సైరా నరసింహారెడ్డి ట్రైల‌ర్‌ విడుద‌ల

Published On: September 19, 2019   |   Posted By:
సైరా నరసింహారెడ్డి ట్రైల‌ర్‌ విడుద‌ల
 
 
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి`. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ లెవ‌ల్లో ప్యాన్ ఇండియా మూవీగా సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌సాద్ ల్యాబ్స్ అధినేత ర‌మేశ్ ప్ర‌సాద్‌, నిర్మాత రామ్‌చర‌ణ్‌, డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
 
ఈ సంద‌ర్భంగా జరిగిన పాత్రికేయుల స‌మావేశంలో.. 
 
`సైరా న‌ర‌సింహారెడ్డి`లో నిజ‌మెంత‌?  ఫిక్ష‌న్ ఎంత‌?
 
సురేంద‌ర్ రెడ్డి:  మాకు దొరికిన ఆధారాల‌ను బ‌ట్టి సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని చేశాం. క‌థ‌లో భాగంగా.. క‌థ డిమాండ్ చేయ‌డంతోనే అమితాబ్‌గారిని, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తిగారిని తీసుకున్నాం. 
 
 
ఈ సినిమా కోసం చేసిన రీసెర్చ్‌ను సినిమాగా ఎలా మ‌లిచారు?
 
సురేంద‌ర్ రెడ్డి:  న‌ర‌సింహారెడ్డిగారి గురించి సినిమా స్టార్ట్ చేయ‌డానికి ముందు చాలా త‌క్కువ‌గా తెలుసు. 6 నెల‌లు పాటు రీసెర్చ్ చేశాను. పుస్త‌కాలు చ‌దివాను. ఇప్పుడు నంద్యాల ఎంపీ బ్ర‌హ్మానంద‌రెడ్డిగారు రేనాటి సూర్య‌చంద్రులు అనే ట్ర‌స్ట్‌కి ఆయ‌న అధ్య‌క్షుడు. ఆయ‌న్ని క‌లిసి చాలా విష‌యాలు తెలుసుకున్నాను. ఆయ‌న‌పై ఉన్న ఉన్న పుస్త‌కాన్ని నాకు బ్ర‌హ్మానంద‌రెడ్డిగారు ఇస్తూనే అప్ప‌టి గ‌వ‌ర్న‌మెంట్ రిలీజ్ చేసిన ఓ స్టాంప్‌ను కూడా ఇచ్చారు. మ‌ద్రాస్‌కెళ్లి గెజిట్స్ తీసుకొచ్చి రీసెర్చ్ చేశాం. అందులోని కొన్ని ఆధారాలు.. నేను తెలుసుకున్న ఆధారాల‌ను ఆధారంగా చేసుకుని సినిమా చేశాను. 
 
 
చిరంజీవి లుక్‌, యాక్ష‌న్ పార్ట్ విష‌యంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు?
 
రామ్‌చ‌ర‌ణ్‌:  లుక్‌కి సంబంధించి ఆర్ట్ డైరెక్ట‌ర్ రాజీవ‌న్‌గారు, ఆయ‌న టీమ్ చాలా కేర్ తీసుకుని అద్భుతంగా చేశారు. ఆయ‌న‌పై చేసిన డిజైన్స్ చ‌క్క‌గా కుదిరాయి. 
 
 
ప‌వ‌న్ క‌ల్యాణ్ వాయిస్ ట్రైల‌ర్‌కే ప‌రిమిత‌మా?
 
రామ్‌చ‌ర‌ణ్‌:  సినిమాలో కూడా ఉంటుంది
 
 
సురేంర్‌రెడ్డితో ఈ సినిమా చేయాల‌నే న‌మ్మ‌కం ఎప్పుడు వ‌చ్చింది?
 
రామ్‌చ‌ర‌ణ్‌:  సురేంద‌ర్ రెడ్డిగారు సినిమాల్లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పార్ట్ బాగా ఉంటుంది. అయితే ధృవ చేసిన త‌ర్వాత ఆయ‌న ఇన్‌టెన్స్ సినిమా కూడా చేయ‌గ‌ల‌ర‌ని అర్థ‌మైంది. అదే న‌మ్మ‌కంతో ముందుకెళ్లాం. 
 
