అనుకోని అతిథి మూవీ రివ్యూ

Published On: May 28, 2021   |   Posted By:

అనుకోని అతిథి మూవీ రివ్యూ

సాయి పల్లవి ‘అనుకోని అతిథి’ రివ్యూ

Rating:3/5

మనకు తెలుగులో సైక్లాజికల్ థ్రిల్లర్స్ అరుదనే చెప్పాలి. మనం ఈ తరహా సినిమాలు చూడాలంటే డబ్బింగ్ సినిమాలను ఆశ్రయించటం తప్పనిసరి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడీ మళయాళ థ్రిల్లర్ మన ముందుకు వచ్చింది. ప్యాక్డ్ స్క్రీన్ ప్లే తో, అదిరిపోయే క్లైమా్స్ ట్విస్ట్ తో ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ అయ్యింది. స్క్రిప్టు తో పోటీగా అటు సాయి పల్లవి, ఫహ‌ద్ ఫాజిల్ అత్యుత్త‌మ స్థాయి న‌ట‌న‌ చూపించారు. ఆహా ఓటీటిలో ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం కథేంటి…మన తెలుగువాళ్ళకు నచ్చే సినిమాయేనా ,సాయి పల్లవి ఫ్యాన్స్ ఈ సినిమా మరో సారి నచ్చేస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 
స్టోరీ లైన్

నంద (ఫహ‌ద్ ఫాజిల్), ఓ యంగ్ సైక్రాటిస్ట్ ఓ మారుమూల ఉన్న మెంటల్ హాస్పటిల్ కు వస్తాడు. ఆ పిచ్చాసుపత్రిపై అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి నిమిత్తం చెక్ చేయమని గవర్నమెంట్ పంపుతుంది. ఆ పిచ్చాసుపత్రిని బెంజిమెన్ (అతుల్ కులకర్ణి) మెయింటైన్ చేస్తూంటాడు. ఆయన పాత కాలం పద్దతులతో పేషెంట్స్ ని ట్రీట్ చేయటం నందకు నచ్చదు. ముఖ్యంగా మెమెరీ ఎరేజెర్ టెక్నిక్ అని పేషెంట్ ని హిప్నాటిజంలోకి పంపి చేస్తూంటాడు. ఇక అక్కడ అదే హాస్పటిల్ లో నిత్య(సాయిపల్లవి)అనే పేషెంట్ ఉంటుంది. ఆమె గురించి రికార్డ్ లలో ఎక్కడా ఉండదు. కానీ ఆమెకు స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తూంటారు. ఇది నందకు అనుమానం తెప్పించి పరిశోధన ప్రారంభింస్తాడు. అయితే బెంజిమెన్ కు ఇదంతా నచ్చదు. వెళ్లిపోమ్మని బెదిరిస్తాడు. హత్యా ప్రయత్నం కూడా చేస్తాడు. అక్కడ నుంచి కథ అనేక ట్విస్ట్ లతో ముందుకు వెళ్తుంది. చివరకు ఏమైంది..అసలు సాయి పల్లవి ఎవరు..ఆమె పిచ్చాసుపత్రిలో ఎందుకు ఉంది…ఆ హాస్పటిల్ పై వచ్చే కంప్లైంట్స్ నిజమేనా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్…

దర్శకుడు వివేక్…ఈ సినిమాని  ట్విస్టింగ్ లాజిక్ ల‌తో ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోయే ఎంట‌ర్ టైన్ మెంట్ లా తీర్చిదిద్దాడు. క‌థ‌లో భాగంగా ఒక ఓ స్పెషల్ వరల్డ్ ని క్రియేట్ చేసి  , ఏది నిజమో, ఏది కాదో అన్న రీతిలో ప్రేక్ష‌కుడిని ఊగించి స‌ర్ ప్రైజ్ లు ఇచ్చాడు. అప్ప‌టి వ‌ర‌కూ క‌నిపించిన కథ క్లైమాక్స్ లో షాకింగ్  ట్విస్ట్ ఇస్తుంది.ఈ కథకు  ‘Shutter island’ ,‘Stonehearst Asylum’ ప్రేరణ ఇచ్చి ఉండవచ్చు. కానీ స్క్రీన్ ప్లేని చక్కగా రాసుకుని ఎక్కడా తడబడకుండా, చ‌క్క‌గా ఎగ్జిక్యూట్ చేస్తూ తెరకెక్కించిన తీరు ద‌ర్శ‌కుడు ప‌ని త‌నానికి నిద‌ర్శ‌నంగా ఉంటుంది. అత్యుత్త‌మ స్థాయి న‌ట‌న‌తో, నేర్పుతో అల్లుకున్న స్క్రిప్ట్ తో తెరకెక్కిన క్లాసిక్ థ్రిల్ల‌ర్ ఈ  సినిమా‌.

