Reading Time: 3 mins

అహింస మూవీ రివ్యూ

దగ్గుపాటి అభిరామ్  అహింస మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

ప్రతీ జనరేషన్ లోనూ కొత్త హీరోలు..ముఖ్యంగా వారసత్వ హీరోలు లాంచ్ అవుతూంటారు. ఆ హంగామా ఓ రేంజిలో ఉంటుంది.   కానీ అదేంటో ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు తెరంగ్రేటం ఎవరూ పట్టించుకోలేదు. స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు  చిన్న కొడుకు అభిరామ్ ‘అహింస’ సినిమాతో అరంగేట్రం చేశాడన్న విషయమే చాలా మందికి తెలియదు. కొత్త వాళ్లను పరిచయం చేయడంలో తనదైన శైలిని చూపించే సీనియర్ దర్శకుడు తేజ రూపొందించిన చిత్రమిది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది, కథేంటి… వర్కవుట్ అయ్యే కాన్సెప్ట్ యేనా చూద్దాం రండి

కథేంటి:
బావా మరదళ్లు అయిన రఘు (దగ్గుబాటి అభిరామ్) అహల్య (గీతిక) ఒకరంటే మరొకరికి ప్రాణం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వీళ్లద్దరకి ఎంగేజ్మెంట్ అవుతుంది. అదే సమయంలో ఇద్దరు సిటీ నుంచి వచ్చిన కుర్రాళ్లు ఆమెపై అత్యాచారం చేస్తారు. ప్రాణాపాయ స్దితిలో వీళ్లను హాస్పటిల్ లో చేర్చిన రఘు పోలీస్ కేసు పెట్టి న్యాయబద్దంగా వాళ్లపై పోరాటం మొదలెడతాడు. ఎందకంటే ఆవేశంకు , హింసకు  రఘు దూరం . కానీ న్యాయ బద్దంగా పోరాడుతూంటే వాళ్లు సాక్ష్యాలు తారుమారు చేసి కేసు వీగిపోయేలా చేస్తారు. అంతేకాదు ఆ కుర్రాళ్ల తండ్రి ధనలక్ష్మీ దుష్యంత్ రావు (రజత్ బేడి) సీన్ లోకి దిగి అందరినీ కొనేస్తాడు. ఈ క్రమంలో రఘుకు విషయం అర్దం అవుతుంది. తనలా ఉంటే ఈ ప్రపంచం ఆడుకుంటుందని అహింసను వదిలి హింసా మార్గంలోకి వచ్చి న్యాయం చేసుకుంటాడు. ఆ క్రమంలో ఏం జరిగింది చివరకు అహల్యకు న్యాయం జరిగిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