 
మీరు డైరెక్ట్ చేయాల‌ని అనగానే మీకేమ‌నిపించింది?
 
సురేంద‌ర్ రెడ్డి:  నేను నిజంగా ఊహించ‌లేదు. నేను నిర్ణ‌యం తీసుకోవ‌డానికి 15 రోజులు స‌మ‌యం అడిగాను. ఇంత బ‌డ్జెట్‌లో చిరంజీవిగారితో ఈ స్కేల్ మూవీ చేయ‌గ‌ల‌నా? అని ఆలోచించుకోవ‌డానికి ఆ స‌మ‌యం తీసుకున్నాను. అప్పుడు నాకు చిరంజీవిగారు మాత్ర‌మే క‌న‌ప‌డ్డారు. ఆయ‌నెంత క‌ష్ట‌ప‌డి ఎంత ఎత్తుకు ఎదిగార‌నేదే క‌న‌ప‌డింది. ఆయ‌న ఇన్‌స్పిరేష‌న్‌, చ‌ర‌ణ్‌గారు వెన‌క ఉన్నార‌నే ధైర్యంతోటే ముందుకు వెళ్ల‌గలిగాను. 
 
 
సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా చేయ‌డానికి కార‌ణ‌మేంటి?
 
రామ్‌చ‌ర‌ణ్‌: ఇది నాన్న‌గారు 10 ఏళ్ల నుండి చేయాల‌నుకుంటున్న సినిమా. క‌రెక్ట్ స‌మ‌యంలో, క‌రెక్ట్ బ‌డ్జెట్‌తో చేసిన సినిమా. ఇది నాన్న‌గారి కోరిక‌. 
 
 
ఇంత ప్రెస్టీజియ‌స్ సినిమాలో చిరంజీవితో మీరు ఎందుకు న‌టించ‌లేక‌పోయారు?
 
రామ్‌చ‌ర‌ణ్‌:  అక్టోబ‌ర్ 2 ఎప్పుడొస్తుందా? అని ఓ నిర్మాత‌గా ఎదురుచూస్తున్నాను. మా టీమ్ అంద‌రం ప‌నిచేసిన తీరు చూసి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాకు నిర్మాత‌గా అవ‌కాశం ద‌క్క‌డ‌మే ఎక్కువ‌. 
 
 
నిర్మాత‌గా ఈ సినిమా చేయ‌డం ఎంత క‌ష్ట‌మ‌నిపించింది?
 
రామ్‌చ‌ర‌ణ్‌:  చాలా క‌ష్ట‌మ‌నిపించింది. నాన్న‌గారికి కావాల్సిన సినిమా చేయ‌డ‌మే కాదు.. క‌థ‌కు కావాల్సిన సినిమా కూడా చేయాల్సిన అవ‌స‌రం ఉంది. నాన్న‌గారు, ప‌రుచూరిగారు క‌లిసి చేసిన ఆలోచ‌న‌. అది తెర‌పైకి రావాలంటే డ‌బ్బులో, ద‌ర్శ‌కుడో ఉంటే స‌రిపోదు. చాలా రెస్పెక్ట్‌తో చేయాలి. చాలా ప్యాష‌న్‌తో చేయాలి. అదే గౌర‌వంతో సినిమా చేశాం. 
 
 
సినిమాలో విషాద‌మైన ముగింపు పెట్టామ‌నే టెన్ష‌న్ ఉందా?
 
సురేంద‌ర్ రెడ్డి:  ఇది చ‌రిత్ర‌.. న‌ర‌సింహారెడ్డిగారు త‌న జీవితాన్ని త్యాగం చేశారు. త‌న త్యాగంతో ఆయ‌న విజ‌యం సాధించారు. ఈ సినిమాకు అదే విక్ట‌రీ. ఈ సినిమాకున్న ప్ల‌స్ పాయింట్ అదే. 
 
 
ఈ సినిమా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేయ‌వ‌చ్చున‌ని అనుకుంటున్నారు?
 