ముఖ్యంగా పాత్రలకు సంభందించిన మిస్టరీని,మేనేజ్ చేసి సర్పైజ్ చేయటం బాగుంది. అయితే ఒక్కోసారి అదే కన్ఫూజ్ కూడా చేసింది. ఇక ఎప్పుడైతే సాయి పల్లవి గతం రివీల్ అవుతుందో అప్పుడు కథ కాస్త ఇంట్రస్ట్ తగ్గుతుంది. అయితే అనుకోని ట్విస్ట్ మాత్రం క్లైమాక్స్ లో మెస్మరైజ్ చేస్తుంది. కాకపోతే పైన చెప్పిన హాలీవుడ్ సినిమాలు చూసినవాళ్లు ఆ ట్విస్ట్ ని గుర్తు పట్టేయచ్చు. అలాగే సినిమాలో కొన్ని సీక్వెన్స్ లు నిజంగానే భయంగా అనిపిస్తాయి. హారర్ మూవి చూస్తున్న ఫీల్ ని కలగ చేస్తాయి. అన్ని బాగానే ఉన్నా పాటలు మాత్రం అర్దాంతరంగా కథలోకి రావటం మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది.
  
టెక్నికల్ గా…
 
ఈ సినిమాకు రైటింగ్ డిపార్టమెంట్ చాలా వరకు ప్లస్ అయ్యింది దర్శకుడు వివేక్ విషయానికి వస్తే ఈ సబ్జెక్టును డీల్ చేసిన విధానం బాగుంది,మేకింగ్ కూడా బాగుంది. కానీ ఫస్టాఫ్ ఉన్న రీతిలో లేదు.ఫస్టాఫ్ ప్లోనే సెకండాఫ్ లో కూడా కొనసాగించి ఉంచితే ఇంకా బెటర్ అవుట్ పుట్ వచ్చి ఉండేది. అలాగే తన సాయశక్తులా ఎక్కడా మిస్టరీ రివీల్ అవకుండా ఈ  థ్రిల్లల్ ని డీల్ చేసిన విధానాన్ని కానీ దానిని ముగించిన విధానాన్ని కానీ మెచ్చుకోవచ్చు. మంచి నిర్మాణ విలువలు మొదట నుంచి ఉన్నాయి. అలాగే కెమెరా వర్క్ చాలా బాగుంది.  సంగీతం పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, లిరిక్స్ ఫ్రెష్ గా అనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. డబ్బింగ్ కూడా తరుణ్ చెప్పటం బాగుంది. డైలాగులు నాచురల్ గా కథలో కలిసిపోయాయి.  జిబ్రాన్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు గొప్ప నిండుతనం తెచ్చిపెట్టింది. సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. అందరూ అద్బుతమైన ఆర్టిస్ట్ లే. సాయి పల్లవి అయితే ఈ సినిమాలో ఒక్క డైలాగు లేకుండా నటనతో నడిపించేసింది.

చూడచ్చా…

“అనుకోని అతిథి” రీసెంట్ టైమ్స్ లో కొత్తదనం కోరుకునే వారికి అందులోనూ థ్రిల్లర్ స్టోరీ చూడాలనుకునేవారికి బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కూడా కలిసి చూడచ్చు. అయితే కామెడి,ఫైట్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించకూడదు. 
 
తెర ముందు..వెనుక

బ్యానర్‌ : జయంత్‌ ఆర్ట్స్‌
నటీనటులు :సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి, రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతి కృష్ణ తదితరులు
మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి,
పాటలు: చరణ్‌ అర్జున్‌, మధు పమిడి కాల్వ,
ఎడిటింగ్‌: అయూబ్‌ ఖాన్‌,
కెమెరా: అను మోతేదత్‌,
స్క్రీన్‌ప్లే: పి.ఎఫ్‌. మాథ్యూస్‌,
నేపథ్య సంగీతం: జిబ్రాన్‌,
సంగీతం: పి.ఎస్‌. జయహరి,
ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిన్‌ శ్రీనివాస్,  
నిర్మాతలు:  అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్;
పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి,
రన్ టైమ్:  2గం|| 16ని||
ఓటీటీ:ఆహా
దర్శకత్వం: వివేక్‌
విడుదల తేదీ: 28,మే 2021