3 ఏళ్ళ గోపాల గోపాల

Published On: January 10, 2018   |   Posted By:
3 ఏళ్ళ గోపాల గోపాల
“దైవ‌త్వం కంటే మానవత్వమే మిన్న” అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ‘గోపాల గోపాల’. విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రియ, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా.. 2012లో  విడుదలైన హిందీ చిత్రం ‘ఓహ్ మై గాడ్’కి రీమేక్ వెర్ష‌న్‌గా తెర‌కెక్కింది. ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ త‌రువాత మ‌రో స్టార్ హీరోతో వెంక‌టేష్ న‌టించిన చిత్ర‌మిది. ఇందులో ప‌వ‌న్ పాత్ర సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అలాగే ప‌వ‌న్‌ ప‌లికే ప్ర‌తి డైలాగ్ కూడా బాగా పాపుల‌ర్ అయ్యింది.  డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి యువ సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ అందించిన స్వ‌రాలు ప్లస్ అయ్యాయి.  సిరివెన్నెల, చంద్రబోస్‌, అనంత శ్రీరామ్‌ రాసిన మూడు పాటలు కూడా క‌థలో భాగంగా వ‌చ్చి ఆకట్టుకునేలా ఉంటాయి.
సంక్రాంతి సందర్భంగా జనవరి 10,  2015 న విడుదలైన ఈ సినిమా.. నేటితో 3 సంవత్సరాలను పూర్తిచేసుకుంటోంది. స‌రిగ్గా అదే రోజున‌(జనవరి 10,  2018) మళ్ళీ ప‌వ‌న్ కొత్త చిత్రం ‘అజ్ఞాతవాసి’ విడుద‌ల కానుండ‌డం.. అందులో వెంక‌టేష్ ఓ అతిథి పాత్ర చేయ‌డం యాదృచ్ఛికం.