రామ్‌చ‌ర‌ణ్‌:  నిజంగా నేను అవ‌న్నీ ఆలోచించి ఖ‌ర్చు పెట్టి ఈ సినిమా చేయ‌లేదు. చిరంజీవిగారు, సూరిగారు ఏద‌డిగితే తెర‌పై క‌న‌ప‌డాల‌ని ఖ‌ర్చు పెట్టాను. అస‌లు డ‌బ్బులు వ‌స్తుందా?  రాదా?  అని ఆలోచించ‌లేదు. చాలా ప్యాష‌నేట్‌గా సినిమా చేశాను. 
 
 
ఉయ్యాల‌వాడ కుటుంబీకులు ఆందోళ చేస్తున్నారు కదా?
 
రామ్‌చ‌ర‌ణ్‌:  సుప్రీమ్ కోర్టు ఆదేశాల‌నుసారం 100 ఏళ్ల త‌ర్వాత ఓ వ్య‌క్తి జీవితం చ‌రిత్ర క్రింద‌కు వెళ్లిపోతుంది. దాన్ని సినిమాగా తీయాలంటే గౌరవంగా తెర‌కెక్కించాలి. ఎలాంటి స‌మ‌స్య‌లుండ‌వు. మంగ‌ల్‌పాండే గారి జీవిత చ‌రిత్ర‌ను తెర‌కెక్కించేట‌ప్పుడు చ‌రిత్ర‌లో 65 సంవత్స‌రాలుంటే చాల‌న్నారు.  న‌ర‌సింహారెడ్డిలాంటి వ్య‌క్తిని ఓ కుటుంబానికి ప‌రిమితం చేయడం నాకు న‌చ్చ‌లేదు. ఆయ‌న దేశం కో్సం పోరాడారు. ఆయ‌న ఉయ్యాల‌వాడ అనే ప్రాంతం కోసం పోరాడారు. ఆ ఊరు కోస‌మో, జ‌నాల కోస‌మో చేస్తాను. న‌లుగురు వ్య‌క్తుల‌కో, ఓ కుటుంబానికో స‌పోర్ట్ చేయ‌ను. అలా చేసి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి స్థాయిని నేను త‌గ్గించ‌ను. 
 
 
లేటెస్ట్ టెక్నాలజీ ఈ సినిమా మేకింగ్‌కు ఎంత మేర ఉప‌యోగ‌ప‌డింది?
 
సురేంద‌ర్ రెడ్డి:  నిజంగా టెక్నాల‌జీ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. ఇదొక పీరియాడిక్ మూవీ. ప‌దేళ్ల క్రితం చేసుంటే 500 కోట్ల రూపాయ‌లు పెట్టి చేసుండాలి. అంత క్వాలిటీతో కూడా చేసుండేవాళ్లు కారేమో. ఇప్పుడున్న టెక్నాల‌జీతో చేయ‌డ‌మే బెట‌ర్ అయ్యింది. 
 
 
`బాహుబ‌లి`తో ఇండియాలో ప్యాన్ ఇండియా మూవీస్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమాకు ఎలాంటి రికార్డులు ఎక్స్‌పెక్ట్ చేయ‌వ‌చ్చు?
 
సురేంద‌ర్ రెడ్డి: ఇది రికార్డ్స్ కోస‌మో.. ఓ సినిమాను చూసో ఈ సినిమా చేయ‌లేదు. చ‌ర‌ణ్‌గారు న‌న్ను ఒక‌టే అడిగారు. `మా డాడీకి నేనొక పెద్ద గిఫ్ట్ ఇవ్వాల‌నుకుంటున్నాను. ఆయ‌న 150 సినిమాలు చేశారు. అందులో నెంబ‌ర్ వ‌న్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి ఉండాల‌ని, హిస్ట‌రీలో ఆయ‌న పేరు ఉండిపోవాలి` అనే చెప్పి సినిమాను స్టార్ట్ చేశారు. స‌ద్దుదేశంతో మెగాస్టార్ చిరంజీవికి గిఫ్ట్ ఇవ్వాల‌ని మంచి సంక‌ల్పంతో చేసిన సినిమా కాబ‌ట్టి సినిమా ఆ రేంజ్‌కు వెళుతుంద‌నుకుంటున్నాను. 
 