90వ దశకంలో   విపరీతంగా వాడేసి అరగదీసేసిన ఈ లైన్ పట్టుకుని ఇప్పుడు రెండున్నర గంటలకు పైగా నిడివితో సినిమా తీసేశాడు తేజ.  చిత్రం, నువ్వు నేను, జయం వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన  డైరక్టర్ తేజ సినిమాలంటే ఒకప్పుడు మంచి క్రేజ్. ఆయనకు  ఇంటెన్స్ లవ్ స్టోరీ ని బాగా డీల్ చేస్తారనే పేరు ఉంది. అయితే ఆయన సినిమాలు ఈ కాలం యూత్ ని ఏ మాత్రం ఆకట్టుకోవటం లేదు.  ఆ సినిమాలన్ని ట్రెండ్ కు దూరంగా ప్లాఫ్ లకు దగ్గరగా ఉంటూ వస్తున్నాయి. అయినా సరే  నిర్మాత సురేష్ బాబు తన రెండవ కుమారుడుని ఆయన చేతిలో పెట్టారు. అందులోనూ గతంలో పెద్ద కుమారుడు రానాకి ఒక రాజు..ఒక మంత్రి చిత్రంతో హిట్ ఇవ్వటం కూడా ఓ కారణం కావచ్చు. మరి తేజ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా అంటే లేదనే చెప్పాలి.  నిజంగా తన కొడుకుని పెద్ద హీరోని చెయ్యాలనుకున్నప్పుడు ఫామ్ లో ఉన్న దర్శకుడు చేతిలో పెట్టాల్సింది కానీ అవుట్ డేటెడ్ డైరక్టర్ చేతిలో పెట్టారేంటి అనేదే పెద్ద సందేహం.  హీరోయిన్ రేప్ కు  గురై ఆసుపత్రి బెడ్ మీద పడి ఉంటే.. ఇంకోవైపు ఒక లాయర్ సాయంతో హీరో కోర్టులో పోరాడే నేపథ్యంలోనే సగం సినిమా నడుస్తుంది. ఇంక ఇంట్రస్ట్ ఏమి ఉంటుంది. ఎమోషన్ పండుతుందనుకుని చేసిన సీన్స్ విసుగు తెప్పించాయి. ఏదైమైనా కథ,కథనం రెండూ బాగా వీక్. ఏదమైనా ఆడియన్స్‌కు పెద్దగా ఇంట్రెస్ట్‌ లేని కథతో కొత్తగా అభిరామ్‌ను లాంచ్‌ చేసేందుకు ప్రయత్నించాడు తేజ. ఓవరాల్‌గా మొదటి సినిమాతోనే ఫ్లాప్‌ ఖాతాలో వేసుకున్నాడు దగ్గుబాటి వారి అబ్బాయి.

బాగున్నవి:

కొన్ని  డైలాగులు
కెమెరా వర్క్

బాగోలేనివి:

రొటీన్ కథ , అంతకన్నా రొటీన్ గా సాగే స్క్రీన్ ప్లే
ఎమోషన్స్ పండకపోవటం

ఫెరఫార్మెన్స్ విషయానికి వస్తే :

నటన విషయంలో అభిరామ్‌ పూర్తిగా తేలిపోయారు . హీరోయిన్‌ గీతికా తివారి పర్ఫామెన్స్‌ ఉన్నంతలో బెస్ట్. ఈ సినిమాకు అంతో ఇంతో మ్యూజిక్‌ కాస్త సపోర్ట్‌గా నిలిచింది. మిగతా ఆర్టిస్ట్ లు సోసోగా చేసుకుంటూ వెళ్లారు. ఎవరదీ గుర్తుండిపోయే నటన కాదు.

టెక్నికల్ గా :

ఒకప్పుడు తేజ, ఆర్పీ పట్నాయక్‌కు మంచి హిట్‌ కాంబినేషన్‌ అనే పేరుంది. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో అప్పట్లో వచ్చిన చాలా సినిమాలు మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి వాళ్ల కాంబినేషన్‌ రిపీట్‌ అవలేదు కానీ ఫరావలేదు.  సినిమాటోగ్రఫీ విషయంలో మంచి మార్కులు పడ్డాయి.  ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. ఏదో మ్రొక్కుబడికి సినిమా చేసినట్లున్నారు. ఎడిటర్ రన్ టైమ్ 2 గంటల 42 నిముషాలు లో పై 45 నిముషాలు లేపేస్తే ప్రేక్షకులు స్పెషల్ ధాంక్స్ చెప్పుకుందురు.

చూడచ్చా :

ఇంత చదివాక కూడా ధైర్యం చేస్తానంటే అది దగ్గుపాటి కుటుంబంపై అభిమానం కావచ్చు .కానివ్వండి.

నటీనటులు :

అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్

సాంకేతికవర్గం :

మాటలు : అనిల్ అచ్చుగట్ల
పాటలు : చంద్రబోస్
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
సంగీతం : ఆర్పీ పట్నాయక్
నిర్మాత : పి. కిరణ్ (జెమినీ కిరణ్)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : తేజ
రన్ టైమ్ :162 మినిట్స్
విడుదల తేదీ: జూన్ 2, 2023