Reading Time: 3 mins

అవతార్-‌2 మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

మొత్తానికి అవతార్‌ సినిమా సీక్వెల్‌ అవతార్‌ ది వే ఆఫ్ వాటర్ థియేటర్స్‌లో వచ్చేసింది. భారత్‌లో ఈ రోజు (డిసెంబర్‌ 16) ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే లక్షలాది మంది ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకొని పండోరా ప్రపంచానికి చూసేసారు. ఈ సినిమా ఎలా ఉంది. జనాలకు నచ్చేలా ఉందా మొదటి పార్ట్ ని దాటగలిగిందా, అసలు ఈ చిత్రం కథేంటి, హైలెట్స్ ఏమిటి, మైనస్ లు ఏమిటి అనేది రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఫస్ట్ పార్ట్ లో పండోరా గ్రహంకు వెళ్లి అక్కడ నావిగా మారిన జేక్ (శామ్ వర్తింగ్‌టన్), అక్కడే సెటిలవుతాడు. మరో నావి నేతిరి (జో సల్దానా) పెళ్లి చేసుకుని, పిల్లలతో ఆనందంగా గడుపుతూంటాడు. అయితే అన్ని రోజులు ప్రశాంతంగా సాగవు కదా. అవతార్ క్లైమాక్స్‌లో చనిపోయిన కల్నల్ మైల్స్ (స్టీఫెన్ లాంగ్) నిజంగా చనిపోలేదు. ఇప్పుడు అతను పగ పట్టి , ప్రతీకారంతో రగిలిపోతూంటాడు. దాంతో పండోరా గ్రహానికి అతను నావిగా మారి తిరిగి వస్తారు. జేక్ మీద పగతో అతడిని అంతం చేయాలని ఫిక్స్ అవుతాడు. తనతో పాటు నావిలుగా మారిన కొంత మంది సైన్యంతో పండోరా గ్రహం మీద అడుగు పెడతాడు. అది గ్రహించిన జేక్ తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం అడవులు వదిలి దగ్గరలోని సముద్ర తీరానికి వెళతాడు. అక్కడ ఏం జరిగింది? జేక్‌ను చంపాలనే కల్నల్ ఏమయ్యారు? జేక్ తనను తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు ? ఈ కథలో టుల్‌కున్ (భారీ ఆకారంలోని చేప) క్యారక్టర్ ఏమిటి ఏం చేస్తూంటుంది వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

ఎలా ఉంది

ఈ సినిమా మొదటి భాగం పదమూడేళ్ల క్రితం వచ్చినప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలిజీ అప్పుడు లేదు. అప్పుడు కథ కూడా ఆ సినిమాకు అవసరమైంది. అయితే ఈ సారి కేవలం టెక్నాలిజీని ఆవిష్కరిస్తూ చిన్న స్టోరీ లైన్ తీసుకుని మన ముందుకు వచ్చాడు. దాంతో ఈ సినిమాలో స్క్రిప్టు, స్క్రీన్ ప్లే అంటూ చూస్తే ఏమీ ఉండదు. ఫార్ములా రివేంజ్ స్టోరీ కనిపిస్తుంది. అయితే విజువల్స్ మన కళ్లు నమ్మలేని స్దాయిలతో ఉంటాయి. అవతార్ ని మించిపోతాయి. టైటానిక్, ఏలియన్స్, ది అబీస్, ది టెర్మనేటర్ నాటి థీమ్స్, విజువల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో కనపడతాయి. పండోరా గ్రహం మీదకు వెళ్లి కెమెరా పెట్టి తీసినట్లుపగా అనిపించేలా విజువల్స్ ని మన ముందు పరుస్తాడు. ఈ సారి ఆయనకు పండోరా గ్రహం మీద పూర్తి గ్రిప్ వచ్చేసింది. ప్రతీ చిన్న డిటేల్ మనకు ఇవ్వగలగుతాడు. ఇక యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే అద్బుతం అనిపిస్తుంది.

