సందీప్ ఔర్ పింకీ ఫరార్ హిందీ మూవీ రివ్యూ

Published On: May 22, 2021   |   Posted By:
సందీప్ ఔర్ పింకీ ఫరార్ హిందీ మూవీ రివ్యూ
 
పరార్: ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్'( హిందీ) రివ్యూ

రేటింగ్ : 2/5

దిబాకర్ బెనర్జీ వంటి పేరున్న దర్శకుడు, పరిణితి చోప్రా వంటి స్టార్ హీరోయిన్ తో కలిసి చేసిన సినిమా ఓటీటిలో వస్తోందంటే చూడకుండా ఉండగలమా అనేది సగటు ప్రేక్షకుడు మనకు వేసే ప్రశ్న. ట్రైలర్స్ తో క్రేజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియోటర్స్ లో రిలీజ్ అయ్యింటే మంచి ఓపినింగ్సే వచ్చేవి. ఇంక అతడి పేరు పింకీ.. ఆమె పేరు సందీప్‌. వాళ్ల పేర్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి..? వాళ్లిద్దరి మధ్య సంబంధం ఏంటి.? అసలు వాళ్లిద్దరూ కలిసి భారత్‌-పాకిస్థాన్‌ సరహద్దు దాటాలని నిర్ణయించుకోవడానికి దారి తీసిన కారణాలేంటి..? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ అంటూ పబ్లిసిటీ చేసారు.అది ప్లస్ అయ్యింది. ఇంతకీ అసలు ఈ సినిమా కథేంటి…ఎలా ఉంది..చూడదగినదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
స్టోరీ లైన్
 
ఒక పెద్ద బ్యాంక్ చైర్మన్ అయిన పరిచయ్ అనే వ్యక్తి కోసం సందీప్ ఉరఫ్ శాండీ(పరిణితి చోప్రా) ఒక రెస్టారెంట్ లో ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి సార్ మీటింగ్ లో ఉన్నాడు లేట్ అవుతుందని నన్ను పంపించాడు అని ఆమెను కార్ లో తీసుకుని వెళ్తారు. అయితే అలా వెళ్తూ అతను ఫోన్లో మాట్లాడుతున్న తన పై ఆఫీసర్ కు తమ కార్ నంబర్ చెప్పమంటే తమ కార్ ను ఓవర్ టేక్ చేస్తూ తమను తిట్టుకుంటూ వెళ్ళిన వారి కార్ నంబర్ పొరపాటున చెప్తాడు. దాంతో తన కళ్ళ ముందే ఆ కార్ లో ఉన్న వాళ్ళను పోలీసులు చంపేస్తారు. దానికి పింకీ షాక్ అయ్యి శాండీ తో కలిసి పారిపోతాడు ఒక బ్యాంక్ స్కాం లో ఉన్నందుకు శాండీ నీ చంపలనుకున్న వాళ్లే ఆమెను సేవ్ చేసినందుకు పింకీని కూడా చంపాలి అనుకుంటారు మరి వాళ్ళ నుంచి శాండీ పింకీ తప్పించుకున్నారా?? లేదా??? చివరకు ఏం జరిగింది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

డార్క్ కామెడీనే కానీ…

అసలు ‘సందీప్‌ ఔర్‌ పింకీ’ అంటే ఎవరైనా ఏమనుకుంటారు? సందీప్‌ అబ్బాయి పేరు, పింకీ అమ్మాయి పేరు అనే కదా. కానీ ఇక్కడ తారుమారు అయ్యాయి. సందీప్‌ అంటే అమ్మాయి.. పింకీ అంటే అబ్బాయి. ఈ పాయింటే దగ్గరే క్యూరియాసిటీ లేపారు. అయితే కథ ఆలోచన ఆ పాయింట్ దాటి వెళ్లలేదనిపిస్తుంది. ఈ సినిమా ఓ డార్క్ కామెడీ అనటంలో సందేహం లేదు. అయితే డార్క్ కామెడీ లక్షణాలు ఉన్నా…లక్ష్యం మాత్రం నెరవేరలేదు. టార్గెట్ ఆడియన్స్ అనే క్లాసిఫికేషన్ ఇక్కడ జరగలేదు. సినిమా మొదట పదినిముషాల్లోనే మనం చూడబోయేది ఫలానా జానర్ అని అర్దం కాకపోతే దాన్ని ఫాలో అవటం కష్టం. ఇక్కడే అదే జరిగింది. అక్కడక్కడా కాస్తంత తెలివిగా,థ్రిల్లింగ్ గా, కుట్ర ఉంది అనిపించేలా స్క్రీన్ ప్లేని డిజైన్ చేసారు. అక్కడక్కడా ఈ సినిమా లో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ ఉన్నాయి ,అవన్నీ ఈ సినిమాని ఓ సస్పెన్స్  ఫుల్ డార్క్ కామెడీగా ప్రొజెక్టు చేసాయి కానీ అంతకు మించి ఏమీ చేయలేకపోయాయి. కథపరంగా విస్తరణ జరగలేదు.

