Mr మజ్నుచిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

Published On: January 22, 2019   |   Posted By:

Mr మజ్నుచిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్

Mr మజ్ను’ డెఫినిట్ గా పెద్ద హిట్ అవుతుంది. అఖిల్‌ విల్‌ బికమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్‌ యాక్టర్స్ – ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ చిత్రాల  నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ మజ్ను’.

ఈ చిత్రం  జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సందర్భంగా  ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌ జె ఆర్ సి కన్వెన్షన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ విడుదల చేసిన ‘Mr మజ్ను’ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాక విడుదలైన 3 గంటల్లోనే 1  మిలియన్ వ్యూస్, 12  గంటల్లో 2 మిలియన్ వ్యూస్, 15 గంటల్లోపే 3 మిలియన్ వ్యూస్  సాధించి దూసుకెళ్తోంది.

ఇదే వేదిక పై ‘Mr మజ్ను’ తొలి టికెట్‌ను కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కోనుగోలు చేశారు. టికెట్ అందుకుంటున్నప్పుడు ఎన్టీఆర్‌ స్వయంగా జేబులోనుంచి 2 వేల నోటు తీసి నాగార్జున చేతికి ఇచ్చి ఈ టికెట్ కొనడం విశేషం. ఈ సందర్భంగా…

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ – ”ఎన్టీఆర్‌ మా పెద్ద పెద్దబ్బాయి. తను నన్ను ఎంతో ఆప్యాయంగా బాబాయ్‌ అని పిలుస్తుంటాడు. అలా అన్నప్పుడల్లా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వేడుకకి వచ్చినందుకు తారక్‌కి థాంక్స్‌. అఖిల్‌, తారక్‌ నుండి యాక్టింగ్‌ తో పాటూ మాస్‌ నేర్చుకోవాలి. బివిఎస్ఎన్‌ ప్రసాద్‌ గారికి నిర్మాతగా 25వ సినిమా. ఇండస్ట్రీలో ‘మగధీర’, ‘అత్తారింటికి దారేది’ వంటి రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఆయన ప్రొడక్షన్‌లో అఖిల్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. తమన్‌ తాతగారు ఘంటసాల బలరామయ్యగారు, ఎక్కడో నాన్నగారిని రైల్వేస్టేషన్‌లో చూసి ఆర్టిస్ట్‌గా పనికొస్తావని చెన్నైకు తీసుకెళ్లారు. తమన్‌ ఈ సినిమాకు పని చేయడం చూస్తుంటే ఓ సర్కిల్‌ పూర్తయినట్లుగా ఉంది. వెంకీ అట్లూరి, మా సినిమాలను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యి ఇక్కడకు వచ్చాడని తెలిసింది. తొలిప్రేమ సినిమా  చూశాను. లవ్‌స్టోరీకి ఏ అంశాలు కావాలో వెంకీ బాగా తెలుసు. నవ్వించడం, ఏడిపించడం, ప్రేమించడం వెంకీకి  బాగా తెలుసు. పాటలు బావున్నాయి. కొన్ని సీన్స్‌ చూశాను. చాలా బావున్నాయి. సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది. మజ్ను