హీరోయిన్ నూరిన్ ఇంటర్వ్యూ

Published On: December 30, 2019   |   Posted By:
సత్య ప్రకాష్, గురురాజ్ గారి  ‘ఊల్లాల ఊల్లాల’ చిత్రంతో తెలుగులో పరిచయం అవ్వటం నా అదృష్టం – హీరోయిన్ నూరిన్
 
‘లవర్స్ డే’ ఫేమ్ ఎ.గురురాజ్ సుఖీభవ మూవీస్ పతాకంపై సీనియర్ నటుడు సత్యప్రకాష్ దర్శకత్వంలో నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా జనవరి 1 న విడుదలకి సిద్ధంగా ఉన్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. ఈ సందర్భంగా హీరోయిన్ నూరిన్ విలేకర్లతో మాట్లాడుతూ…
 
“ఊల్లాల ఊల్లాల” చిత్రం కథ, అందులో మీ రోల్ ఎలాంటిది?
 
తెలుగులో నా మొదటి చిత్రం “ఊల్లాల ఊల్లాల”. లవర్స్ డే తెలుగులో డబ్బింగ్ అయ్యాక  ఇక్కడి వాళ్ళు నాపై చాలా అభిమానం చూపించారు. “ఊల్లాల ఊల్లాల” పూర్తిగా వినోదాన్ని పంచుతూ ప్రేక్షకులకి కావలసిన థ్రిల్లింగ్, కామెడీ, ప్రేమ, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ఉన్నసినిమా. పల్లెటూరు నేపథ్యమున్న అమ్మాయి నూరి గా ఈ చిత్రంలో హీరో నటరాజ్ ని పిచ్చిగా ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తాను.
 
మీరు ఒక చిత్రం ఒప్పుకోవడానికి ఎలాంటి అంశాలని చూస్తారు?
 
50 % కమిట్మెంట్ మిగితా 50 % మూవీ టీం. “ఊల్లాల ఊల్లాల” మాత్రం గురురాజ్ గారిపై నమ్మకంతో ఒప్పుకున్నాను. అలాగే విలన్ పాత్రల్లో చాలా పాపులర్ అయిన సత్యప్రకాష్ గారు మొదటి సారి దర్శత్వం చేయడం, కన్నడ, తెలుగులో ఎన్నో చిత్రాలకి పని చేసిన యూనిట్  “ఊల్లాల ఊల్లాల” కి పనిచేయడం నా పాత్రకి ప్రాధాన్యమున్న కథ దొరకటం ఇలాంటి ఎన్నో అంశాలున్నాయి.
 
సీనియర్ నటుడైన సత్యప్రకాష్ గారు దర్శకత్వం చేసిన మొదటి చిత్రంలో మీరు నటించడం ఎలా అనిపించింది?
 
ఒక నటుడిగా మరియు దర్శకుడిగా ఉండటం నిజంగా మాలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను పరిశ్రమకి కొత్త, నటించేటప్పుడు చాలా చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి, వాళ్ళలా అనుభవం ఉన్నవాళ్లు ఉంటే చాలా  ఉపయోగపడుతుంది. ఆయన దర్శకత్వంలో కూడా, నటులకు ఎక్కడక్కడ స్ట్రెస్ ఉంటుంది అనేది ఆయనకి తెలుసు  పైగా తెలుగు భాష నాకు రాదు, అది కొంచెం, కొంచెం కూడా కాదు చాలానే కష్టం, ఒక భావాన్ని అర్ధం చేసుకోవటానికి, దానికి తగ్గట్టు నటించటానికి ఒక నటుడిగా నన్ను అర్ధం చేసుకుని ఆ పరిస్థితులలో తనే నాకు సాయం చేశారు. సీన్ కి తగ్గట్టు ఎమోషన్ రావటానికి చాలా సాయపడ్డారు. ఏం ఫీల్ అవుతున్నాను అనేది తెలుసుకొని మరి సీన్ కి తగ్గట్టు పరిస్థుతలని వివరించేవారు చాలా టిప్స్ ఇచ్చేవాళ్ళు, కెమెరాని ఫేస్ చేయటానికి, సరైన ఎమోషన్ని పండించటానికి, ఆడియన్స్ కి నచ్చేలా నటించటనికి ఆ చిన్న చిన్న విషయాలు నేర్పేవాళ్లు. ఆయన దర్శకత్వంలో   నటించడం అనేది నిజంగా గొప్ప అనుభవం, ఎందుకంటే తెలుగు లో ఇది నా మొదటి సినిమా, ఈ విధంగానే నా గ్రాఫ్ అనేది తెలుసుకోగెలను, ఒక మంచి దర్శకునితో చాలా సంతోషంగా ఉంది.
 