స్టోరీలైన్ గా చేస్తే .. ఇలాంటి ఎన్నో సినిమాలు మనం ఇప్పటికే చాలా చూసేసి ఉంటాం .ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ లేకుండా సినిమా అలా ఫ్లాట్ గా సాగి… పోతూ ఉంటుంది.కనీసం ఒక్కసారి కూడా మనం పాత్రల కోసం ఆలోచించడం వాళ్లకు ఏమీ కాకూడదు అని కోరుకోవడం జరగదు. అయితే అలాంటిది జరగాలని దర్శకుడు శాండీ పాత్ర కు ప్రెగ్నన్సీ అని చూపించినా ఎందుకో ఆ రీజన్ కూడా మనకు కనెక్ట్ అవదు. సినిమా స్టార్ట్ అవడం ఇంట్రెస్టింగ్ గానే జరిగినా ఒకసారి కథ ఓపెన్ చేసిన తర్వాత ఆడియన్స్ కు ఆ పాత్రల మీద ఉన్న ఇంట్రెస్ట్ పోవడం మొదలై అది కంటిన్యూ అవుతూ వెళ్లిపోయింది.

ఒక బాంక్ ప్రజలకు ఎక్కువ వడ్డీ అలాగే ఎమర్జెన్సీ లోన్ ఆఫర్ ఇస్తూ వాళ్ళతో లక్షలకు లక్షలు డబ్బులు డిపాజిట్ చేయించుకోవడం ఆ బ్యాంక్ అకౌంట్ ఉపయోగించి గవర్నమెంట్ నుంచి లోన్స్ తీసుకోవడం లాంటి దారుణమైన మోసాల గురించి మూవీ లో డిస్కస్ చేసినా కథ కథనాల విషయాల్లో జాగ్రత్తగా ఉండుంటే సినిమా మరొక విధంగా ఉండేది. కనీసం ఒక చిన్న ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అయినా సినిమాలో క్రియేట్ చేయలేక పోయారంటే స్క్రిప్ట్ ఎంత వీక్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి ఇలాంటి సినిమాల్లో తమని తరుముకొస్తున్న శత్రువుల నుంచి పారిపోతున్న హీరో హీరోయిన్ ల పాత్రలకు ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు వాటిని తమ తెలివితో దాటుకుంటు వాళ్ళు తప్పించు కోవాలనుకోవడం లాంటివి ఉంటే అప్పుడు కథనంలో వేగం పెరిగినకొద్దీ సినిమా చివరి వరకు ఏం జరుగుతుంది అనే టెన్షన్ తో ప్రేక్షకులు పాత్రలతో పాటు జర్నీ చేస్తూ ఎంజాయ్ చేయగలుగుతారు. అలాంటివేం అవసరం లేదనుకున్నారో లేక కొత్తగా ట్రై చేస్తున్నాం అనుకున్నారో కానీ అలాంటి ఎలిమెంట్స్ కు అవకాసం ఇవ్వలేదు.

టెక్నికల్ గా..

సంగీతం, కెమెరా పనితనం ఆర్ట్ డైరెక్షన్ ఇవన్నీ పర్వాలేదు అనే స్టేజీ లోనే ఆగిపోయాయి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.ఇక ఈ సినిమా దర్శకుడు దివాకర్ బెనర్జీ గతంలో షాంఘై, లవ్ సెక్స్ ఔర్ డోకా అనే మంచి సినిమాలు చేసినా నేను చెత్త సినిమాలని కూడా తీయగలను దీంతో ప్రూవ్ చేసుకున్నట్లు అయ్యింది కథా కథనాలతో పాటు డైలాగ్స్ కూడా ఎలాంటి ఇంపాక్ట్ చూపించని ఈ సినిమా మన సహనాన్ని పరీక్షిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

నటీనటుల విషయానికి వస్తే ఉన్నంతలో పరిణితి చోప్రా తన పాత్రనే బాగానే చేసింది సినిమాలో అంతో ఇంతో చూడగలిగాము అంటే అది ఆమె పుణ్యమే అని చెప్పుకోవాలి. ఇక అర్జున్ కపూర్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి అని మనం అనుకోవడం అత్యాశే అవుతుంది. ఆ విషయంలో నేను జీరో అని తను ఇప్పటికే చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడూ అదే పనిచేసాడు.  మిగతా పాత్రల్లో చేసిన నటులు కూడా ఏదో మమ అనిపించారు.

ప్లస్ పాయింట్స్ :

పరిణీతి చోప్రా

మైనస్ పాయింట్స్ :

కథా, కథనాలు
స్లో నేరేషన్
మెరుపులు లేకపోవడం

చూడొచ్చా?? :  

మరీ ఖాళీగా ఉన్నాం..లాక్ డౌన్ టైమ్ లో పరిణితి చోప్రా ఉంది కదా అనుకుంటే ట్రై చేయచ్చు!!!

ఎవరెవరు..

నటీ నటులు : అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా, జయదీప్ అహ్లావత్, నినా గుప్తా తదితరులు
సంగీతం : అనూ మాలిక్, దిబాకర్ బెనర్జీ
దర్శకత్వం : దిబాకర్ బెనర్జీ
నిర్మాత : దిబాకర్ బెనర్జీ
ఓటీటి : అమెజాన్ ప్రైమ్
రిలీజ్ డేట్: మే 21, 2021
రన్ టైమ్ : రెండు గంటల మూడు నిమిషాలు