అయితే హీరో కథగా చూస్తే ఈ సారి జాక్. భార్యా ,పిల్లలతో చక్కటి కుటుంబాన్ని ఈదుతూంటాడు. ఓ తెగకు నాయకుడు అయ్యాడు కాబట్టి వాళ్ల రక్షణ భాధ్యత తీసుకుని ఫైట్స్ చేస్తూంటాడు. మధ్యంలో విలన్ కు, అతని కొడుకు మధ్య సెంటిమెంట్ తో కూడిన కాంప్లిక్ట్ కూడా పెట్టారు. ఇలా కథను మనకు అర్దమయ్యేలా తీర్చిదిద్దాడు. హై ఎండ్ విజువల్స్ కు ఇలాంటి కథ ఆశ్చర్యం అనిపించినా, అదే బెస్ట్ టెక్నిక్ అనిపిస్తుంది. టైటానికి హిట్ అవ్వటానికి ఓ పేద,డబ్బున్న లవ్ స్టోరీ ఎలా అయ్యితే ఆలంబన చేసుకున్నాడో అలాగే ఇక్కడ కుటుంబం, ఓ విలన్, సెంటిమెంట్ , ఫైట్స్ అంటూ మాములు స్టోరీ లైన్ తీసుకుని ముందుకు వెళ్ళాడు. విజువల్స్ పక్కన పెట్టి కథ, స్కీన్ ప్లే అంటూ చూస్తూ కూర్చుంటే ఓ పాత రొట్ట సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. మనం కొత్తగా ఫీలయ్యేది ఏమీ మిగలదు. మొదటి పార్ట్ కు దీనికి తేడా ఏమిటి అంటే. అవతార్ లో పోరాటం అడవుల్లో సాగితుంది. అవతార్ 2 లో పోరాటం సముద్రంలోకి వచ్చింది మిగతాదంతా సేమ్ టు సేమ్.

టెక్నికల్ గా

హైఎండ్ టెక్నాలిజీ వాడుతూ జేమ్స్‌ కామెరూన్‌ చేసిన సినిమా ఇది. స్క్రిప్టే కాస్త సాగతీతగా అనిపించింది. తెలుగు డబ్బింగ్ డైలాగులు ఓకే. మ్యూజిక్, కెమెరా వర్క్, విజువ‌ల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ ఇలా ప్రతీ విబాగం తన సత్తాను చూపించింది. కామెరూన్ ఊహాశ‌క్తిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మొదటి పార్ట్ లో తెర‌పై సృష్టించిన పండోరా గ్ర‌హం మ‌రో అద్భుతం అనుకుంటే. ఇప్పుడు ఈ సినిమాలో నీటి ప్ర‌పంచాన్ని మహా అద్బుతం అనిపిస్తుంది. సాంకేతిక విభాగాల్లో ప్ర‌తి విభాగం అద్భుత‌మైన ప‌నితీరు క‌న‌బ‌రిచింది. VFX, CGI,3D టెక్నాలిజీలోని అడ్వాన్స్ వెర్షన్స్ తో ఈ సినిమా రూపొందించారు.

మోష‌న్ కాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందిన సినిమా కావటంతో ఆర్టిస్ట్ లు ప్రతీ షాట్ సవాలే. కానీ వాళ్లు ఆ ఛాలెంజ్ లో గెలిచారు. సామ్ వ‌ర్తింగ్‌ట‌న్ తండ్రిగా, ఓ తెగకు నాయ‌కుడిగా అత‌డు చ‌క్క‌టి ఎమోషన్స్ ప‌లికించాడు. ఫైట్ సీన్స్ లో అధరకొట్టాడు. నెగిటివ్ పాత్రలో కనిపించే స్టీఫెన్ లాంగ్ పెద్ద రాక్షసుడు అనిపిస్తాడు. జో స‌ల్దానా, సిగోర్నీ వీవ‌ర్‌, జోయ‌ల్, క్లిఫ్‌తోపాటు, కేట్ విన్‌స్లెట్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు.

హైలెట్స్

సముద్ర నేపధ్యం
VFX , CGI
కేట్ విన్స్లెట్
ప్రొడక్షన్, మేకింగ్ వేల్యూస్

మైనస్ లు :

సరైన ఎమోషన్స్ లేకపోవటం, కొద్ది సీన్స్ లో బోర్ లెంగ్త్

చూడచ్చా  :

ఖచ్చితంగా పెద్ద తెరపై చూడాల్సిన విజువల్ ట్రీట్, మిస్ కాకండి

తారాగణం :

సామ్‌ వర్తింగ్టన్‌, జోయా సాల్డానా, స్టీఫెన్‌లాంగ్‌, సిగర్నీ వీవర్‌, కేట్‌ విన్‌స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్ తదితరులు

సాంకేతిక వర్గం :

నిర్మాణ సంస్థ : లైట్‌స్ట్రోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్‌;
సినిమాటోగ్రఫీ : రస్సెల్‌ కర్పెంటర్‌;
ఎడిటింగ్‌ : స్టీఫెన్‌ ఈ. రివ్కిన్‌, డేవిడ్‌ బ్రెన్నర్‌, జాన్‌ రెఫౌవా;
సంగీతం : సైమన్ ఫ్రాంగ్లెన్‌;
నిర్మాతలు : జేమ్స్‌ కామెరూన్‌, జోన్ లాండౌ;
రన్ టైమ్ : 192 నిముషాలు
కథ, కథనం, దర్శకత్వం : జేమ్స్‌ కామెరూన్‌;
విడుదల తేదీ : 16-12-2022