సత్యప్రకాష్ గారి అబ్బాయి కూడా మొదటి సారి తెలుగులో పరిచయమవుతున్నారు, ఆయనతో నటించడం ఎలా అనిపించింది?
 
నటరాజ్ కన్నడలో ఇంతకుముందే సినిమాలు చేసిన తెలుగులో తనకి కూడా ఇదే మొదటి చిత్రం. తను సత్యప్రకాష్ గారి కొడుకు అని మొదట్లో తెలియదు ఎందుకంటే సెట్ లో వాళ్ళు ఒక నటుడు ఒక దర్శకుడు ఉన్నారు అన్నట్టుగా ఉంటారు. అంతకుమించి వేరే సెట్ లో తన కొడుకే నటిస్తుంది అనేలాంటి అనుబంధం వారిద్దరి మధ్య సెట్లో కనిపించదు. సెట్ లో నటించేటప్పుడు నేనెక్కడైనా పొరపాటు చేస్తే, నూరిన్ కంగారు పడకు మరో టేక్ చేద్దాం అని చెప్పేవారు అదే విధం గా నటరాజ్ తో కూడా అనేవాళ్లు. చాలా రోజులకు తెలిసింది వాళ్లిదరు నిజంగానే తండ్రీకొడుకులని, వారిద్దరూ  సెట్లో అంత ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళు.
 
ఈ చిత్ర పోస్టర్లలో గుర్రం బాగా వాడుతున్నారు, దాంతో ఏం చెప్పాలనుకుంటున్నారు?
 
అది సస్పెన్స్ గా ఉంచాలనుకుంటున్నారు, సినిమా చూస్తే మీకే అర్ధమవుతుంది.
 
లవర్స్ డే లాగే ఈ చిత్రంలో కూడా మీరు ఇంకొక హీరోయిన్ తో నటిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది?
 
లవర్స్ డే లో నా రోల్ అందరితో కలిపి కథలో భాగంగా ఉంటుంది,  “ఊల్లాల ఊల్లాల” లో నాకు అంకితకి పూర్తిగా వేరే వేరే సన్నివేశాలు ఉంటాయి. ఏ సీన్లోనూ నేను అంకిత ఒకే చోట కనిపించము.
 
లవర్స్ డే ఫలితం మీకెలా అనిపించింది?
 
నా వరకు లవర్స్ డే షూటింగ్, రిలీజ్ కి ముందు రిలీజ్ తరువాత పరిస్థితుల నుండి మేము చాలా నేర్చుకున్నాము. రిలీజ్ టైం లో చాలా వివాదాలు జరిగినా, క్లైమాక్స్ మారిపోయినా మా వరకు ఆ చిత్రం చాలా ఆవకాశాలకి దారి చూపింది. ఫలితం అనేది ఎలా ఉన్నా ఎవరి అభిప్రాయం వారికి ఉందిగా, నా వరకు లవర్స్ డే నాకు చాలా నచ్చిన చిత్రం.
 
ఈ చిత్రం మీ కెరీర్ కి ఎంత హెల్ప్ అవుతుందనుకుంటున్నారు?
 
నాకు డాన్స్ చేయడం ఇష్టం, లవర్స్ డే లో నా ప్రతిభ చూపించడానికి అంతలా అవకాశం దొరకలేదు. “ఊల్లాల ఊల్లాల” కి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆయన ఆధ్వర్యంలో పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ చిత్రంలో నా డాన్స్ కి, ఫైట్స్ కి, నటనకి గుర్తింపు వచ్చి  నా కోసం పాత్ర రాసిన కథలు వస్తే చాలు అనుకుంటున్నాను.
 
చిత్ర షూటింగ్ లో మీరు ఎన్ని రోజులు నటించారు, సెట్ లో మీ అనుభవాలేంటి?
 