 
నిర్మాత‌గా ప్యాన్ ఇండియా సినిమాను ఓ ఫ్రాఫిట‌బుల్ మూవీ చేయ‌డానికి ప్యాష‌న్‌, రెస్పెక్ట్ సరిపోతుంద‌ని అనుకుంటున్నారా?
 
రామ్‌చ‌ర‌ణ్‌: ఏదైనా ఆలోచ‌న‌తోనే ప్రారంభ‌మ‌వుతుంది. ముందు మ‌న ఆలోచ‌న‌లు స‌రిగ్గా, స్వ‌చ్ఛంగా ఉండాలి. ఎక్క‌డ తీశాం, ఎలా తీశామ‌ని యాడెడ్ వేల్యూ అవుతాయి. బెస్ట్ టెక్నిషియ‌న్స్‌, పెద్ద స్టార్ క్యాస్ట్ అంద‌రూ ఉన్నారు. ఇవన్నీ ప‌క్క‌న పెడితే నేను ఎవ‌రితో అసోసియేట్ అయినా వారు ఆలోచ‌న ఎలా ఉందో చూస్తాను. మంచి ఆలోచ‌న ఉన్న వారితోనే క‌లిసి ప‌నిచేస్తాను. అలాంటి స్వ‌చ్ఛ‌మైన ఆలోచ‌న‌తోనే ఈ సినిమాను తీశాం. 
 
 
ఇంత క్రేజీ కాంబినేష‌న్స్ ఎలా సాధ్య‌మ‌య్యాయి?
 
రామ్‌చ‌ర‌ణ్‌:  ఈ సినిమాకు చిరంజీవిగారు స‌గం బ‌ల‌మైతే.. ఈ సినిమాలో ప‌నిచేయ‌డానికి వ‌చ్చిన ప్ర‌తి స్టార్ ఆయ‌న‌తో స్క్రీన్ స్పేస్ తీసుకోవాల‌నుకున్నారు. సినిమాకున్న బ‌లం. న‌ర‌సింహారెడ్డిగారికి ఉన్న బ‌ల‌మే చిరంజీవిగారిని, అంద‌రినీ క‌లిపిఈ సినిమాను చేసేలా చేసింది. 
 
 
సినిమాలో ఎంత మేర‌కు లిబ‌ర్టీ తీసుకున్నారు?
 
సురేంద‌ర్ రెడ్డి:  న‌ర‌సింహారెడ్డిగారి జీవితం చాలా గొప్ప‌ది. ఆయ‌న చేసిన పోరాటం.. ఆయ‌న చేసిన త్యాగం  చాలా గొప్ప‌ది. ఆయ‌న్ని ఉరి తీసి .. త‌ల న‌రికి 30 ఏళ్ల పాటు ఆయ‌న త‌ల‌ను కోట గుమ్మానికి వేలాడ‌దీశారంటే న‌ర‌సింహారెడ్డిగారు ఎంత‌లా భ‌య‌పెట్టి ఉంటారో క‌దా. అంత‌క‌న్నా క‌మ‌ర్షియ‌ల్ ఏముందో. స్టార్టింగ్‌లో ఏ స్టార్స్‌ను తీసుకురావాలో మేం అనుకోలేదు. స్క్రిప్ట్ డిమాండ్ చేసింది. న‌ర‌సింహారెడ్డి పాత్ర చేసిన చిరంజీవిగారికి గురువు కావాలి. మాకు అమితాబ్‌గారు త‌ప్ప ఎవ‌రూ క‌న‌ప‌డ‌లేదు. ఆ విష‌యాన్ని చిరంజీవిగారికి చెబితే ఆయ‌న వ‌ల్ల అమితాబ్‌గారు చేశారు. అలాగే ఇత‌ర స్టార్స్ అంద‌రూ చిరంజీవిగారితో చేయాలని అనుకుని ప‌నిచేశారు. క్యారెక్ట‌ర్ డిమాండ్ మేర‌నే ప్ర‌తి ఒక్క‌రినీ తీసుకున్నాం.