టైటిల్‌ నాన్నగారి టైటిల్‌.. తర్వాత నా దగ్గరికి వచ్చింది. ఆ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో, ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ – ”నాగార్జునగారిని నేను బాబాయ్‌ అని పిలిస్తే.. ఆయన నన్ను అబ్బాయ్‌ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఇక్కడకు గెస్ట్‌లా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిలా వచ్చాను. ఇక్కడ కేవలం బాబాయ్‌, చైతు, అఖిలే కాకుండా సినిమాకు పనిచేసిన చాలా మంది నాకు చాలా కావాల్సిన వాళ్లు. ఆ వరుసలో ముందుగా బివిఎస్ఎన్‌ ప్రసాద్‌ గారు ఉంటారు. ఓ మంచి సినిమా తీయాలంటే నిర్మాతకు వ్యామోహం ఉంటే సరిపోదు. వ్యాపారం కూడా తెలిసి ఉండాలి. వ్యాపారం తెలిస్తే, ఓ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి?. దాన్ని ఎలా మార్కెట్‌ చేయాలి? అది హిట్‌ అయిన తర్వాత మనం కూడా ఎలా డబ్బులు సంపాదించుకోవాలి? అనేది తెలుస్తుంది. వ్యామోహం ఉన్నప్పుడు ఈ సినిమాను ఎంత అద్భుతంగా తెరకెక్కించాలి. ప్రేక్షక దేవుళ్లకు అందించాలనేది తెలుస్తాయి. కాబట్టి నిర్మాతకు వ్యామోహం, వ్యాపారం రెండూ తెలియాలి. నేను ఈ బ్యానర్‌లో ‘ఊసరవెళ్లి’, ‘నాన్నకు ప్రేమతో’  రెండు సినిమాలు చేశాను. ‘ఊసరవెళ్లి’ సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. ‘నాన్నకు ప్రేమతో’ నాకు బాగా దగ్గరైన సినిమా. ప్రసాద్‌గారిని చాలా దగ్గరగా గమనించాను. ఆయనకు వ్యాపారం తెలియదు. సినిమా అంటే ఆయనకు వ్యామోహం. అదే ఆయనలో గొప్ప లక్షణం. సంపాదించిన ప్రతి రూపాయిని తిరిగి చలనచిత్ర సీమకే అందించే గొప్ప నిర్మాత. అలాంటి నిర్మాత పది కాలాల పాటు సుఖంగా ఉండాలి. పది కాలాల పాటు మంచి చిత్రాలను మనకు అందిస్తూ సంతోషంగా ఉండాలి. ‘ప్రసాద్‌గారు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండీ’.. అంటే. ‘పర్లేదు బాబు.. ఇది కాకపోతే మరో సినిమా. నా జీవితం సినిమా ఇండస్ట్రీకే అంకితం’ అని చెప్పిన వ్యక్తి ఆయన. ఇలాంటి నిర్మాత సుఖంగా పది కాలాల పాటు ఉండి మరిన్ని మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. “మిస్టర్‌ మజ్ను”అనే సినిమా ఆయన కెరీర్‌లో మైలురాయి కావాలి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్‌ ఉండేవాళ్లు. వాళ్ళలో వెంకీ ఒకడు. తను నాకొక నటుడిగా పరిచయం. తర్వాత రచయితగా పరిచయం. తర్వాత దర్శకుడిగా పరిచయమైయ్యాడు. నేను వెంకీకి కూడా చెప్పని మాట ఒకటుంది. తను నటుడిగా చేశాడు, రైటర్‌ అంటున్నాడు.. ఇప్పుడు దర్శకుడు అంటున్నాడు. నాకు తనలో చిన్న కన్‌ఫ్యూజన్‌ కనపడేది. తను రాణించకపోతే ఏం చేస్తాడు? అనే బెరుకు, భయం ఉండేది. అందుకు కారణం తను నాకు బాగా కావాల్సిన వ్యక్తి. సుదీర్ఘమైన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. ఎందరో ఎన్నో ప్రేమకథలు రాశారు… నటించారు. మళ్లీ ప్రేమకథ అంటున్నాడు. ‘తొలిప్రేమ’అనే టైటిల్‌ను పెట్టుకున్నాడు. కొత్తగా ఏం చూపిస్తాడనే టెన్షన్ ఉండేది. తొలిప్రేమ చూసిన తర్వాత తనను చూసి గర్వపడ్డాను. ఆషామాషీ విషయం కాదు. ఫైట్స్‌ ,  డ్యాన్సులు పెట్టి కమర్షియల్‌ సినిమా చేయడం కంటే కేవలం కథా బలంతో, నటీనటుల బలంతో ఓ కథను తెరకెక్కించడం చాలా కష్టమైన పని. తొలి చిత్రంతో అది సాధించాడు. తను ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. వెంకీ జీవితంంలో ఎంతో సాధించాలి. సాధిస్తాడు. అయితే “మిస్టర్‌ మజ్ను”తన కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుంది. అలాగే ‘బృందావనం’ చేసే సమయం నుండి తమన్‌తో పరిచయం ఉండేది. తనతో ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేశాను. తన చుట్టూ చాలా నెగిటివిటీ ఏర్పడింది. అది చూసి నాకు చాలా బాధ కలిగేది. ఎందుకంటే తన పొటెన్షియల్‌ ఏంటో నాకు తెలుసు. ‘దేవుడా! తనకు ఏదో ఒకరోజు ఓ అవకాశం రావాలి. తను కదంతొక్కుకుంటూ పైకి రావాలి’ అని అనుకుంటున్న సమయంలో ‘తొలిప్రేమ’ సినిమా వచ్చింది. తర్వాత ‘అరవింద సమేత’లో తనతో దగ్గరగా ఉండి పనిచేసినప్పుడు తమన్‌ ఇక వెనక్కి తిరిగి చూడడనిపించింది. అందుకు ఇప్పుడు” మిస్టర్‌ మజ్ను” మరో ఉదాహరణ. తమన్‌ ఫెంటాస్టిక్‌ మ్యూజిక్‌ అందించాడు. తను ఇంకా గొప్ప చిత్రాల్లో పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇక నా తమ్ముడు అఖిల్‌ గురించి చెప్పాలంటే.. ఓ నటుడికి ముఖ్యంగా కావాల్సిన ఆత్మ విమర్శ గుణం అఖిల్‌లో ఉన్నట్లు ఎవరికీ ఉండదు. ఆత్మ విమర్శ చేసుకోవాలంటే దమ్ముండాలి. ఎన్నోసార్లు తనని తాను ఆత్మ విమర్శ చేసుకుంటూ, తనని తాను మార్చుకుంటూ, తన పంథాని తాను మార్చుకుంటూ ఈ మజిలీకి చేరాడు. ఈ రోజు నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ‘అఖిల్‌ విల్‌ బికమ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్‌ యాక్టర్స్’. నేను కూడా మీ అందరితో పాటు ఆరోజు కోసం వెయిట్‌ చేస్తుంటాను. ఆరోజు ఎంతో దూరంలో లేదు. దగ్గర్లోనే ఉంది. అది మిస్టర్‌ మజ్ను అనే చిత్రంతో తెలుస్తుంది. ఈ చిత్రం, అఖిల్‌ కెరీర్‌లో ఒక గొప్ప చిత్రంగా మిగలాలి అని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బివిఎస్ఎన్‌ గారికి వెనుక ఉండే బాపినీడు, నా ఆప్తమిత్రుడు, నాకెంతో కావాల్సిన వ్యక్తి.  వాళ్ళ నాన్నకి వెనక తోడుగా ఉండేది మా బాపినీడే.   ఈ సినిమా అద్భుత చిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు” అన్నారు.

అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ – ”వెంకీ అట్లూరి అఖిల్‌కు చాలా చక్కటి టైటిల్‌ పెట్టాడు. తను ఫైట్స్‌ బాగా చేస్తాడు. డ్యాన్సులు బాగా చేస్తాడని మనకు తెలుసు. తనని పూర్తి స్థాయి లవ్‌స్టోరీలో చూడాలని ఉండేది. తన బాడీ లాంగ్వేజ్‌కి లవ్‌స్టోరీస్‌ చక్కగా సూట్‌ అవుతుందనిపించింది. ఇప్పుడు వెంకీ అలాంటి లవ్‌స్టోరీ చేశాడు. యంగ్‌ డైరెక్టర్స్‌ తొలి సినిమాతో ఓ మార్క్‌ని సెట్‌ చేసుకుంటారు. గత ఏడాది వెంకీ ‘తొలిప్రేమ’తో అలాంటి మార్క్‌ సెట్‌ చేసుకున్నాడు. గత ఏడాది విడుదలైన చిత్రాల్లో ‘తొలిప్రేమ’ నా ఫేవరేట్‌ మూవీ. నటీనటులను ప్రెజెంట్‌ చేయడంలో కానీ.. మ్యూజిక్‌లో కానీ.. రైటింగ్‌లో కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. అలాగే “మిస్టర్ మజ్ను”ని కూడా కేర్‌ తీసుకుని తెరకెక్కించాడు. థమన్‌ అద్భుతమైన పాటలను అందించాడు. ప్రతి సినిమాకు కొత్త తరహా మ్యూజిక్‌ అందిస్తున్నాడు. నిధికి ఈ సినిమాతో పెద్ద సక్సెస్‌ దక్కుతుందని భావిస్తున్నాను. తెలుగులో చాలా పెద్ద సక్సెస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ప్రసాద్‌గారు.. ఆయన నిర్మాణంలో “మిస్టర్‌ మజ్ను”సినిమా రూపొందడం ఆనందంగా ఉంది. అఖిల్‌కు సపోర్ట్‌ చేయడానికి వచ్చిన ఎన్టీఆర్‌కి థాంక్స్‌” అన్నారు.
అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ – ”సినిమాను మొదలు పెట్టి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయాలంటే మంచి నిర్మాత కావాలి. ఈ సినిమాకు గాడ్‌ఫాదర్‌ బివిఎస్ఎన్‌. ప్రసాద్‌గారు. మా తాతగారితో సినిమా చేసిన ఆయన నన్ను నమ్మి సినిమా చేసినందుకు ఆనందంగా, గర్వంగా ఉంది. ప్రతి సినిమాకు కష్టాలుంటాయి. కష్టాలు ముఖ్యం కాదు. వాటిని ఎలా దాటుతామనేదే ముఖ్యం. మా డైరెక్టర్‌ వెంకీకి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ సహా అందరికీ థాంక్స్‌. తమన్‌ ఆరు అమేజింగ్‌ సాంగ్స్‌ను అందించాడు. ఈ ఆల్బమ్‌ నాకు ఎంతో స్పెషల్‌. శేఖర్‌ మాస్టర్‌గారు.. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇక డైరెక్టర్‌ వెంకీ నాకు మంచి ఫ్రెండ్‌. మూడేళ్ల క్రితం నాకు తను ఈ స్క్రిప్ట్‌ చెప్పాడు. మూడో సినిమాకు ఈ స్క్రిప్ట్‌ కరెక్ట్‌, వెయిట్‌ చేస్తావా? అన్నాను. తను సరేనని వెయిట్‌ చేసి ఇప్పుడు సినిమా తీశాడు. తను నాకు పెద్ద ఫ్యాన్‌. నా కోసం వెయిట్‌ చేసినందుకు తనకు థాంక్స్‌. నా మెంటర్‌, గైడ్‌ నాన్నగారే. ఆయన నాకు స్నేహితుడు.. పెద్దన్నయ్యతో సమానం. ఆయన ఇచ్చే సపోర్ట్‌, ఇచ్చే గైడెన్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. ఎన్టీఆర్‌ని నేను టైగర్‌ అనే పిలుస్తాను. నిజంగా ఆయన టైగర్‌. ఎందుకంటే ఆయన ఎనర్జీని ఎవరూ మ్యాచ్‌ చేయలేరు. తారక్‌గారు అంటే ఆయన తట్టుకోలేరు. తారక్‌కి ఇక్కడ వచ్చినందుకు థాంక్స్‌. తను ఈ ఫంక్షన్‌కి వస్తున్నానని చెప్పగానే తనకు థాంక్స్‌ మెసేజ్‌ పంపాను. ‘అరే అలా ఫార్మల్‌గా ఉండకు. ఇది నా బాధ్యత’ అని తను అన్నాడు. అక్కినేని అభిమానులకు, ఎన్టీఆర్‌ అభిమానులకు థాంక్స్‌. మీరే మా ధైర్యం, మా అండ” అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ – ”తారక్‌ సార్‌ ఏ ఫంక్షన్‌కి వచ్చినా పాజిటివ్‌ వైబ్స్‌ కమ్ముకుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి వాతావరణం కనపడుతుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌గారికి థాంక్స్‌. సినిమా గురించి చెప్పాలంటే, నేను అక్కినేని అభిమానిని. నేను థియేటర్‌లో చూసిన తొలి సినిమా ‘శివ’ ఆ సినిమాలో చైన్‌లాగడం చూసి నేను కూడా చైన్‌ లాగితే గ్రీజు అంటుకుంది కానీ.. చైన్‌ రాలేదు. ‘ప్రేమ్‌నగర్‌’ను చూసి అలాంటి ఓ సినిమా చేయాలనుకున్నాను. అందుకే ఆ సినిమాలో ఇంపార్టెంట్‌ డైలాగ్‌, ‘ఎక్స్క్యూజ్ మీ మిస్’ ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌కు పెట్టాం. థమన్‌, జార్జ్‌, సతీష్‌, అవినాష్‌ నవీన్‌, శేఖర్‌ మాస్టర్‌, ఆది, రాజా, ప్రియదర్శి, శ్రీమణి.. ఇలా అందరం హార్ట్‌ పెట్టి పనిచేశాం. సినిమా రేంజ్‌ ఏంటో చెప్పలేను కానీ.. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మా ప్రయత్నాన్ని సపోర్ట్‌ చేయాలని కోరుతున్నాం” అన్నారు.

