన కిక్ సినిమాలో పోలీస్ అధికారిగా చేసి క్లిక్ అయ్యాడు. దాంతో కిక్ శ్యామ్ గా మారిపోయారు.

11 దిల్ రాజు

వి.వెంకట రమణా రెడ్డి అనే వ్యక్తి సినిమా ఫీల్డ్ కు వచ్చి ప్రముఖ నిర్మాత దిల్ రాజు అయ్యాడంటే నమ్మబుద్ది కాదు. వివి వినాయిక్, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన దిల్ సినిమా హిట్ అవటంతో అప్పటిదాకా ఆయన స్క్రీన్ నేమ్ ..రాజు కాస్తా దిల్ రాజు అయ్యింది. ఆ తర్వాత ఎంన్ని హిట్స్ వచ్చినా అదేంటో దిల్ రాజు అనేది స్దిర పడిపోయింది.

12 బొమ్మరిల్లు భాస్కర్

భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బొమ్మరిల్లు పెద్ద హిట్. సిద్దార్ద్ హీరోగా వచ్చిన ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరూ భాస్కర్ ని బొమ్మరిల్లు భాస్కర్ అని పిలవటం మొదలెట్టారు. అలా తన తొలి చిత్రం పేరు తన ఇంటిపేరుగా మారిపోయింది.

13 ఠాగూర్ మధు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వివి వినాయిక్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఠాగూర్. ఆ సినిమాని బి. మధు నిర్మించారు. అయితే ఆ సినిమా తర్వాత ఆయనకు ఠాగూర్ మధుగా ఇంటిపేరు మారిపోయింది.

14 “సుత్తి” జంట

ఇక ఆ తరం నటుల్లో …తను చేసిన క్యారక్టర్ పేరు తన ఇంటిపేరుగా మారిన కమిడియన్స్ ఇద్దరు ఉన్నారు..వాళ్లు
“సుత్తి” వేలు, “సుత్తి” వీరభద్రం అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆ పాత్రలు జనాల్లోకి వెళ్లిపోయాయి.

15 జోష్ రవి

నాగ చైతన్య హీరోగా వచ్చిన జోష్ చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా… అందులోని రవి అనే కుర్రాడు చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అతని ఇంటిపేరు జోష్ రవిగా మారిపోయి కంటిన్యూ అయిపోతోంది.

అదండీ మ్యాటర్..ఇంకా ఇలాంటి వాళ్లు చాలా మంది ఉండే ఉంటారు. మాకు గుర్తున్నంతవరకూ మేము ఇన్ఫో ఇచ్చాం. మీకు గుర్తుకొచ్చనవి ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి.