118 మూవీ రివ్యూ

Published On: March 1, 2019   |   Posted By:

కళ్యాణ్ రామ్ ‘కల’ తీరేటట్లు లేదు ( ‘118’ రివ్యూ) 

రేటింగ్ : 2/5

 అనగనగా ఓ జర్నలిస్ట్..అతని పేరు గౌతమ్‌ (కల్యాణ్‌రామ్‌) . అతను పోలీస్ డిపార్టమెంట్ కూడా సాల్వ్ చేయలేని కేసులు ఫింగర్ టిప్స్ పై సాల్వ్ చేస్తూంటాడు. షెర్లాక్ హోమ్స్ కథలు అవీ బాగా చదువుతాడేమో…అలా బిహేవ్ చేస్తూంటాడు. అయితే అతను షెర్లాక్ హోమ్స్ కూడా సాల్వ్ చేయటానికి సాహసించని ఓ కేసు చేపడతాడు. అదేంటంటే…తనకు వచ్చిన కల ఆధారంగా ఓ మర్డర్ మిస్టరీని ఛేధించాలనుకుంటాడు. క్లూలు దొరికితేనే కేసులు తేలటం కష్టమనుకునే క్రైమ్ లు జరుగుతున్న ఈ రోజుల్లో “కల”నే క్లూ గా భావించి ముందుకు వెళ్తాడు.


ఇంతకీ ఆ కలలో ఏముంది…


ఆ కలలో ఓ అమ్మాయి (నివేదా థామస్‌) కనిపిస్తుంది. సర్లే పడుకుంటే అనేక కలలు, అందులో అందమైన అమ్మాయిలు వస్తూంటారు అందులో పెద్ద వింతేముంది అని కొట్టిపారేయచ్చు. కానీ అది అలాంటి,ఇలాంటి కల కాదాయే… ఆ అమ్మాయిని ఎవరో గుర్తు తెలియని వాళ్లు చంపుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమెను కారులో పెట్టి ఓ లోయలోకి తోసేస్తారు. ఇంత ఇంట్రస్టింగ్ కల వచ్చినప్పుడు ఏ రచయితో అయితే దాన్ని ఓ క్రైమ్ ఫిక్షన్ కధ రాసేద్దుడు. మామూలు వాళ్లు అయితే మర్చిపోయేందుకు ప్రయత్నం చేద్దురు. ఆ గదిలో ఏ దెయ్యమో ఉంది..అలాంటి కలలు రప్పిస్తోందని ప్రచారం చేసి ఆ హోటల్ పరువు తీసేద్దురు. కానీ ఆ హోటల్ లో ఉన్నది ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్…అదీ హీరో కావటంతో ఇన్విస్టిగేషన్ మొదలెట్టేస్తాడు. అతని వృత్తి ధర్మం అది. ఏదైనా చివరకు కలైనా సరే తేల్చాల్సిందే.


ఇంతకీ ఆ కల ఎప్పుడొస్తుందో…


ఆ కల కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా రాదు. ప్యారడైజ్ రెస్టారెంట్ లో  118 రూమ్ లో పడుకుంటే కరెక్ట్ గా 1.18 నిముషాలకు ఆ కల వస్తుంది.  అందుకే హీరో ఆ కల కోసం కలవరించిపోతూంటాడు. తన ఒక్కడికేనా ఆ కల వచ్చింది…లేక ఆ రూమ్ లో ఎవరు పడుకున్నా ఆ కల వస్తుందా అని ఎంక్వైరీ చేస్తూంటాడు. ఆ కల కూడా రోజూ రాదు. వస్తే పోలీస్ లు కూడా ఆ గదిలోకి వెళ్లిపడుకుని ఆ కలను రప్పించుకుని..ఆ మర్డర్ మిస్టరిని ఛేధించేసేవాళ్లు. ఆ కల కేవలం పౌర్ణమి రోజే వస్తుంది. ఎందుకలా అన్ని కండీషన్స్ పెట్టుకుని ఆ కల వస్తుంది.


ముక్కలు ముక్కలుగా…


పోనీ ఆ వచ్చే కల అయినా పూర్తిగా ఓ కథలాగ వచ్చేస్తే అర్దమైపోతుంది. టీవి సీరియల్ లాగ ముక్కలు ముక్కలు గా ఎపిసోడిక్ విధానంలో వస్తుంది. వాటిన్నిటిని కలుపుకుని ఓ పజిల్ లా సాల్వ్ చేయాల్సిన పరిస్దితి హీరోకు వస్తుంది. సర్లే మొదలెట్టాం కదా అని హీరోగారు ఆ ఇన్విస్టిగేషన్ ని కొనసాగిస్తాడు. కలను కనుక్కుంటూ అప్పుడప్పుడూ ఆ మిగతా కల ముక్క కోసం వెయిట్ చేస్తూ..ఆ కలల్లోంచి క్లూ లు తీసుకుంటూ ఆ నివేదిత అనే అమ్మాయిని ఎవరు చంపారో, ఎందుకు చంపారో తేలుస్తాడు. ఇంతకీ ఎవరా అమ్మాయి?ఇలా కలల రూపంలో జనాలకు పజిల్స్ ఎందుకు వదులుతోంది? అంటే …మీరు సినిమా చూడాలి. అదీ చెప్పేస్తే ఇంక కథలో సస్పెన్స్ ఏముంటుంది.  

గుహన్ కల వలలో కళ్యాణ్ రామ్… 


కళ్యాణ్ రామ్ కు ఏమో ఏదో ఒక డిఫరెంట్ సినిమా చేసి హిట్ కొట్టాలని  కోరిక. అందుకోసం అనేక సిని ప్రయోగాలు చేస్తూంటాడు. ఈ విషయం అర్దం చేసుకున్న ప్రముఖ ఛాయాగ్రాహకుడు గుహన్ ఈ కల అనే కథతో కళ్యాణ్ రామ్ ని ఒప్పించి డేట్స్ పట్టి సినిమా చేసేసాడు. డైరక్టర్ గా ఆయన కథ విషయంలో తప్పించి మిగతా విషయాల్లో మంచి మార్కులు వేయచ్చు. కళ్యాణ్ రామ్ కొత్తగా చేద్దామనుకుంటాడు కానీ అదేంటో ఎప్పటిలాగే ఉంటుంది అతని నటన. క్రాఫ్, డ్రస్ తప్ప పెద్దగా మార్పులు ఉండవు.


ఇద్దరు హీరోయిన్స్  ఉన్నా…


సాధారణంగా పూర్వం రోజుల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్లాన్ చేసేసేవారు. కానీ ఇందులో ఒక్క లవ్ కే దిక్కులేదు. నివేదా అసలు కథ ప్రారంభం నాటికే చనిపోయింది . కాబట్టి ఆమెతో హీరోకు అసలు పనేలేదు ఇక మిగిలింది షాలిని పాండే. హీరో ఎప్పుడు కలలు, క్లూలు అంటూ తిరుగుతుంటే ఆమె ఏం చేస్తుంది అతను గురించి కలలు కనటం తప్ప. పోనీ ఆ కలల్లో ఏమన్నా డ్రీమ్ సాంగ్స్ వేసుకుందామనుకున్నా డైరక్టర్ గారు ఆ అవకాసం ఇవ్వలేదు. 

 మిగతా డిపార్టమెంట్ లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన శేఖర్ చంద్ర సినిమాకు బాగా ప్లస్. మిగతావన్ని గొప్పగానూ లేవు చెత్తగానూ లేవు. 


ఆఖరి మాట..


సినిమావాళ్లు కలలు వ్యాపారం చేస్తారనే మాటకు అర్దం ఇది కాదేమో..

తెరకు ముందు..వెనుక 


నటీనటులు: కల్యాణ్‌రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే, నాజర్‌, హర్షవర్థన్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు

సంగీతం: శేఖర్‌ చంద్ర

ఎడిటింగ్‌: తమ్మిరాజు

సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్‌

నిర్మాత: మహేష్‌ ఎస్‌ కోనేరు

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.గుహన్‌

బ్యానర్‌: ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌

విడుదల తేదీ: 01-03-2019