నేను మొత్తం 15 రోజులు ఈ చిత్రంలో నటించాను, మధ్యలో ఒక రోజు మొత్తం కేవలం నా సీన్లు మాత్రమే తీశారు. చాలా బిజీ షెడ్యూల్ అవ్వడం వల్ల సెట్ లో మిగితా వాళ్లతో మాట్లాడే, సమయం గడిపే అవకాశం లభించలేదు. కానీ షూటింగ్ లో బాంగా మదనపల్లికి వెళ్ళినపుడు చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ చిత్రం మొత్తం పూర్తయ్యాక, ఆ ప్రాంతంతో నాకు తెలీకుండానే ఒక అనుబంధం ఏర్పడింది అనిపించింది.
 
తెలుగు మరియు మలయాళ చిత్ర పరిశ్రమల మధ్య తేడాలు ఏం గమనించారు?
 
మలయాళంలో తెలుగు లో ప్రేమ ఒక్కటైనా తెలుగులో, హీరోయిన్లకిచ్చే గౌరవం చాలా నచ్చింది. నూరిన్ గారు అని పిలుస్తుంటే వారికి నాపై ఉన్న గౌరవంతో కూడిన ఆప్యాయత కనిపించింది, అది మాత్రమే రెండు పరిశ్రమలలో ఉన్న చిన్న తేడా అనిపించింది.
 
మీ లుక్ కొంచం నిత్యా మీనన్ లా అనిపిస్తుంది, తనపై మీ అభిప్రాయం?
 
నాకు నిత్యా మీనన్ అంటే చాల ఇష్టం. తను మలయాళం నటి అయినా తెలుగులోనే ఆమె ఎక్కువ సినిమాలు చేశారు.
 
నిర్మాత గురురాజ్ గారి రెండవ చిత్రంలో కూడా నటించడం ఎలా అనిపిస్తుంది?
 
ఆయన కుటుంబం టోన్ సెట్ లోకి వస్తారు, నిర్మాతని అన్న దర్పం చూపివ్వరు. నాతోనే కాదు నటరాజ్ కానీ, సత్యప్రకాష్ గారితో కానీ చాలా ఆత్మీయతతో ఉండేవారు, చాలా జాగ్రత్తగా చూసుకునేవారు.
 
మీకు నచ్చిన హీరో & హీరోయిన్?
 
హీరో ఐతే అల్లు అర్జున్ గారే ఆయనంటే చాలా ఇష్టం నాకు, హీరోయిన్లలో నయనతార గారంటే చాలా ఇష్టం. మామూలు నటి నుండి లేడి సూపర్ స్టార్ రేంజ్ కి ఆమె ఎదిగిన తీరు మాలాంటి కొత్త వాళ్లకు చాలా స్ఫూర్తినిస్తోంది, ఇంకా ఎంతో సాధించాలన్న పట్టుదలనిస్తుంది. 
 
తెలుగులో మీరు ఏ హీరోతో నటించాలనుకుంటున్నారు?
 
నాకు అందరూ ఇష్టమే కానీ అల్లు అర్జున్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ ని కాబట్టి ఆయనతో నటించాలని కల ఐతే ఉంది కానీ నేనింకా అంత ఎదగలేదు అనుకుంటున్నాను.
 
లవర్స్ డే తరువాత కొత్త చిత్రలేవైనా అంగీకరించారా?
 
ఆ చిత్రం తరువాత ధమాకా అనే మలయాళం చిత్రం చేస్తున్నాను, భాగమతి హీరో ఉన్ని ముకుందన్ గారితో ఒక చిత్రం చేస్తున్నాను. అలాగే ఇక్కడి కథలని కూడా వింటున్నాను. ప్రస్తుతం చేస్తున్న తమిళ మరియు మలయాళం చిత్రాలు  పూర్తయ్యాక మిగితావాటి గురించి ఆలోచిస్తాను.
 
తెలుగులో మీరు ఎలాంటి రోల్స్ కోసం చూస్తున్నారు?
 
ఇలాగే ఉండాలని ఏది లేదు, ఇంతే వ్యవధి నేను కనపడాలని కూడా కాదు, నేను చేసిన పాత్ర లో నన్ను నా నటనని గుర్తుంచుకునేలా ఉండే ఏ పాత్ర ఉన్న కథైనా చేయడానికి నేను సిద్ధం.
 
తెలుగు మాట్లాడ్డం నేర్చుకుంటున్నారా?
 
మొదట్లో నాకు అస్సలు అర్ధమయ్యేది కాదు, ఇప్పుడు కొద్దిగా అర్ధమవుతుంది. కొన్ని కొన్ని పదాలు వచ్చు,  త్వరలోనే పూర్తిగా తెలుగు మాట్లాడ్డం నేర్చుకుంటాను.