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ – ”నాగార్జునగారికి, ఎన్టీఆర్‌గారికి, చైతన్యకి, అఖిల్‌కి థాంక్స్‌. తమన్‌ మ్యూజిక్‌, జార్జ్‌ విజువల్స్‌కు థ్రిల్‌ అయ్యాను. నాకు అవకాశం ఇచ్చిన వెంకీకి థాంక్స్‌” అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ మాట్లాడుతూ – ”జీవితంలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. అలాంటి నమ్మకాన్ని నాపై పెట్టుకున్న దర్శకుడు వెంకీకి థాంక్స్‌. ఆ భయంతోనే ఈ సినిమాకు మ్యూజిక్‌ అందించాను. శ్రీమణి ట్యూన్‌కు తగినట్లు సాహిత్యాన్ని అందించాడు. ఆల్బమ్‌ను సక్సెస్‌ చేసిన అందరికీ థాంక్స్‌. బెస్ట్‌ ఔట్‌ పుట్‌ ఇచ్చాం. జనవరి 25 వరకు వెయిట్‌ చేయాలంటే కష్టంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇక ఎన్టీఆర్‌.. నాకు తెలిసి ఆయన ప్రేమ చాలా గొప్పది. నాపై నమ్మకంతో ‘అరవిందసమేత’ సినిమా ఇచ్చారు. ఆయనకు థాంక్స్‌” అన్నారు.

పాటల రచయిత శ్రీమణి మాట్లాడుతూ – ”తమన్‌తోగారి మ్యూజిక్‌లో పాటలు రాయడం చాలా హ్యాపీ. వెంకీ అట్లూరిగారు అన్ని సిచ్యువేషన్స్‌కు తగ్గట్టు లిరిక్స్‌ రాయించుకున్నారు. అలాగే బివిఎస్ఎన్‌ ప్రసాద్‌గారికి థాంక్స్‌” అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ – ”అఖిల్‌ 25న సందడి చేయబోతున్నారు. అవకాశం ఇచ్చిన ప్రసాద్‌గారికి, వెంకీ అట్లూరికి థాంక్స్‌” అన్నారు.

1